YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 కరోనా వైరస్ పై ఆందోళన వద్దు... అయితే ..అప్రమత్తంగా ఉండండి.. 

 కరోనా వైరస్ పై ఆందోళన వద్దు... అయితే ..అప్రమత్తంగా ఉండండి.. 

 కరోనా వైరస్ పై ఆందోళన వద్దు...
అయితే ..అప్రమత్తంగా ఉండండి.. 
ప్రజలకు విస్తృత అవగాహనను కల్పించండి
అధికారుల సమీక్షా సమావేశంలో  కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు, మార్చి4 
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మన రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని ఒక్క కేసు కూడా నమోదు  కాలేదని,  అయితే వైద్య ఆరోగ్య శాఖ తో పాటు గ్రామ సచివాలయం మొదలు జిల్లా సచివాలయం వరకు అధికారులందరూ  అప్రమత్తంగా ఉంటూ కరోనా వైరస్ లక్షణాలు, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నిరోధక చర్యలు,  నియంత్రణపై ప్రజలకు, క్షేత్ర స్థాయి వైద్య ఆరోగ్య సిబ్బందికి, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు, ఎస్.హెచ్.జి.ల మహిళలకు, విద్యార్థులకు  మీడియా, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, సినిమా స్లైడ్స్ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహనను కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నిర్వహించి కరోనా వైరస్ నియంత్రణకై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై, ప్రజలకు కల్పించాల్సిన అవగాహనపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్  మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా వైరస్/కోవిడ్-19 నిరోధక చర్యలను పగడ్బందీగా చేపట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్ లో ప్రస్తుతం రెండు కరోనా పాజిటివ్ కేసులు  మాత్రమే నమోదు అయ్యాయని, కరోనా  చైనా నుండి దాదాపు 70 ఇతర దేశాలకు వచ్చిన ఇంపోర్ట్ వైరస్ అని..మన రాష్ట్రంలో గాని లేదా జిల్లాలో గాని ఒక్క కేసు కూడా నమోదు కాలేదని..అందువల్ల ఎవరూ ఆందోళ చెందకుండా అప్రమత్తంగా మాత్రమే ఉండాలని సూచించారు.  అయితే హైదరాబాద్ కు కర్నూలు దగ్గరగా ఉండడంతో పాటు హైదరాబాద్ నుండి కర్నూలుకు ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నందు వల్ల కరోనా వైరస్/కోవిడ్-19 లక్షణాలు,  నిరోధక చర్యలు, కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనను కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రైల్వే  అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే డిఆర్డిఏ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు  సిబ్బందితో  సమన్వయం చేసుకుని స్వయం సహాయక సంఘాల మహిళల జిల్లా, పట్టణ సమాఖ్యలు, మండల, గ్రామ సమాఖ్యల మీటింగు లలో శిక్షణ/అవగాహనను కల్పించి వారి ద్వారా ప్రతి ఎస్ హెచ్ జి  మహిళలకు విస్తృతంగా  అవగాహనను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డిఈఓ, ఎస్ఎస్ఏ పిఓ లు, అన్ని వెల్ఫేర్ శాఖల అధికారులు వారి వారి పాఠశాలలు, హాస్టళ్లలో  ఉన్న విద్యార్థులకు హ్యాండ్ వాష్ ఆవశ్యకత తో పాటు కోవిడ్-19 నిరోధక చర్యలపై అవగాహనను కల్పించాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు , సిబ్బంది, ఏఎన్ఎంల కు కూడా కరోనా వైరస్/కోవిడ్-19  నియంత్రణ చర్యలపై పల్స్ పోలియో కార్యక్రమం శిక్షణ తరహాలో కరోనా వైరస్ నియంత్రణ పై  శిక్షణను ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, జడ్పీ  సీఈఓ, డిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే శానిటేషన్ ను బాగా నిర్వహించాలని మునిసిపల్ కమీషనర్లను, డిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు.  అలాగే, వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా కేంద్రం కర్నూలు జిజిహెచ్ లో  ఉన్న ఐసోలేషన్ వార్డు కు అదనంగా నంద్యాల, ఆదోనిలలో ఉన్న ప్రభుత్వ సర్వజన  ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని, కర్నూలులో దాదాపు నూరు మందికి సరిపడా ఐసోలేషన్ భవనాన్ని కూడా ఇప్పటి నుండే  గుర్తించి, అన్ని మెడికల్ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ డా.రామ గిడ్డయ్య ను కలెక్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై ఇటీవల తిరుపతి లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ప్రత్యేక  శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన కర్నూలు 
మెడికల్ కాలేజ్ డాక్టర్లు ప్రొఫెసర్ డా.శ్రీదేవి, ప్రొఫెసర్ డా. నాగజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శ్రీధర్ రావ్, డిఎంహెచ్ఓ డా.రామ గిడ్డయ్య , అదనపు డిఎంహెచ్ఓ  లు  డా.వెంకట రమణ, డా.శ్రీదేవి తదితరులు కోవిడ్-19/కరోనా వైరస్ లక్షణాలు, నియంత్రణ,  ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా అధికారుల సమన్వయ  సమావేశంలో అవగాహన కల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో కరోనా వైరస్ సోకిన వారిలో మరణాల శాతం 2 శాతం లోపే ఉందని అందువల్ల  ఎవరూ  ఆందోళన చెందకుండా తీవ్ర దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ల వద్ద చూపించుకుని డాక్టర్ల సలహా మేరకు నడుచుకుంటూ సురక్షితంగా ఉండాలని, మన చేతులు వైరస్ ను తాకి ముక్కు, నోటిని  తాకడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందువల్ల ఎక్కువ సార్లు బాగా చేతులు శుభ్రం చేసుకోవాలని, దగ్గు, జలుబు ఉన్న వారికి 6 అడుగుల దూరంలో ఉండాలని, దగ్గు వచ్చినపుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, కరోనా  అనుమానిత రోగులను ఎయిర్పోర్టు ల వద్దే 14 రోజులు అబ్సెర్వేషన్ లో  పెడతారని, మరో 14 రోజులు ఇంట్లో అబ్సెర్వేషన్ లో పెడతారని, గాలి ద్వారా కరోనా వైరస్/కోవిడ్-19 వ్యాప్తి చెందదని స్పెషలిస్ట్ డాక్టర్లు వివరించారు. 

Related Posts