YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

 ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు 

 ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు 

 ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు 
గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ గర్భిణీ స్త్రీల గుర్తింపు, దవాఖానా తరలింపునకు వసతులు ఉగాది, ఆదివారం సెలవురోజుల్లో కూడా సరుకుల పంపిణీ
అంగన్ వాడీల మూతపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
హైదరాబాద్, మార్చి 23 
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను మూసివేయాలనిరాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  ఆదేశాల మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో ఇచ్చే సరుకులన్నింటిని వారి వారి  ఇంటి వద్దకే పంపిణీ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాల మూసివేత అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై మహిళా – శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి  దివ్య తో మంత్రి సమీక్ష చేశారు. అంగన్ వాడీ కేంద్రాలు మూసివేయడం వల్ల అక్కడ వచ్చే సరుకులు ఆగిపోతాయన్న ఆందోళనకు ఆస్కారం ఇవ్వకుండా వెంటనే అంగన్ వాడీ కేంద్రాలలో ఇచ్చే సరుకులన్నింటిని ఇంటికి పంపిస్తామన్న ధీమా ప్రజలకు కల్పించాలని అధికారులకు సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఇచ్చే బియ్యం, పప్పు, నూనే, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలని చెప్పారు. ఈ గ్రామ కమిటీలో అంగన్ వాడీ టీచర్, ఆయా, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, స్థానిక పోలీస్ ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్దతిలో, సరైన సమయంలో లబ్దిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధారణంగా అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సెలవు దినాల్లో సరుకులు ఇవ్వడం లేదని, ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా ప్రతి రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా సిఎం కేసిఆర్  ఆదేశించినట్లు గ్రామాలు, పట్టణాల్లోని అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవానికి దగ్గరగా ఉండే గర్భిణీ స్త్రీల జాబితా సిద్ధం చేసుకుని, ఈ అత్యవసర సమయంలో వారికి ప్రభుత్వం అందించే అన్ని సేవలు లభించేలా చూడాలన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వారి గురించి సులభంగా తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించే చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామంలో, పట్టణంలో ఎవరైనా కరోనా లక్షణాలున్నట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.  మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు విహార్ లో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ నేపథ్యంలో ప్రత్యేక శ్రధ్ద పెట్టి, పరిశుభ్రత పాటించాలన్నారు. అదేవిధంగా ఈ శాఖ పరిధిలోని హోమ్స్ లలో కూడా పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలన్నారు. రోటేషన్ పద్దతిలో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని, 20 శాతం వీలైతే అంతకన్నా తక్కువ అయినా ఇబ్బంది లేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ వద్ద గణాంకాల ప్రకారం గర్భిణీ స్త్రీలు 3.3 లక్షల మంది నమోదు అయి, ఆరోగ్య లక్ష్మీ ద్వారా లబ్దిపొందుతున్నారని ఆ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి దివ్య తెలిపారు. అదేవిధంగా మూడు  నుంచి 6 సంవత్సరాల లోపు బాల, బాలికలు 4.40 లక్షల మంది ఉన్నారన్నారు. ఏడు  నెలల నుంచి 3 సంవత్సరాల లోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారని చెప్పారు. వీరందరికీ అంగన్ వాడీ ద్వారా అందించే సేవల్లో, సరుకుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. పాలు, గుడ్లు, నూనె, సరుకులు అందించే ప్రభుత్వ పంపిణీ సంస్థలతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామన్నారు.

Related Posts