YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

వృక్షాల్లో రావిచెట్టు లాంటివాడినని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.

వృక్షాల్లో రావిచెట్టు లాంటివాడినని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.

వృక్షాల్లో రావిచెట్టు లాంటివాడినని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.

వృక్షాలు మహాయోగులు. పరిపూర్ణ మానవుడు ఆనందం, శాంతి లాంటి పవిత్రమైన ప్రకాశాన్ని ఎలా వ్యాపింపజేస్తాడో ఆ విధంగా వృక్షాలు ఒక ధర్మాన్ని అనుసరిస్తాయి. భూమి నుంచి మొలకెత్తడం దగ్గర్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతాయి. స్వేచ్ఛను నింపుకొంటాయి. చేతులు చాచిన విధంగా కొమ్మలతో, అందమైన ఆకుపచ్చదనంతో జీవకోటికి అవసరమయ్యే ప్రాణవాయువును అందిస్తాయి. ఆకాశంవైపు చూస్తూ విశ్వానికి కావాల్సిన శక్తిని గ్రహిస్తూ ఎదుగుతాయి. ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ వేళ్లు భూమిలోనే ఉంచుకుని ఉనికిని మరచిపోకూడదనే సత్యాన్ని చాటి చెబుతాయి. వృక్షం గురువుతో సమానం. సమస్తం సమకూర్చే ఆ సర్వేశ్వరుడికి అది మరో రూపం. ఎప్పుడూ వృక్షం వికారమనిపించదు. సజీవత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. సేవాధర్మం తప్పదు. జీవం కోల్పోతున్న దశలో సైతం తనలోని విలువైన ప్రతి భాగం మానవజాతికి ఉపయోగపడుతుంది. ఎన్నెన్నో అవసరాలను తీరుస్తుంది. భూదేవికి ఎరువై తోడ్పడుతుంది. వేళ్లు ఎన్నో క్రిమికీటకాలకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. భూగర్భంలో పోషకాలు అందిస్తాయి.మనిషి కొమ్మలను కత్తిరించినా, ఆకులను తొలగించినా, బెరడును వేరుచేసినా వృక్షం ఎప్పుడూ తిరగబడదు. సహనంతో అన్నింటినీ భరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తుంది. ఎందరికో జీవనోపాధి కల్పిస్తుంది. జీవశాస్త్రపరంగా చూసినా, భావావేశాల రీత్యా చూసినా వృక్షానికి మనిషికి దగ్గర పోలికలున్నాయి. యాజ్ఞవల్క్యుడి వంటి ప్రాచీన భారతీయ రుషులు ధర్మాలను అనుసరించి వృక్షాన్ని జ్ఞానానికి గుర్తుగా చెబుతూ ప్రశంసించారు. వృక్షాలు దేవతలుగా పూజలందుకోవడమూ చూస్తున్నాం. ఆధునిక కాలంలో ఆర్థికవేత్తలు వృక్షాల ప్రయోజనాలు, విలువలు లెక్కగట్టి చూపించారు. వాతావరణ శాస్త్రవేత్తలు వృక్షాలు బతుకునిస్తాయని, భూమి మనుగడకు అవి ఎంతో కీలకమని చెప్పారు. వృక్షాల్లో స్వచ్ఛత, అందాలను దర్శించినవారు కొందరైతే, మరికొందరు వృక్షాన్ని పరమశివుడి రూపంగా భావించారు. ఆ విధంగా అది పూజార్హతను సంపాదించుకుంది. చెట్టు తనకు తాను శక్తిని సృష్టించుకోగలదు. తన విత్తనాన్ని తానే తయారు చేసుకోగలదు. మళ్ళీ అవతారమెత్తగలదు. పరమశివుడితో పోలికేమిటి? శివుడు గరళాన్ని సేవించినట్లుగా, చెట్టు ప్రతి రాత్రీ బొగ్గుపులుసు వాయువును తీసుకుంటుంది. భూమ్మీద ప్రాణులు హాయిగా జీవించగలగడానికి ప్రాణవాయువును విడిచిపెడుతుంది. శివుడిలాగే వృక్షం ‘బోళా’; రాయి విసిరికొట్టినా ఆకులను, ఫలాలను అందిస్తుంది.వృక్షాలు అందరికీ జీవకళను పంచుతాయి. అలసిన జీవులకు నీడనే కాదు- పోషకాలు నిండిన ఫలాలను, వైద్యానికి మూలికలను అందిస్తాయి. కులమతజాతి భేదాల్లేకుండా ప్రతి ఒక్కరికీ తన ఉదారతను చూపిస్తాయి. పశుపక్ష్యాదులకు అవి గొప్ప నివాస స్థలం. కవులు, రచయితలు, తత్వవేత్తలు, కాల్పనికులకు చెట్టు స్ఫూర్తిప్రదాత. మహావృక్షాల కింద ఎందరో ధ్యానసాధన చేసినవారున్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది బోధి వృక్షం కిందే. వృక్షం తనంత తానుగా అంతంకాదు. విశ్వ శ్రేయస్సుకోసం సరికొత్త బలంతో పదేపదే సృష్టించుకుంటుంది. నిజమైన యోగిలా ఎవరినుంచి ఏమీ ఆశించకుండా, మూలాల నుంచి శక్తిని గ్రహిస్తూ, పర్యావరణ సమతుల్యతకు కారణమవుతూ, నలుగురి సంక్షేమం కోసం, పోషణ కోసం జీవిస్తుంది చెట్టు. అంతకన్నా ఆదర్శమేముంటుంది?

Related Posts