YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబుల్ వసూళ్లు!

డబుల్ వసూళ్లు!

బస్టాండ్లలో విక్రయించే వస్తువులను వినియోగదారులకు ఎమ్మార్పీ ధరలకే అందించాలి. అయితే ఈ నిబంధన పలు ప్రాంతాల్లో అమలుకావడంలేదు. ప్రధానంగా హన్మకొండ బస్టాప్‌లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రజల నుంచి అసంతృప్తులు, ఫిర్యాదులు వచ్చినా సమస్య పరిష్కృతంకాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హన్మకొండ పెద్ద బస్టాండ్. రోజూ 90 వేల మంది వరకూ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో ఇక్కడ వ్యాపారమూ జోరుగానే ఉంటుంది. అయితే బస్టాండ్‌లో స్టాల్స్ నిర్వహించేవారు వస్తువులను అధిక ధరలకు అమ్ముతుండడమే ప్రధాన సమస్యగా మారింది. పగలు, రాత్రి సమయాల్లో వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారు ఇక్కడి వారు. బస్టాండ్‌లో మినహా రాత్రి సమయాల్లో ఎక్కడా దుకాణాలు తెరచి ఉండకపోవడంతో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వినియోగదారుల ఫిర్యాదులతో స్పందించిన అధికార యంత్రాంగం బాధ్యులకు జరిమానాలు విధిస్తోంది. అయితే జరిమానాలు చెల్లించేసి ఎప్పట్లానే వసూళ్లకు పాల్పడుతున్నారు. 

దుకాణాల నిర్వాహకుల తీరు మారకపోవడంతో బస్టాండ్‌లో తరచూ ప్రయాణికులకు వారికి తగాదాలు తలెత్తుతున్నాయి. ఎమ్మార్పీ ధర కంటే పైసా ఎక్కువగా చెల్లించమని వినియోగదారులు అంటే.. కొంటే కొనండి లేదంటే లేదు అంటూ దుకాణాదారులు తెగేసి చెప్తున్నారు. ఇదిలాఉంటే అధిక ధరలు వసూలు చేస్తున్నా నాణ్యమైన సరకు ఉండడం లేదని మరికొందరు ప్రయాణికులు చెప్తున్నారు. స్థానికంగా తయారైన వస్తువులనే విక్రయిస్తున్నారని అంటున్నారు. బ్రాండెడ్‌కు బదులు స్థానికంగా దొరికే వాటితో అధిక లాభాలు వస్తుండటంతో వాటినే విక్రయిస్తున్నారు. శీతల పానియాలు తినుబండారాలు కూడా నాణ్యతమైనవి కాకుండా సొంతంగా తయారు చేసినవి అమ్ముతున్నారు. పలువురు దుకాణాదారులు అగ్‌మార్కు లేని వాటిని అమ్ముతున్నట్లు ప్రయాణికులు స్పష్టంచేస్తున్నారు. ఈ విషయమై దుకాణాదారుల తమదైన వాదననూ వినిపిస్తున్నారు. షాప్ సైజును బట్టి నెలకు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించాల్సి వస్తోందని, బ్రాండెడ్ వస్తువులు ఎమ్మార్పీ ధరకు విక్రయిస్తే తాము దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని, కనీసం అద్దె డబ్బులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. అద్దె తగ్గిస్తే.. నాణ్యమైన వస్తువులనే ఎమ్మార్పీ రేటుకు విక్రయిస్తామని చెప్తున్నారు. మరి ఈ సమస్యకు అధికార యంత్రాంగం ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.

Related Posts