YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మురికి నీళ్లే...రంగురంగుల ఐస్

మురికి నీళ్లే...రంగురంగుల ఐస్

మురికి నీళ్లే...రంగురంగుల ఐస్
శ్రీకాకుళం, మార్చి 17
శ్రీకాకుళం జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో రంగుల మిశ్రమాలు కలగలసిన పానీయాలను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వాటిని తాగిన వారు అనారోగ్యాల బారిన పడతున్నారు  కొండల దిగువ గ్రామాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఐస్‌ తయారీ కేంద్రాలు, శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలూ సరైన నిబంధనలు పాటించటం లేదు. వెలుగులోకి రాని అక్కడి వ్యవహారాలు అంతిమంగా ప్రజల జీవితాలకే పెను ముప్పుగా మారుతున్నాయి. స్థానికంగా తయారయ్యే కొన్ని పానీయాలు రిటైల్‌ వ్యాపారులకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. పేరున్న వాటి కంటే వీటిని అమ్మితేనే వారికి లాభాలొచ్చేలా ఆకర్షణీయ తగ్గింపులు  సదరు సంస్థ ప్రతినిధులు ప్రకటిస్తుంటారు.చాలా చోట్ల కార్మికులు సైతం సురక్షిత చర్యలు పాటించడం లేదు. చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు లేకుండానే పనిచేస్తున్నారు. తయారీ కేంద్రాలు సైతం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంటున్నాయి. కోటబొమ్మాళి, కొత్తపేటల్లో ...కొందరు బోరు నీటినే వాడేస్తున్నారు. పాలిథీన్‌ కవర్లలో డీప్‌ప్రిజ్‌ల్లో ఉంచి గడ్డకట్టిన తదుపరి వీటిని ఐస్‌గా వినియోగిస్తున్నారు. ఇలా చేయటం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఒక రకమైన వాయువులతో తయారయ్యే ఈ ఐస్‌ను వాడితే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తటం ఖాయమని పేర్కొంటున్నారు. టెక్కలిలో  ఐస్‌ తయారు చేసే కొన్ని కేంద్రాల్లో శీతలీకరణ యంత్రాలు తుప్పు పట్టి ఉన్నాయి. నిర్వహణ సరిగా లేదు. కలుషితమైన నీటినే వినియోగిస్తున్నారు. అలా తయారయ్యే ఐస్‌నే స్థానికంగా కొన్ని దుకాణాల్లో లస్సీ, పండ్ల రసాల విక్రయాల్లో వాడుతున్నారు.హిరమండలం మండల కేంద్రంలో ఐస్‌ తయారు చేసే కొందరు వ్యాపారుల నుంచే మండలమంతా సరఫరా అవుతుంది. కానీ, ఇక్కడా సరైన ప్రమాణాలు పాటించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో శీతలపానీయాలు, ఐస్‌క్రీంలు విక్రయాలుపై ఎటువంటి తనిఖీలు లేవు. ప్రజల అవసరాలనే ఆసరగా చేసుకొని  రంగులతో మాయ చేస్తున్నారు. కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో తయారీ తేదీ, ధరల్ని ముద్రిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని విక్రయాలు చేస్తున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. వీటిని తాగితే జబ్బులు ఖాయమనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో.... రహదారుల పక్కన సిద్ధం చేసిన ఫల రసాలను అమ్ముతున్నారు. కొందరు తుప్పు డబ్బాల్లోనే నీరు నిల్వచేసి, వాటినే వినియోగిస్తున్నారు. బయటికి కనిపించేలా స్టీలు మూతలు, రంగుల ఫ్లెక్సీల ఆకట్టుకుంటున్నారు. రూ.పది నుంచి రూ.20 వరకు ధరలుండే ఈ పానీయాలను తాగితే ఆరోగ్యం ఆపదలో చిక్కుకుపోవటం ఖాయం. బోరునీరు, కుళాయి నీటిని నేరుగా ఐసు దిమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల నుంచి సరిహద్దు గ్రామాలకు వచ్చే ఐస్‌ క్రీంలపై  తేదీ, బ్యాచ్‌ ముద్రలు ఉండటం లేదు.కవిటి మండలంలో నాసిరకం శీతల పానీయాలు వినియోగం అధికంగా వుంది. కొంత కాలం క్రితం వరకూ శివారు గ్రామాలకు పరిమితమైన వీటి అమ్మకాలు ఇప్పుడు మండల కేంద్రంలోని చాలా దుకాణాలకు చేరింది.  కంచిలి మండలంలోని ఓ సంస్థలో తయారయ్యే శీతలపానీయాల్లో కలిపే రంగులు, ఇతర రసాయనాలతో ఇబ్బందులున్నాయన్న అంశాన్ని గుర్తించినప్పటికీ యథేచ్చగా గ్రామాల్లో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ విషయమై గతంలో ఆహార తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత పరిశ్రమపై జరిమానా కూడా విధించారు. అయినప్పటికీ తయారీ, అమ్మకాలు ఆగలేదని అధికారులు గుర్తించారు. 

Related Posts