YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 ఇటుక బట్టిల్లో మగ్గుతున్న బాల్యం

 ఇటుక బట్టిల్లో మగ్గుతున్న బాల్యం

 ఇటుక బట్టిల్లో మగ్గుతున్న బాల్యం
కర్నూలు, జనవరి 8,
ఎర్ర ఇటుకల ఫ్యాక్టరీల్లో పనులు చేసేందుకు వందలాది మంది ఉపాధి కూలీలు కుటుంబ సమేతంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. అలాగే చెరుకు కొట్టేందుకు కూడా చిన్నటేకూరు, తడకనపల్లి, బస్తిపాడు, పెద్దటేకూరు గ్రామాలకు అనేక కుటుంబాలు వలస వచ్చాయి. వీరు పొలాల గట్టునే గుడారాలు వేసుకుని పనులు చేస్తున్నారు. దీంతో పిల్లల జీవితం పొలాల గట్లపైనే మగ్గిపోతుంది. ఇప్పటికే ఇటుకల ఫ్యాక్టరీలలో పనులు చేసే చోట అనేక మంది పిల్లలకు పౌష్ఠికాహారం, వైద్యం సక్రమంగా అందక మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది వ్యవసాయ కూలీలు వారి వారి ప్రాంతాల్లో ఉపాధి పనులు లేకపోడంతో కల్లూరు ప్రాంతంలోని ఇటుకల ఫ్యాక్టరీలు, పొలం, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పనులు చేసేందుకు కుటుంబ సమేతంగా వలస వచ్చి జీవనం సాగిస్తుండడమే నిదర్శనం. వారితోపాటే వారి పిల్లలను కూడా బడి మాన్పించి తీసుకెళ్తున్నారు. కూలీలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ వారి వారి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. దీంతో వారి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా 0-5 ఏళ్ల పిల్లలకు పౌష్ఠికాహారం అందక వారు రోగాల బారిన పడుతున్నారు. మరి కొందరు పిల్లలు 3, 4, 5 తరగతులు చదువుతుండగా వారి వారి తల్లిదండ్రులు బడి మాన్పించి వారితో పాటు తీసుకురావడంతో వారి బాల్యం పొల్లాలోనే గడిచిపోతుంది. వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు విడుదల చేస్తుండగా సంబంధిత అధికారులు మాత్రం ఉపాధి పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. తమ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించినా పనులు చేసిన తర్వాత వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో పనులు లేక పోవడంతోనే వలస వచ్చామని కనీసం నాలుగు మాసాలు ఇక్కడే పనులు చేసుకుని వెళ్తామని పేర్కొంటున్నారు. అప్పటి వరకూ పిల్లలు చదువులకు దూరం అవుతున్నారన్నారు. మళ్లీ సొంత ప్రాంతాలకు వెళ్లిన తర్వాతే బడులకు పంపుతామన్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి ఇతర ప్రాంతాల నుంచి మండలానికి వలస వచ్చిన కూలీల పిల్లలకు పౌష్ఠికాహారం, విద్యనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Related Posts