YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రాక్టి కిల్స్... మాయ

ప్రాక్టి కిల్స్... మాయ

ప్రాక్టి కిల్స్... మాయ
హైద్రాబాద్, ఫిబ్రవరి 12,
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అనుభవం లేని వారికి విధులు కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైన్స్‌ సబ్జెక్టుల పట్ల అవగాహన లేని వారికి అర్హతల్లేకున్నా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సైన్స్‌ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు, సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివిధ జిల్లాల్లో అధికారులు అప్పగించారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడం గమనార్హం. ప్రాక్టికల్‌ పరీక్షల నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారు. ఇష్టారాజ్యంగా విధులు కేటాయిస్తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఎగ్జామినర్‌గా విధులు నిర్వహించాలంటే కనీసం 3 నుంచి 5 ఏండ్ల అనుభవం ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ మూడు నెలల అనుభవం లేని వారికి డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ విధులు కేటాయించడం అధికారుల ఇష్టారాజ్యానికి నిదర్శనం. అనుభవం లేని వారికి విధులు కేటాయించడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదమున్నది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఎగ్జామినర్లుగా సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు అనుభవం ఉన్న వారిని నియమించాలి. రెగ్యులర్‌ అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత కాంట్రాక్టు అధ్యాపకులు, అతిధి అధ్యాపకులను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇంటర్‌ అధికారులు ఫిజికల్‌ డైరెక్టర్లు (పీడీ), లైబ్రరియన్లకు విధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. పీడీలు, లైబ్రరియన్లు కేవలం రెగ్యులర్‌ సిబ్బంది అన్న ఒకే కారణంతో వారికి విధులు కేటాయించడం గమనార్హం. సబ్జెక్టుతో సంబంధం లేకుండా వేరే సబ్జెక్టుల వారికి విధులు అప్పగించడం పలు విమర్శలకు తావిస్తున్నది.రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 1న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈనెల 20వ తేదీ వరకు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,506 జనరల్‌ ప్రాక్టికల్‌ కేంద్రాలు, 416 ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీసీ నుంచి 1,55,454 మంది, బైపీసీ నుంచి 91,881 మంది, జియాగ్రఫీ నుంచి 580 మంది చొప్పున 2,47,915 మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. అయిఏ ఒక ఎగ్జామినర్‌కు గరిష్టంగా ఆరు సెషన్లు విధులు కేటాయించాలి. కానీ నిబంధనలకు ఇంటర్‌ బోర్డు అధికారులు యధేచ్చగా తూట్లు పొడుస్తున్నారు. ఒక ఎగ్జామినర్‌కు ఏకంగా 30 సెషన్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నాలుగు సెల్స్‌లో జరుగుతాయి. మొదటి సెల్‌లో పనిచేసిన వారికే రెండు, మూడో సెల్స్‌లోనూ విధులు కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అధికారులు కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు అనుభవం లేని వారిని డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, ఎగ్జామినర్లుగా నియమించడం వల్ల వారు కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యే ప్రమాదం లేకపోలేదు. విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలు సక్రమంగా చేయకపోయినా వారికి ఎక్కువ మార్కులు వచ్చే సూచనలు న్నాయి. ఆ ప్రభావంతో మెరిట్‌ విద్యార్థులు నష్టపోయే అవకాశమున్నది. అధికారులు ఇప్పటికైనా అనుభవం లేని వారు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, ఎగ్జామినర్లుగా ఉంటే వెంటనే తొలగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts