YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నత్తనడకన ‘ప్యాకేజీ-22’!

నత్తనడకన ‘ప్యాకేజీ-22’!

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగానే ‘ప్యాకేజీ-22’ను ప్రవేశపెట్టారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవం ప్రాజెక్‌లో భాగంగా ఈ పనులు జరిపించాలని నిర్ణయించారు. జిల్లాలకు సాగునీరు అందించి తీరాలన్న లక్ష్యం బాగానే ఉన్నా.. దీనికి సంబంధించిన పనులే మందకొడిగా సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. 'ప్యాకేజీ-22' త్వరితగతిన పూర్తి అయితే తమ ప్రాంతానికి సాగు నీటి కొరత ఉండదని రైతులు ఆశించారు. అయితే వారి ఆశలకు తగ్గట్లుగా పనులు సాగడంలేదు. దీంతో వారిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే పూర్తి స్థాయిలో పంటలు పండించుకోగలమని వివరిస్తున్నారు. 

సముద్రంలో చేరుతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం ప్రారంభించిది. కాళేశ్వరం నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయాన్ని నింపాలని అధికారులు ప్లాన్ చేశారు. నిజాంసాగర్‌ నాన్‌ ఆయకట్టు పరిధిలోని పొలాలకు నీళ్లు అందించేందుకు 20, 21, 22 కింద సాగునీటి కాల్వలు, రిజర్వాయర్లు కట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 20వ, 21వ ప్యాకేజీలు నిజామాబాద్‌ జిల్లాకు, కామారెడ్డి జిల్లాకు 22వ ప్యాకేజీని  కేటాయించారు. కాల్వలు తవ్వి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు యత్నిస్తున్నారు. చెరువులు, కుంటల్లో నీటిని నింపేలా ప్రణాళికలు కూడా తయారుచేశారు. కాలువలు భూంపల్లి, లింగంపల్లి, దేమికలాన్‌, గుజ్జుల్‌, రామాయంపేటల్లో తవ్వనున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా కామారెడ్డి మీదుగా మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని మల్లచెరువు వరకు తరలిస్తారు. దీని కింద రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంటుంది. విస్తృత స్థాయిలో  రైతాంగానికి ప్రయోజనం ఉండే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అంతా కోరుతున్నారు.

Related Posts