YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మన జీన్స్ పై కరోనా ఎఫెక్ట్  

మన జీన్స్ పై కరోనా ఎఫెక్ట్  

 మన జీన్స్ పై కరోనా ఎఫెక్ట్  (అనంతపురం)
అనంతపురం, మార్చి 07  మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రాయదుర్గం జీన్స్‌ దుస్తుల పరిశ్రమ పరిస్థితి తయారైంది. సంక్రాంతి  పండగ నుంచి ఆర్డర్ల ఊసే లేక పనుల జాడ కరవై నామమాత్రంగా నడుస్తున్న రాయదుర్గం గార్మెంట్స్‌ పరిస్థితి చైనాలో ప్రబలిన కొవిడ్‌-19 తీవ్రతతో మరింత అధ్వానంగా తయారైంది. చైనాలో కొవిడ్‌-19 విజృంభిస్తుండటంతో జీన్స్‌ దుస్తుల తయారీకి వినియోగించే రంగుల దిగుమతి ఆగిపోయింది. ప్యాంట్లకు వాడే జిప్స్‌, లేబుళ్లు వంటి విడి వస్తువుల సరఫరా కూడా అక్కడి నుంచి ఆగిపోయింది. జీన్స్‌ దుస్తులకు వాడే రంగులను ఇన్నాళ్లుగా రాయదుర్గం గార్మెంట్స్‌ యజమానులు చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆ రంగులు నాణ్యంగా ఉండేవనీ, తక్కువ ధరలకు దొరికేవి. కొవిడ్‌-19 మహమ్మారి  వ్యాపించినప్పటి నుంచి రంగుల దిగుమతి ఆగిపోవటంతో వ్యాపారుల వద్ద ఉన్న రంగుల నిల్వలు తరిగిపోతున్నాయి. మరో పక్షం రోజులకు పూర్తి స్థాయిలో అయిపోయే ప్రమాదం నెలకొంది. ఇది వరకు తెల్ల రంగు జీన్స్‌ వస్త్రాన్ని తీసుకుని వివిధ రంగుల్లో దానిని అద్దకం చేసి.. ఆయా రంగుల్లో జీన్స్‌ ప్యాంట్లు కుట్టి తయారు చేసేవారు. రంగుల సరఫరా ఆగిపోవటంతో వివిధ రంగుల జీన్స్‌ ప్యాంట్లు తయారు చేయడానికి అవరోధంగా మారింది. ఈనేపథ్యంలో గుజరాత్‌  రాష్ట్రంలోని అహ్మదాబాద్‌, తదితర ప్రాంతాలకు చెందిన మిల్లుల యజమానులను ఆశ్రయిస్తుంటే.. వారి వివిధ రంగుల జీన్స్‌ వస్త్రం ధరలను పెంచినట్లు  రాయదుర్గం గార్మెంట్స్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఒక మీటరుకు రూ.5 చొప్పున వస్త్రం ధర పెరిగింది. వంద మీటర్లు (తాను) కొంటే రూ.500 అధికంగా చెల్లించాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న చైనా రంగులు పూర్తిగా అయిపోతే స్వదేశంలో లభ్యమయ్యే రంగుల ధరలు మరింత భారంగా పరిణమించనున్నాయి. జీన్స్‌ దుస్తులకు వాడే జిప్స్‌, లేబుళ్లు వంటివి స్థానిక వ్యాపారులు ముంబయి వ్యాపారులకు ఆర్డరు ఇస్తే వారు చైనా నుంచి  దిగుమతి చేసుకుని రాయదుర్గం వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. మరికొందరు రాయదుర్గం వ్యాపారులు చైనాలోని కంపెనీలకే నేరుగా వెళ్లి హోల్‌సేల్‌గా ముడి వస్తువులు తెచ్చేవారు. కొవిడ్‌-19 దెబ్బతో ముడి వస్తువుల దిగుమతి ఆగిపోయింది. దీంతో వాటి ధరలు స్వదేశంలో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వీటి ప్రభావం చివరకు జీన్స్‌ కొనుగోలుదారులపై పడే అవకాశం ఉంది. రూ.500 కోట్ల టర్నోవర్‌ కలిగి  దాదాపు 30 వేల మందికి ఉపాధి కల్పించే రాయదుర్గం గార్మెంట్స్‌ పరిశ్రమ పరిస్థితి నానాటికీ తీసికట్టులా మారుతోంది. దుస్తులకు ఆర్డర్లు తగ్గిపోయాయి.  గతంలో విక్రయించిన ఉత్పత్తుల చెల్లింపులు నిలిచిపోయాయి. దుకాణాల్లో దుస్తుల నిల్వలు కొండల్లా పేరుకుపోయాయి. అంతకు మించి అప్పులు కూడా పెరిగిపోయాయి. చేసేదేమీ లేక.. మంచి రోజులు రాకపోతాయా అని గార్మెంట్స్‌ వ్యాపారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దర్జీలు, కటింగ్‌ మాస్టర్లు, ఐరన్‌, తదితర కార్మికులు చేజారిపోకుండా చిన్నపాటి పనులు కల్పించి గార్మెంట్స్‌ వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

Related Posts