YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంతెన వచ్చేస్తోంది

వంతెన వచ్చేస్తోంది

 తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వారధి - మే నుంచి రాకపోకలు 
తంగెడ, మఠంపల్లిని కలుపుతూ నిర్మాణం 

నవ్యాంధ్ర, తెలంగాణా రెండు నూతన తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై చురుగ్గా సాగుతున్న వారధి నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటి పైభాగాన శ్లాబ్‌ పనులు చేస్తున్నారు. మూడొంతులు కాగా, మిగతా భాగం నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం మఠంపల్లి గ్రామం మధ్య ప్రవహిస్తున్న కృష్ణానదిపై హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి 2014 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వారధి పనులు దాదాపు పూర్తయ్యాయి. రెండు వైపులా కూడా మొత్తం 21 స్తంభాల (పిల్లర్లు) నిర్మాణ పనులు చేశారు. ఈ వంతెనతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం బాగా చేరువవుతుంది. చెన్నై సహా రెండు రాష్ట్రాల్లోని ఖమ్మం, నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లోని ప్రజలకు తమ ప్రయాణంలో ఎంతో మేలు జరుగనుంది. 50 కిలోమీటర్లకు పైగా దూరం తగ్గనుంది. త్వరలో పూర్తి కానున్న ఈ వంతెనను మే నెల్లో ప్రారంభించి దానిపై రాకపోకలు చేపట్టనున్నారు.

పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం: ఈ వంతెనతో గుంటూరు, నల్గొండ జిల్లాల్లో ఉన్న సిమెంట్‌, పాలిష్‌రాయి పరిశ్రమలు, సున్నం మిల్లులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. వాటి అభివృద్ధితో పాటు ప్రజలు, కార్మికుల జీవనోపాధి కూడా మెరుగు పడనుంది. తంగెడ, నడికూడి, గామాలపాడు, పెదగార్లపాడు ప్రాంతాల్లో మరికొన్ని సిమెంట్‌ పరిశ్రమలు వస్తున్నాయి. వాటిలో అంబూజా, మైహోమ్‌, చెట్టినాడ్‌, శ్రీసిమెంట్స్‌ కర్మాగారాలపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. ఇంకా తంగెడ, మాదినపాడు ప్రాంతాలకు ఇమామీ, జీవీపీ, అల్ట్రాటెక్‌ తదితర సిమెంట్‌ పరిశ్రమలు వస్తున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ పరమైన అనుమతులు కూడా లభించాయి. వీటి నుంచి రవాణాకు ఈ వంతెన ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లోని సిమెంట్‌ పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తిని దేశంలోని పలు ప్రాంతాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది. 25 ఏళ్ల క్రితం ఇటు పొందుగల, అటు వాడపల్లి మధ్య కృష్ణానదిపై రోడ్డు, రైల్వే వంతెనలు నిర్మితమయ్యాయి. నల్గొండ జిల్లా విష్ణుపురం నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వరకు సిమెంట్‌ పరిశ్రమలకు ఉపయోగపడేలా వాటి సరకు రవాణాకు గూడ్స్‌ రైళ్లు తిరగడానికి మరో రైలు మార్గాన్ని నిర్మించారు. వాటితో ఈ ప్రాంతాల మధ్య దూరం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణానదిపై తాజాగా చేపడుతున్న తొలి వారధి నిర్మాణం పూర్తవుతోంది. దాంతో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.

Related Posts