YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరీంనగర్‌లో కరోనా...హై అలర్ట్

కరీంనగర్‌లో కరోనా...హై అలర్ట్

కరీంనగర్‌లో కరోనా...హై అలర్ట్
హైదరాబాద్‌, మార్చి 19
కరీంనగర్‌లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించడంతో.. ఆ జిల్లా ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇండోనేషియా నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ బృందం పర్యటించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో వంద ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరీంనగర్‌ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు యోచిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లను అప్రమత్తం చేశారు. కరోనా టెస్టులకు సంబంధించి ఆశా వర్కర్లకు వైద్యాధికారులు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు అందరూ మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు.రాష్ట్రమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు రద్దు చేస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి రాష్ర్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. నిన్న ఒక్క రోజే 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.   బుధవారం కలెక్టరేట్‌లో  పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌.. కలెక్టర్‌, శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నట్టు గుర్తించామని.. ఆ సమయంలో సంచరించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను గుర్తించామని సమావేశం తర్వాత మంత్రి గంగుల మీడియాకు వెల్లడించారు. కలెక్టరేట్‌ పరిధిలోని ఓ ప్రార్థనామందిరంలో గడిపినట్టు గుర్తించామని,  కలెక్టరేట్‌ కేంద్రంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గురువారం నుంచి వంద వైద్య బృందాలను రంగంలోకి దిం పుతున్నట్టు తెలిపారు.  ప్రజలు నాలుగురోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దని కోరారు. జిల్లాకేంద్రంలో 20 ఐసొలేషన్‌, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటుచేశామని, రెండు ప్రైవేటు దవాఖానలు ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్ల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. కరీంనగర్‌ నగరమంతటా శానిటైజేషన్‌ చేస్తున్నామని, జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడవద్దని ప్రచారంచేస్తున్నామన్నారు. అత్యవసరంగా చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దింపాలని వెల్లడించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం చేపట్టే అన్ని రకాల చర్యలు కేవలం ముందస్తులో భాగమేనని మంత్రి గంగుల పేర్కొన్నారు. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. 

Related Posts