YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

తొమ్మిదేళ్లుగా పెరగని  ప్రభుత్వ ఇంజనీరింగ్ సీట్లు

తొమ్మిదేళ్లుగా పెరగని  ప్రభుత్వ ఇంజనీరింగ్ సీట్లు

తొమ్మిదేళ్లుగా పెరగని  ప్రభుత్వ ఇంజనీరింగ్ సీట్లు
వరంగల్, మార్చి 13,
 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, వాటిలో సీట్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం 3,055 ప్రభుత్వ ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, కన్వీనర్ కోటా కింద ప్రైవేట్ 69,410 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 169 ప్రైవేట్ కళాశాలల్లో 46,353 సీట్లు అందుబాటులో ఉండగా, 14 యూనివర్సిటీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 25 వేల వరకు యాజమాన్య కోటా సీట్లు ఉంటాయి.ఒక్కో ప్రైవేట్ కళాశాల సీట్ల సంఖ్యను 1,500 వరకు ఉంటుండగా, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అయితే 2 వేల నుంచి 2,500 వరకు సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. సర్కారు సీట్లు, రెండు మూడు ప్రైవేట్ కళాశాలల సీట్లకు సమానంగా ఉంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్, కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలలో మాత్రమే ప్రభుత్వ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. 2007- 08 విద్యాసంవత్సరంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి, వాటిని జెఎన్‌టియుహెచ్ పరిధిలో ఉంచాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీఇంగ్ కళాశాలల్లో 3,057 సీట్లు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఏటా సెక్షన్లు, సీట్లు పెరుగుతున్నాయి. కానీ గత తొమ్మిదేళ్లుగా సర్కారు ఇంజనీరింగ్ సీట్లు మాత్రం పెరగడం లేదు. ఏటా ఈ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నా, సీట్ల పెంపు దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా వందల కోట్లు చెల్లించే బదులు ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేస్తేనే మేలని గతంలో ప్రభుత్వం ఆలోచించినా అది అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమాణాలు పాటించకుండా కోళ్ల ఫారాల్లో, రేకుల షెడ్లలో నడిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై అనుమతులు రద్దు చేస్తూ వచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 2,726 ఇంజనీరింగ్ సీట్లు తగ్గాయి. అంతకుముందు ఏడాది 212 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 97,961 సీట్లు అందుబాటులో ఉండగా, గత ఏడాది 198 కళాశాలల్లో 95,235 సీట్లకు ఆయా యూనివర్సిటీలు అనుమతులు మంజూరు చేశాయి. గత ఏడాది జెఎన్‌టియుహెచ్ కింద 169 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 84,124 సీట్లు అందుబాటులో ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలో 11 కళాశాలల్లో 6,260 సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలో 4 కళాశాలల్లో 1,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వర్సిటీల పరిధిలో 184 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 92,184 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు 14 యూనివర్సిటీ కళాశాలల్లో 3,035 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ప్రైవేట్‌లో మాత్రం 74.20 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సుమారు 26 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి.ప్రైవేట్‌లో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ కళాశాలల్లో చదివిన విద్యార్థులకే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలులభిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నా గత కొన్నేళ్లుగా సీట్లు పరిమితంగా ఉండటంతో ఎంతోమంది ప్రతిభ గల విద్యార్థులు సర్కారు ఇంజనీరింగ్‌కు దూరమవుతున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఎక్కువగా జెఎన్‌టియుహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలనే ఎంపిక చేసుకుంటున్నారు. వాటిల్లో అందరికీ ఒకే తరహా ఫీజు ఉంటుంది. అదే ప్రైవేట్ కళాశాలల్లోనైతే పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి ఎంసెట్‌లో 10 వేల ర్యాంకు ఉండాలి. దీనికి తోడు విద్యార్థులకు నిర్థేశిత వార్షికాదాయం మించకూడదు. ఈ నిబంధనల వల్ల కొందరు ప్రతిభ గల విద్యార్థులు ఇంజనీరింగ్‌కు దూరమవుతుంటే, మరికొందరు భారమైనా భారీగా ఫీజులు వెచ్చించి టాప్ కళాశాలల్లో అభ్యసించాల్సి వస్తోంది.

Related Posts