YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గుంతలతో తప్పిన నీటి తంటాలు

గుంతలతో తప్పిన నీటి తంటాలు

వేసవి వచ్చిందంటే పలు ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంటుంది. తాగు నీరు కోసం నానాపాట్లు పడాల్సి వస్తుంటుంది. ఏళ్లుగా ఇదే సమస్య ఉండడం, అధికార యంత్రాంగం కూడా నీటి సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా ఉండడంతో ఆ ప్రాంత వాసులు తామే సమస్యకు చెక్ పెట్టాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు ఆరంభించి మంచి ఫలితాలు సాధించారు. అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్న వీరు నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం దూన్‌గాం సమీపంలోని తండా వాసలు. దూన్‌గాం చుట్టూ నడిమితండా, నక్కలగుట్ట తండా, గొల్లమట్ తండాలు ఉన్నాయి. ఇక్కడి రక్షిత మంచినీటి ట్యాంకులు నిండిపోయినప్పుడు నీరు వృథాగా పోతుంటుంది. అయితే ఈ వృథాపై సంబంధిత సిబ్బంది ఉదాసీనంగా ఉంటోంది. వేసవిలో నీటికి ఎంత కష్టం ఉంటుందో తెలిసిన స్థానికులు ఈ సమస్యను అధిగమించేందుకు ట్యాంక్‌ల సమీపంలోనే ఓ పెద్ద గుంట తవ్వారు. ట్యాంకుల నుంచి పొంగి పొర్లే నీరు సరాసరి గుంటల్లో చేరేలా పైపులు బిగించారు. దీంతో వృథా నీరు గుంటల్లోకి చేరుతోంది. 

ఏడాది అంతటా వృథా అవుతున్న నీరు పైప్ లైన్ల ద్వారా గుంటల్లోకి చేరుతోంది. దీంతో గుంట ఎప్పుడూ నీటితో నిండి ఉంటోంది. గుంట ఉండడం వల్ల ఏటా వేసవికాలంలో అనేక గిరిజన తండాలు నీటి ఎద్దడితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా తమకు మాత్రం ఆ ఇబ్బంది లేదని స్థానికులు చెప్తున్నారు. తండా వాసులు వేసవి తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంలేదని తెలిపారు. నీటి పొదుపు కోసం తీసిన గుంత నీటికి ట్యాంకు, బోరు మోటారుకు సమీపంలో ఉంటడంతో బోరు మోటార్లలో ఏడాది పొడవునా  నీరు వస్తుందని చెప్తున్నారు. నేలలోకి నీటికి ఇంకించడంతో భూగర్భ జలాలు పెరగటంతో తాగునీరు రెండుపూటలా అందుతోందని వివరించారు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ మూగజీవాలైతే తాగునీరు లేక అల్లాడుతుంటాయి. కానీ ఇక్కడ అలాంటి సమస్యలేదు. అనేక సందర్భాల్లో మధ్యాహ్న సమయంలో గుంటల వద్దకు వన్యప్రాణులు సైతం వచ్చి దాహం తీర్చుకుంటాయి. వృథా అవుతున్న ప్రతి నీటి చుక్కను పొదుపు చేస్తున్న ఈ తండా వాసులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Related Posts