YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

మారని వర్శిటీలు

 మారని వర్శిటీలు

. మారని వర్శిటీలు
నల్గొండ, మార్చి 19
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల రూపురేఖలు సమూలంగా మారతాయనీ, బాగుపడతాయనీ విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆశించారు. నిధుల కొరత ఉండదనీ, సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ కలలుగన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాయి. విద్యార్థులు, యువత, ప్రొఫెసర్లు ఉద్యమంలో ముందుభాగాన ఉండి పోరాడారు. నవతెలంగాణ ప్రతినిధి పరిశీలించిన అంశాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వారి ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతున్నది. ఆరేండ్లయినా ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది. ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ వచ్చాక విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు మరింత దిగజారాయి. వాటిలో 1,551 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరేండ్లయినా అవి భర్తీ కాలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనిద్రాక్షగానే మిగిలింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇవి సమస్యలతో కునారిల్లుతున్నాయి. ఉద్యమ నేత కేసీఆర్‌ విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని భావించారు. కాగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆరేండ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఒక్క విశ్వవిద్యాలయాన్ని సందర్శించలేదంటే ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థమవుతున్నది. ఓయూ శతాబ్ధి ఉత్సవాలను నాడు రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరైనా ఒక్క మాట మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక విశ్వవిద్యాలయాల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇప్పటి వరకు వాటిపై సమీక్ష నిర్వహించలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ చిన్నచూపు, నిధుల కొరత, ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీలు, ప్రమాణాలు దిగజారడం తదితర కారణాలతో నామమాత్రంగా తయారయ్యాయి.విశ్వవిద్యాలయాల్లో పాలనను ప్రభుత్వం గాలికొదిలేసింది. 11 వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఎనిమిది నెలలుగా ఇన్‌చార్జీల పాలన సాగుతున్నది. తొమ్మిది వర్సిటీల వీసీ పోస్టులకు 984 దరఖాస్తులొచ్చాయి. వీసీల నియామకానికి సంబంధించి 2019, సెప్టెంబర్‌ 23న ప్రభుత్వం సెర్చ్‌కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సెర్చ్‌కమిటీలు భేటీ కాలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఇటీవల ఎనిమిది విశ్వవిద్యాలయాలకు పాలకమండళ్లను నియమించింది. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఈసీలను ప్రకటించలేదు. ఎలాంటి అడ్డంకుల్లేకపోయినా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,551 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఇందులో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా వివిధ సాకులతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతున్నది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక విశ్వవిద్యాలయాలకు ప్రగతి పద్దు కింద ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.609.73 కోట్లు కేటాయించినా, నిర్వహణ పద్దుకు రూ.606.73 కోట్లు, ప్రగతి పద్దుకు రూ.3 కోట్లు ప్రతిపాదించింది. ప్రగతి పద్దును తెలుగు వర్సిటీకే కేటాయించడం గమనార్హం. మిగిలిన విశ్వవిద్యాలయాల ప్రగతికి మొండిచేయి చూపించింది. నిర్వహణ పద్దు కింద కేటాయించిన నిధులు బోధన, బోధనేతర సిబ్బంది జీతాలకూ సరిపోదని తెలుస్తున్నది. ఓయూలో జీతాలు, పింఛన్లకే ఏటా రూ.500 కోట్లు అవసరమవుతాయని ప్రొఫెసర్లు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం రూ.343.58 కోట్లు కేటాయించడం గమనార్హం. ఓయూ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు రూ.200 కోట్లు కేటాయించినా రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.150 కోట్లు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నిధులు విడుదలవుతాయో, లేదో స్పష్టత లేదు. ఇలా విశ్వవిద్యాలయాలు అన్ని రకాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వ ఆదరణ లేక ప్రమాణాలు దిగజారుతున్నాయి.ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. ఉచిత విద్య, ఉచిత మెస్‌ అంటూ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.8 వేలు, బీసీలకు రూ.9,100, ఓసీలకు రూ.10,100 డిపాజిట్‌ చేయాలి. నాణ్యమైన భోజనం పెట్టకుండానే మెస్‌ బిల్లు రూ.2,600 నుంచి రూ.3 వేల వరకు వస్తున్నది. స్కాలర్‌షిప్‌ రూ.1,500 మాత్రమే ఇస్తారు. మిగిలింది విద్యార్థులే సొంతంగా కట్టాలి. ఆ డబ్బు కడితేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత సమస్య తీవ్రంగా ఉన్నది. ఫ్యాన్లు, బాత్రూమ్‌లు సక్రమంగా లేవు. కరెంటు సమస్య ఉన్నది. ఓయూలో అమ్మాయిలకు రక్షణ లేదు. లేడీస్‌ హాస్టళ్ల వద్ద సెక్యురిటీని పెంచాలి. మెయిన్‌ లైబ్రరీ, ఆర్ట్స్‌ కాలేజీలో వర్షం వస్తే పెచ్చులూడుతున్నది. ల్యాబ్‌లను ఆధునీకరించాలి. క్రీడా సామగ్రి అందరికీ అందుబాటులో ఉంచాలి. ఓయూ అభివృద్ధికే రూ.400 కోట్లు కేటాయించాలి. సమస్యలను పరిష్కరించి ఆదర్శ వర్సిటీగా తీర్చిదిద్దాలి.ఓయూలో పీహెచ్‌డీ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పీజీ విద్యార్థులకు రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందినా హాస్టల్‌ వసతి కల్పించడం లేదు. 2018లో పీహెచ్‌డీ ప్రవేశం పొందిన 500 మంది హాస్టల్‌ వసతి లభించక, బయట రూమ్‌లు తీసుకుని ఉంటున్నారు. 1,500 మందికి సరిపడే హాస్టల్‌ నిర్మించినా రెగ్యులర్‌ వీసీ లేరనే సాకుతో ప్రారంభించడంలేదు. ఆ హాస్టల్‌ను ప్రారంభించి విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలి. మెస్‌ బకాయిలు ప్రభుత్వమే భరించాలి.టీఆర్‌ఎస్‌ పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యాయి. సీఎం కేసీఆర్‌ వర్సిటీలను సందర్శించరు. విద్యామంత్రులుగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఇప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి పర్యటించలేదు. నిధులు కేటాయించకుండా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి. ఐఏఎస్‌లు ఇన్‌చార్జి వీసీలుగా ఉంటే ఆగస్టు 15, జనవరి 26న జెండా పండుగకు మాత్రమే వస్తారు. మా సమస్యలు ఎవరికి చెప్పాలి. నిధులు కేటాయించకుండా, ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా వర్సిటీలను భ్రష్టుపట్టిస్తున్నారు.ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే పరిశోధనలపై ప్రభావం పడుతున్నది. ఓయూలో 1,268 పోస్టుల్లో 450 మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలంటే ప్రొఫెసర్లు దొరికే పరిస్థితి ఉండదు. అందుకే ప్రభుత్వం అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లను క్రమం తప్పకుండా భర్తీ చేయాలి. అప్పుడే ప్రొఫెసర్ల కొరత లేకుండా ఉండదు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఉద్యోగ విరమణ వయస్సును పెంచినా ప్రయోజనం ఉండదు. ఇక జీతభత్యాలకే ప్రభుత్వం నిధులు కేటాయించడం సరైంది కాదు. వర్సిటీల ప్రగతికి నిధులివ్వాలి.ఓయూ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి. నియామకాలను రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి కాకుండా వర్సిటీల నుంచి నేరుగా ఉద్యోగావకాశాలు కల్పించాలి. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించాలి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన దేశాల్లోని వర్సిటీల్లో ఇంటర్న్‌షిప్‌ సౌకర్యం కల్పించాలి. విద్యార్థి సంఘాల ఎన్నికలను జరపాలి. అన్యాక్రాంతమవుతున్న ఓయూ భూములను పరిరక్షించడానికి పటిష్టమైన ప్రహరీగోడ నిర్మించాలి. విశ్వవిద్యాలయాలను సీఎం హోదాలో సందర్శించాలి. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Related Posts