
వివాహిత అనుమానస్పద మృతి
కోదాడ
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం రేపాల గ్రామంలో దారుణం జరిగింది. స్థానికంగా వుంటున్న సోమపంగు కల్పన (26) అనే వివాహిత పురుగుల మందు తాగి మృతి చెందింది. మోతె మండల కేంద్రానికి చెందిన కల్పనకు 8 ఏళ్ల క్రితం మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన సోమపంగు పాపయ్యతో వివాహం జరిగింది. వీరికి గౌతమ్ (06) దేనుశ్రీ (04) అనే ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో ఏడాది పాటు మోతె తల్లిగారింటిలోనే కల్పన ఉంటోంది. ఈ మధ్యనే కొంతమంది బంధువుల సహకారంతో రేపాల కాపురానికి వచ్చినట్లు సమాచారం. వచ్చిన 20 రోజుల్లోనే కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, కల్పన ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.