YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*పాదపూజ*

*పాదపూజ*

*పాదపూజ*

భారతీయ సంస్కృతి, సదాచారాలు చాలా అర్థవంతమైనవి. భౌతిక దృష్టికి అందని పరమార్థం వాటిలో నిక్షిప్తమై ఉంటుంది. పాదపూజ ఒక ఆచారంగా, సామాన్య వ్యవహారంగా అనిపించవచ్చు. అది వేదకాలమంత ప్రాచీనమైంది. పవిత్రమైంది.
పూజనీయులు, జ్ఞానసంపన్నులు పాదపూజకు అర్హులు. ఆ మహనీయులను జీవితకాలమంతా ధర్మమార్గంలో నడిపించింది వారి వ్యక్తిత్వం. ఆ పాదాలు సమున్నతమైన వ్యక్తిత్వానికి, ధర్మ నిబద్ధతకు ప్రతీకలు. పాదప్రక్షాళన చెయ్యడమంటే ఒక వ్యక్తి జీవన విధానాన్ని ఆసాంతం గౌరవించడం. పాదపూజ అనంతరం వినియోగించిన నీటిని తలపై చల్లుకోవడం, పెద్దల పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించడం ఆచారం. దేహానికి అట్టడుగు భాగం పాదాలైతే అత్యున్నత అవయవం శిరస్సు. మస్తిష్కం మేధకే కాక గర్వం అహంభావాలకు నిలయం. చరణాలకు శిరసా నమస్కరించడమంటే దర్పాన్ని వీడి ఆయా వ్యక్తుల ఔన్నత్యాన్ని అంగీకరించడమే.
అపరిచితులైనప్పటికీ అతిథుల్ని పాదపూజతో సత్కరించడం ప్రాచీనకాలంలో ఉండేది. వచ్చిన వ్యక్తి అన్నింటా మనకన్నా యోగ్యుడా కాదా అన్న శంక వారికి ఉండేది కాదు. అతిథిలో దైవాన్ని చూడటమే నాటి జీవన విధానం. భోజనాదుల అనంతరం అతిథికి పాదసేవ చెయ్యడం ద్వారా సంతోషపరచేవారు. సనాతన జీవనశైలి ఎంత నిరాడంబరమైందో తెలియజెప్పే సన్నివేశాలివి.
మునులు, రుషిపుంగవులు సభా మంటపానికి విచ్చేసినప్పుడు సాక్షాత్తు మహారాజు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించి, ఉచితాసనంపై కూర్చోబెట్టి పాదపూజ చేసేవారు. వేద విజ్ఞులై సకల శుభాలను అనుగ్రహించే ఆ మహనీయుల గొప్పతనం ముందు మహారాజ పదవిని చాలా అల్పమైనదిగా భావించేవారు.
సకల లోకాలకు స్థితి కారకుడు శ్రీ మహా విష్ణువు. ఆయన అర్ధాంగి లక్ష్మీదేవి. ఆమె ఐశ్వర్య ప్రదాత. ఆమె నిరంతరం విష్ణు పాదసేవలో నిమగ్నమై ఉంటుందంటారు. భౌతిక విషయాసక్తులైన మనుషులు ధనాభిలాషులవుతుంటారు. మోక్ష కారకుడైన పరంధాముడిని విడిచిపెట్టి సంపదలను కోరుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది. అన్నమయ్య, త్యాగయ్య వంటి భక్తులు కోరివచ్చిన సుఖాలను విడిచిపెట్టారు. తమ సంకీర్తనల ద్వారా విష్ణు పాదాల ప్రాధాన్యాన్ని లోక విదితం చేశారు
ప్రమథలు శివభక్తులు. శివుడు తన కుమారుల్లో ఒకరిని ప్రమథ గణానికి నాయకుడిని చెయ్యాలని భావించాడు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ శక్తి సంపన్నులే. నాయకత్వం వహించడానికి ఇరువురూ సుముఖత వ్యక్తం చేశారు. శివుడు సర్వ పుణ్యక్షేత్రాలను దర్శించి పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించి ముందుగా వచ్చినవారికి నాయకత్వ విధులు అప్పగిస్తానని షరతు పెట్టాడు. మయూర వాహనుడైన కుమారస్వామి వెంటనే ప్రయాణమయ్యాడు. లంబోదరుడు మూషిక వాహనంపై వెళ్ళడానికి సందేహించాడు. ఎంత శీఘ్రగతిలో ప్రయాణం చేసినా తమ్ముడిని దాటి వెళ్ళడం అసాధ్యం అనిపించింది. యుక్తితో ఆలోచించాడు. తల్లిదండ్రుల పాదాలకు మించిన పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలు లేవనిపించింది. శివ పార్వతుల పాదాలను పూజించాడు. భక్తితో వారికి ప్రదక్షిణలు చేశాడు. ఆ మహిమ కారణంగా కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోటా వినాయకుడు దర్శనమిచ్చాడు. వినాయకుడు ప్రమథ గణాలకు నాయకుడై గణపతి అన్న పేరు పొందాడు. 
కన్యాదాన సమయంలో వరుడి కాళ్లు కడిగే సంప్రదాయం ఉంది. వరుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి ఆ కార్యక్రమం నిర్వహిస్తారు.

Related Posts