YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సంక్రాంతి శోభలు

సంక్రాంతి శోభలు

సంక్రాంతి శోభలు
సూర్యుడి రాశి సంక్రమణాల్లో మకర రాశిలో ప్రవేశించే కాలం అత్యంత ప్రధానంగా చెబుతారు. ‘మకర సంక్రాంతి’ అయినప్పటికీ, సామాన్యులకు ‘సంక్రమణం’ అంటే ఈ ఒక్క పర్వమే స్ఫురిస్తుంది. ఏడాది మొత్తంలో ఈ సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యం దీన్ని ‘పెద్ద పండుగ’ చేసింది. సౌరమానం ప్రకారం ఇక్కడి నుంచి మకర మాసం. దీన్ని ధార్మిక గ్రంథాల్లో ‘దేవపర్వం’గా అభివర్ణించారు. సంవత్సరానికి పగలు వంటిది ఉత్తరాయణం. రాత్రి వంటిది దక్షిణాయనం. ఈ కాలంలో ప్రకృతిలో కలిగే మార్పుల్లో సూక్ష్మంగా ఉన్న దివ్యత్వాన్ని దర్శించిన ధార్మిక రుషులు, ఆ దివ్యత్వాన్ని మనం పొందేందుకు కావలసిన సాధనా ప్రక్రియలను ఏర్పరచారు. 
స్నాన, దానాలకు ప్రాధాన్యం ఈ సంక్రమణంలో కనిపిస్తుంది. ఈ రోజున ‘ప్రయాగ’ స్నానం మనదేశంలో జరిగే మహావైభవం. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఈ సమయాన దానం చేయడం ప్రధాన సత్కర్మ. సంకల్పపూర్వకంగా శ్రోత్రియులకు చేసే వివిధ దానాలేకాక, దీన జనులకు చేసే దానాలూ భగవంతుడికి ప్రీతికరమైనవి. వ్యక్తి స్వయంకృషితో న్యాయబద్ధంగా ఆర్జించిన సంపదలు దానం వల్ల పవిత్రమవుతాయని పురాణ బోధ.
సంపాదించుకున్న ధనాదులను దైవకార్యాలకు, సమాజ హితానికి వినియోగించడం దాన వ్యవస్థ ఉద్దేశం. కానుకలుగా, సహాయంగా, అర్పణంగా తన ద్రవ్యాలను పంచడంలో ఉన్న ఆనందం ఈ పర్వం నాటి దానక్రియలోని సౌందర్యం.
పంట చేతికందే ప్రకృతి వరాల ఈవేళ, వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో, ఆ పంటల సంపదలను పలు విధాలుగా పంచి ఆనందించే పండుగగా ఇది శ్రమజీవులకు ఆనందహేల అవుతోంది. కుటుంబ సంబంధాల తీయందనాలు, సామాజిక  బాధ్యతల దాతృత్వాలు సంక్రాంతి సౌరభాలు.
సర్వజీవులకు ప్రాణప్రదాతగా ప్రకృతి గతిని మలిచి అనుగ్రహించే మహాశక్తిమంతుడిగా సూర్యుని దర్శించి, ప్రత్యక్ష దైవంగా, కర్మసాక్షిగా ఉపాసించిన భారతీయులు- దీన్ని సూర్యపర్వంగా ఆవిష్కరించారు.
ఉత్తరాయణ సూర్యుని సర్వదేవమయుడిగా సంభావిస్తూ- కొత్త బియ్యంతో, ఆవుపాలతో పరమాన్నాన్ని వండి, స్వామికి నివేదించడం ‘పొంగల్‌’గా ఈ పర్వాన్ని తీర్చిదిద్దుతోంది. దైవికమైన ధ్యాన-జపాది అనుష్ఠానాలు ఈ పర్వ సమయాన విశేష ఫలాన్నిస్తాయని వాటికి సంబంధించిన శాస్త్రాలు ఈ కాల ప్రభావాన్ని బహువిధాలుగా ప్రశంసించాయి.
హిందువుల పండుగల్లో వైవిధ్యశోభ- ఆయా రుతువుల మార్పులకు అనుగుణమైన వంటకాల వినోదాల్లోనూ కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో దీన్ని ‘తిల సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. తెల్లనువ్వులు, మధుర పదార్థాలు శుభాకాంక్షల భావంతో పరస్పరం పంచుకోవడం కొన్ని ప్రాంతాల ఆచారం. పూజలో, నైవేద్యంలో, వంటల్లో తిలలను వాడటం ప్రశస్తి.
‘పతంగం’ అనే మాట ముఖ్యంగా సూర్యుణ్ని, పక్షిని తెలియజేస్తుంది. ఆకాశ గమనుడైన సూర్యుని పర్వం కనుకనే ఆయనకు ప్రతీకగా పతంగాలను (గాలిపటాలు) ఎగరేయడం కొన్నిచోట్ల వేడుక.
మనుషులతోపాటు, వ్యవసాయంలో శ్రమించిన పశువుల పట్లా కృతజ్ఞతాభావం, దేవతా భావం వ్యక్తపరచడం విలక్షణమైన సంస్కారం. దేశ సంపదను పుష్టిపరచే పశుసంపదను పూజించే పర్వం కూడా ఇది. ‘పంట’తోపాటు ‘పాడి’ కూడా వ్యవసాయంలో ప్రధానం కనుక ఈ ఆచారాన్నీ ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్నారు. నేలలో, నింగిలో వచ్చే చక్కని పరిణామాలు సకల శుభాలను ప్రసాదించాలని సద్భావంతో జరుపుకొనే సంస్కారాల పర్వమే- సంక్రాంతి!

సామవేదషణ్ముఖశర్మగారు 

Related Posts