
లారీ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులో ని కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం నుండి ద్విచక్ర వాహనం పై బయటకు వస్తున్న రఘునాథ రావు అనే వ్యక్తిని ఖమ్మం నుండి వైజాగ్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది. అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో వేగాన్ని నియంత్రించలేని లారీ డ్రైవర్ రహదారి పక్కనే ఉన్న పొదల్లోకి చొచ్చుకొని పోయాడు. లారీ అధిక వేగంతో వస్తున్న కారణంగా ప్రమాదం జరిగిన వెంటనే లారీ వెనుక చక్రాల మధ్య రఘునాధరావు ద్విచక్ర వాహనంతో పాటుగా ఇరుక్కుపోయాడు. దీంతో లారీ కొంతదూరం వరకు మృతదేహాన్ని ఈడ్చుకుంటూ పోయింది. ఈ ఘటన తో ప్రమాదానికి గురైన వ్యక్తి మృతదేహం నుజ్జునుజ్జయింది.మృతదేహాన్ని లారీ చక్రాల నుండి బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు కొనసాగిస్తున్నారు.