YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*తిరుప్పావై 20వ రోజు పాశురం*

*తిరుప్పావై 20వ రోజు పాశురం*

*తిరుప్పావై 20వ రోజు పాశురం*
ఓంశ్రీమాత్రే నమః
అద్వైత చైతన్య జాగృతి
*పాశురం*
   *ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు*
    *కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;*
    *శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు* 
    *వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;*
    *శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్* 
    *నప్పిన్నై నఙ్గాయ్!* *తిరువే! తుయిలెళాయ్;*
    *ఉక్కముమ్* *తట్టొళియుమ్ తన్దున్ మణాళనై* 
    *ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్!!* 

*భావం :-*
ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభశివాకలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము. 
బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారుy కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో.  
*అవతారిక :-*
గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి. 
ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపు తున్నారు. స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట  తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.    నీళాకృష్ణులను మేల్కొలిపి, తమను కరుణించవలెనని గోపికలు ప్రార్ధించారు. యీ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతియైన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్ధిస్తున్నారు. సాక్షాత్తూ లక్ష్మీదేవివంటి తల్లియైన నీళాదేవిని కూడా మేల్కొలిపి, తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనందస్నానాన్ని చేయించుమని ప్రార్ధిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి. 
*సింధు భైరవి రాగము - ఆదితాళము*

Related Posts