YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఈ షట్‌డౌన్‌ ఎందుకంటే..

ఈ షట్‌డౌన్‌ ఎందుకంటే..

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ప్రభుత్వ నిర్వహణ, ఖర్చులకు సంబంధించి నిధుల వినియోగంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో  ప్రభుత్వం షట్‌డౌన్‌ అయింది. దీని వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. 40శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ప్రకటించారు.

ఈ షట్‌డౌన్‌ ఎందుకంటే..

ఈ ద్రవ్య వినిమయ బిల్లులో అమెరికాలోని స్వాప్నికుల(డ్రీమర్స్‌) భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని డెమోక్రాట్లు వ్యతిరేకించారు. వీరికి కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతిచ్చారు. స్వాప్నికులు ఎవరంటే సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారి పిల్లలు. వీరికి తాత్కాలికంగా అమెరికాలో ఉండే హక్కు ఇచ్చారు. వీరు ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒబామా హయాంలో చట్టబద్ధంగా వీరికి ఈ అవకాశం కల్పించారు. అయితే ట్రంప్‌ దీన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలా చేస్తే దాదాపు 8లక్షల మంది స్వాప్నికుల భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. తాజా ద్రవ్య వినిమయ బిల్లులో ట్రంప్‌ స్వా్ప్నికుల భద్రతను పక్కన పెట్టడంతో డెమోక్రాట్లు ఆగ్రహించారు.

ఇప్పుడు ఏం జరుగుతుంది..?

* ప్రభుత్వం మూతపడటంతో లక్షలాది మంది ఉద్యోగులు వేతనం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. రక్షణ విభాగంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడుతుంది.

* అత్యవసర సేవల్లో పనిచేసే 1.5 మిలియన్‌ మిలిటరీ సిబ్బంది, 40వేల మంది హోంల్యాండ్‌ భద్రత సిబ్బంది యథావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని పెంటగావ్‌ తెలిపింది. వీరు కాకుండా పెంటగావ్‌లోని సుమారు 7,40,000 మంది ఉద్యోగులు ఇంటికి పరిమితం అవుతారు.

* అధ్యక్ష నివాసం వైట్‌హస్‌, కాంగ్రెస్‌, ఫెడరల్‌ కోర్టులు, వెటరన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభగాలు యథావిధిగా నడుస్తాయి. యూఎస్‌ పోస్టల్‌ సర్వీసు కూడా నడుస్తుంది.

* ఫెడరల్ బడ్జెట్‌పై ఆధారపడే అమెరికా క్యాపిటల్‌ వాషింగ్టన్‌పై షట్‌డౌన్‌ ప్రభావం పడనుంది. చెత్త నిర్వహణ, వీధుల శుభ్రతకు సంబంధించిన సేవలు నిలిచిపోతాయి. గ్రంథాలయాలు మూతపడతాయి. కానీ పాఠశాలలు, ప్రజారవాణా విభాగాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

* అమెరికాలో విమాన ప్రయాణాలను నిర్వహించే ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సాధారణంగా పనిచేస్తుంది. విమానాశ్రయాలు ప్రయాణికుల కోసం తెరిచే ఉంటాయి.

* తాత్కాలిక ప్రణాళికల ప్రకారం..కొన్ని ప్రాంతాల్లో జాతీయ పార్కులు, మ్యూజియంలు తెరిచి ఉంచే అవకాశం ఉంది. అయితే అందులోని ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా ప్రైవేటు కాంట్రాక్టర్లతో నడిపించే అవకాశం ఉంటుంది.

* వైద్య విభాగంలో అత్యవసర సేవలు నడుస్తాయి. వ్యాధి నియంత్రణ కేంద్రాలకు సంబంధించిన ఉద్యోగుల్లో 61శాతం మంది విధులకు హాజరుకారు. పరిశోధనకు సంబంధించిన నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్స్‌ మూతడపతాయి.

* రెవెన్యూ సేవలు, సోషల్‌ సెక్యురిటీ అడ్మినిస్ట్రేషన్‌, గృహ పట్టణాభివృద్ధి విభాగాలు, విద్య, వాణిజ్య, కార్మిక, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విభాగాలు మూతపడతాయి.

Related Posts