YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విత్తన మాయ (కృష్ణాజిల్లా)

విత్తన మాయ (కృష్ణాజిల్లా)

విత్తన మాయ (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, డిసెంబర్ 23: రబీ సీజన్‌లో సాగు చేస్తున్న వరి రైతులకు విత్తనాల లభ్యత తగ్గడంతో అధిక ధర వెచ్చించాల్సి వస్తోంది. సన్నరకాల పేరుతో ఆకర్షణీయంగా సంచుల్లో ప్యాకింగ్‌ చేసి వివిధ పేర్లతో రైతులకు పలు కంపెనీల విత్తనాలను అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ తదితర జిల్లాల నుంచి ఎక్కువగా వరి విత్తనాలు దిగుమతి అవుతున్నాయి. జిల్లాలో సాధారణంగా రబీ సీజన్‌లో వరి సాగు పెద్దగా లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ విత్తనాలు సరఫరా చేయడం లేదు. ఈఏడాది కృష్ణా నదికి వరదలు రావడం, జలాశయాల్లో నీటిలభ్యత ఉండటం, ఆరుతడి పంటలకు రబీ సీజన్‌లో సాగునీరు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులు మాగాణి భూముల్లో వరిసాగుకు సిద్ధమయ్యారు. సాగర్‌ కాలువల కింద కారంపూడి, రెంటచింతల, మాచర్ల, నకరికల్లు, పిడుగురాళ్ల, గురజాల, నరసరావుపేట, రొంపిచర్ల, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాలతో పాటు కుడికాలువ వెంబడి ఉన్న మాగాణి భూముల్లో ఈసారి వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈఏడాది లక్ష ఎకరాలకుపైగా వరి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో విత్తన వ్యాపారులు తెలంగాణ రాష్ట్రం నుంచి వరి విత్తనాలు దిగుమతి చేసుకుని ధరలు పెంచి విక్రయిస్తున్నారు. 12 కిలోల వరి విత్తన సంచి ధర రూ.1100, 10కిలోల విత్తన సంచి ధర రూ.900, 25కిలోల విత్తన సంచి ధర రూ.1020, 20 కిలోల విత్తన సంచి ధర రూ.850 వరకు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ధరకు రైతులకు సరఫరా చేస్తున్నారు. పరిశోధిత వరి విత్తనం, నాజూకైన ధాన్యం అంటూ అధిక ధరకు అంటగడుతున్నారు. సన్నరకాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీకి చెందిన విత్తనాలు అందుబాటులో లేవంటూ గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. రైతులు ఎవరైనా సంచిపై ముద్రించి ధర గుర్తించి ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారంటే వారి వద్ద మాత్రం గరిష్ఠ చిల్లర ధరకే ఇస్తున్నారు. రైతులంతా ఒకేసారి నారుమళ్లు వేయడానికి సిద్ధం కావడంతో పాటు కొన్ని కంపెనీల విత్తనాలకే రైతులు ఆకర్షితులు కావడంతో డిమాండ్‌ పేరుతో అధిక ధర వసూలు చేస్తున్నారు. వ్యాపారులంతా ఐక్యమై ధర పెంచి తగ్గించకుండా అమ్ముతున్నారు. గరిష్ఠ చిల్లర ధర రూ.1090 ఉన్నప్పటికీ గతంలో రూ.800 ధరకే విత్తన సంచులు విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు ఎమ్మార్పీకి మించి వసూలుచేయడం, బిల్లు మాత్రం ఎమ్మార్పీ ధరలకే ఇస్తున్నారు. వరి విత్తనాలకు ప్రభుత్వం ధర నిర్ణయించకపోవడంతో విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఏటా ధరలు అనూహ్యంగా పెంచేస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గతంలో రైతులు పొలంలో పండిన ధాన్యంలో నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి విత్తనంగా ఉపయోగించుకునేవారు. ఇటీవల కాలంలో రైతులందరూ పూర్తిగా వరి విత్తన కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. దీనిని గుర్తించిన కొన్ని కంపెనీలు విత్తనాల ఉత్పత్తికి అయ్యే వ్యయం కంటే కొన్ని రెట్లు ధరలు పెంచి అమ్ముతున్నారు.

Related Posts