YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అకాల వర్షం..అపార నష్టం..

అకాల వర్షం..అపార నష్టం..

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. కష్టనష్టాలు ఎదుర్కొని చేతికి అందిన కొద్ది పంటకు మద్దతు ధర కోసం నానాపాట్లు పడుతున్నారు. అయినప్పటికీ పంట అమ్మకంలో మాత్రం రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఈ కష్టాలకు తోడు ప్రతికూల వాతావరణం అన్నదాతలకు శరాఘాతంగా మారుతోంది. చీడపీడల నుంచి పంటను ఎలాగోలా కాపాడుకున్నా ప్రకృతి మార్పుల నుంచి మాత్రం పంటలను రక్షించుకోలేకపోతున్నారు. మొత్తంగా ప్రకృతి కన్నెర్ర చేస్తే.. రైతులు కంట నీరు పెట్టుకోవాల్సి వస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల కర్షకులు ప్రస్తుతం ఈ కష్టాల్లోనే ఉన్నారు. ఇటీవలిగా కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. కోత సమయంలో అకస్మాత్తుగా వర్షాలు రావడంతో రైతులకు అపారనష్టం సంభవించింది. దీంతో అన్నదాతలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. 

జనవరి 1 నుంచి 24గంటల విద్యుత్ అందుబాటులో ఉండడంతో రైతులు విస్తృత స్థాయిలో వరి పండించారు. పంటకు ఎప్పటికప్పుడు నీరు అందించడంతో దిగుబడి ఆశాజనకంగానే ఉంది. అయితే ఇటీవలి వర్షాలకు పంట మొత్తం ధ్వంసమైంది. విద్యుత్, సాగు నీరు సరఫరా బాగుండడంతో రైతులు పంటలు బాగానే పండించుకున్నారు. మంచి దిగుబడులే దక్కించుకున్నారు. దీంతో ఈ దఫా ఆర్ధిక కష్టాలను అధిగమించవచ్చని వారంతా భావించారు. ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పంట సేకరిస్తుండడంతో గిట్టుబాటు ధర దక్కుతుందని ఆశించారు. అయితే అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. చేతికొచ్చే దశలో పంట నేలవాలిపోవడంతో రైతాంగం ఆవేదనలో కూరుకుపోయింది. నీటమునిగిన పంటను సేకరించి, అమ్ముకునే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని, త్వరితగతిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts