
కేసులు అధికం…అయినా అందోళన వద్దు
కర్నూలు ఏప్రిల్ 6
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయిన నేపథ్యంలో సోమవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ షెట్టి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిజిహెచ్ డాక్టర్లు, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గోన్నారు. మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 56..రాష్ట్రంలోనే అత్యధికం గా నమోదయింది. జిల్లా ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యం చెప్పడానికి, కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు పగడ్బందీగా తీసుకుంటున్నామని తెలియ జేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సమీక్షకు వచ్చానని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలను పూర్తిగా చేపట్టాము..అన్ని జిల్లాల్లో జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో.. కరోనా కట్టడి చర్యలు చేపట్టామని అన్నారు. కోవిడ్ పేషేంట్ల రవాణా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ డాక్టర్లకు, పారా మెడికల్ సిబ్బందికి, అంబులెన్స్ డ్రైవర్లకు, ఎన్ 95 మాస్కులు, పీపీఈ తదితర మెడికల్ ఎక్విప్మెంట్ అన్నింటిని తప్పని సరిగా అందించాలని డిఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆళ్ల నాని ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన వారిని 100 శాతం హోమ్ ఐసోలేషన్ చేయడం, ఢిల్లీ నుండి జిల్లాకు వచ్చిన మొత్తం 357 మందిని ట్రేస్ చేసి క్వారంటైన్ లో పెట్టి టెస్ట్ చేయించడం లాంటి చర్యలు బాగున్నాయి.. మెడికల్ సర్వైలైన్స్ ను కంటిన్యూ చేయండని అన్నారు. జిల్లాలో పీపీఈ లు, ఎన్95 మాస్కులు, సర్జికల్ కేసులు, అవసరమైన మందుల అందుబాటు ను సమీక్ష చేసి.. ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని, కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రాధాన్యతనిచ్చి అవసరం అయినన్ని ఎన్95 మాస్కులను, పీపీఈ లను ఇస్తామని అధికారులకు మంత్రి భరోసా ఇచ్చారు.