YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ విషయంలో రాజకీయం చేయడం తగదు

అగ్రిగోల్డ్ విషయంలో రాజకీయం చేయడం తగదు

అగ్రిగోల్డ్ విషయంలో రాజకీయం చేయడం తగదు
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది..
టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు 
- కుటుంబరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు
విజయవాడ 
అగ్రిగోల్డ్ అంశం చాలా సున్నితమైన సమస్య. 2015లో కేసు తెరపైకి రాగానే చంద్రబాబునాయుడు  నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం కేసును అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ గ్రూపులు 2004కి ముందు కేవలం రూ.84 కోట్లు మాత్రమే డిపాజిట్లు సేకరించగా.. 2004-14 మధ్య రూ.6,800 కోట్లు సేకరించడం జరిగింది. సెబీ రూల్స్, రిజర్వ్ బ్యాంకు రూల్స్ను వయోలేట్ చేసి మరీ అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్లు సేకరించినా.. వైఎస్తో సహా అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరి 2, 2015న తొలి కేసును నమోదు చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు అన్నారు.శనివారం అయన మీడియాతో మాట్లాడారు. 
కేసు తీవ్రతను గుర్తించి జనవరి 5న కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేవలం రెండే నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు 14,683 ఎకరాలను అటాచ్ చేయడం జరిగింది. 2018 నాటికి 21,642 ఎకరాలు అటాచ్ చేసింది. సెప్టెంబర్ 2015 నాటికి అటాచ్మెంట్లను జిల్లా కోర్టు ద్వారా ఆబ్సల్యూట్ చేయడం జరిగింది. కానీ డిపాజిటర్ల సంఘం హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ వేయడంతో ఆస్తులను అమ్మకం చేయలేక అప్పటి ప్రభుత్వం ఆగిపోవాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు ఎప్పుడు జరిగినా.. కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన దాఖలాలు లేవు. పైగా దర్యాప్తు వేగవంతంగా చేసినందుకు అభినందించడం కూడా జరిగింది. సరైన సమయంలో జప్తు చేయడంతో ఆస్తులు బదిలీ కాకుండా కాపాడారని సీబీసీఐడీకి కోర్టు ప్రత్యేకంగా అభినందించింది. కోర్టు పర్యవేక్షణలోని ఆస్తుల అమ్మకాలు, లావాదేవీలన్నీ కోర్టు ద్వారానే జరుగుతాయని అయన అన్నారు. 
కానీ కొందరు టీడీపీ నాయకులపై పనిగట్టుకుని చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి వైకాపా నాయకులు క్షమాపణ చెప్తారా..? కోర్టు పర్యవేక్షణలో కేసు నడుస్తుండగా.. 2018లో జీ గ్రూప్ సంస్థ ఆస్తులను కొనేందుకు  ముందుకు వచ్చి పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఆ సమయంలో జీ గ్రూప్పై కూడా ఆరోపణలు చేసి.. ఆస్తులు వేలం వేయకుండా వైకాపా నాయకులు అడ్డుపడ్డారు. కోర్టు పర్యవేక్షణలోకి కేసు వెళ్లిన తర్వాత నిర్వహించిన ప్రతి కేబినెట్ సమావేశంలోనై తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్పై చర్చించడం జరిగింది. 
9 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కేసు నడుస్తున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఏపీలోనే ఆత్మహత్య చేసుకున్న 160 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 2018 చివరి నాటికి అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలు పోలీసుల ద్వారా క్యాంపులు పెట్టి మరీ సేకరించడం జరిగింది. 2019 జనవరిలో ఆ వివరాలన్నీ కోర్టు సమర్పించడమైనది. 20వేల లోపు డిపాజిట్దారులకు వారందరికీ డబ్బులు చెల్లించేందుకు రూ.250 కోట్లు పీడీ అకౌంట్లో క్లియర్ చేయడం జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనూ పెట్టడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయని అయన గుర్తు చేసారు. 
జూలై మెదటి వారంలో అవ్వా సీతారామ్తో డీజీపీ ఆఫీసులో కొంతమంది వైసీపీ మంత్రులు మీటింగ్ ఏర్పాటు చేశారు. దీని గురించి కొన్ని పేపర్లలో ఆర్టికల్స్ కూడా రాశారు. గతంలో సీతారామ్పైనే ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ఆయనతో ఎందుకు సమావేశమైంది..? గతంలో టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ఎప్పుడైనా భేటీ అయిందా?  వైసీపీ నేతలు ఈ విధంగా  అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ బాధితులకేదో న్యాయం చేసినట్లు జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టడం విడ్డూరంగా ఉంది. స్పీకర్ స్ధాయిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడటం సరికాదు. వైకాపా ప్రభుత్వం కేవలం అగ్రిగోల్డ్పై రాజకీయం చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం 21 వేలకు పైగా ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్ని జప్తు చేసింది.  ఇప్పుడు ఏ ఎకరం ఏ వైసీపీ నేత కొట్టేస్తారో తెలీదు. చంద్రబాబు, లోకేష్, యనమల అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారని స్పీకర్ అన్నారు. దీనిపై ఆధారాలున్నాయా..? వైసీపీ అధికారంలోకి వచ్చి నెలలు అయింది అతి నిజమైతే విచారణ ఎందుకు చేయలేదు..? టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల పట్ల బాధ్యాయుతంగా వ్యవహరించింది. తమ్మినేని నోరు అదుపులో పెట్టుకోవాలని అయన అన్నారు.            

Related Posts