YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

కరోనా వేళ..అడ్మిషన్ల గోల

కరోనా వేళ..అడ్మిషన్ల గోల

కరోనా వేళ..అడ్మిషన్ల గోల
గుంటూరు, మార్చి 24
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం సెలవుల్ని వారి వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి వాడుకుంటున్నాయి. జిల్లాలోని స్కూల్స్‌, కాలేజీల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థులను చేర్చాలని వారి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు టార్గెట్లు ఇచ్చి మరీ ఇళ్ల వెంట పంపిస్తున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించటానికి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే యాజమాన్యాల చర్య అందుకు భిన్నంగా ఉంది. ఇది ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేస్తోంది. ఉద్యోగం సంగతి అటుంచి ఎక్కడ వైరస్‌ సోకుతుందోనని బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం కరోనా ప్రభావంతో ఈనెల 31వ తేదీ వరకూ అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అడ్మిషన్ల క్యాంపెయిన్‌ కూడా నిర్వహించకూడదని ఆదేశాలున్నాయి. కానీ జిల్లాలో అమలు కావట్లేదన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఈ పది రోజుల సమయాన్ని ఉపయోగించుకోవటానికి పిఆర్‌ఒలను రంగంలోకి దించింది. సాధారణంగా పరీక్షల ముగిసిన తర్వాత చేయాల్సిన ఈ పనిని యాజమాన్యాలు పరీక్షలకు ముందే చేపట్టాయి. పదో తరగతి పరీక్షలు ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ కొత్త విద్యా సంవత్సర అడ్మిషన్ల కోసం ఇప్పుడే వేట ప్రారంభమైంది. ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేయకపోతే వేతనాలు ఇవ్వలేమని యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గుంటూరులో కొన్ని యాజమాన్యాలు ఫిబ్రవరి నెల వేతనాలు కూడా ఉపాధ్యాయులకు ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉంటే సర్వత్రా కరోనా ఫీవర్‌ కలవర పెడుతుంటే ఉపధ్యాయులు అడ్మిషన్ల కోసం ఇళ్ల వెంట వస్తున్న తీరును చూసి ప్రజలు వింతగా చూస్తున్నారు. కొందరు వారికి దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకొని అడ్మిషన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించకుండా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Related Posts