YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

అమెరికాలో తొలి బుబోనిక్ ప్లేగు కేసు

అమెరికాలో తొలి బుబోనిక్ ప్లేగు కేసు

వాషింగ్టన్, జూలై 16, 
ఓవైపు గతేడాది చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతుండగా.. డ్రాగన్ దేశంలో బుబోనిక్ ప్లేగు మరోసారి మొదలైన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలోనూ ఈ ఏడాది తొలి ప్లేగు కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఓ ఉడుతకు బుబోనిక్ ప్లేగు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇది అరుదైనందే అయినా ఈగల ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియా వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. మోరిసన్ నగరంలోని ఓ ఉడుతకు జులై 11న బుబోనిక్ ప్లేగు నిర్ధారణ అయినట్టు జఫర్సన్ కంట్రీ పబ్లిక్ హెల్త్ విభాగం వెల్లడించినట్టు సీఎన్ఎస్ మీడియా తెలిపింది.మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర వ్యాధిగా ఈ ప్లేగును డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా 800 ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగుగా విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 14 శతాబ్దంలో యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలో వ్యాపించింది. దీని బారిన పడి నాలుగేళ్లలో 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఐరోపాలోనే 25 నుంచి 60 శాతం చోటుచేసుకున్నాయి.ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సరైన నిబంధనలు పాటించకపోతే జంతువుల నుంచి సంక్రమించే బుబోనిక్ ప్లేగు... జంతువులు లేదా మనుషులకు వ్యాపించగలదు. ఈ వ్యాధి ఈగలు, సోకిన జంతువుల నుంచి వ్యాపిస్తుంది. యాంటీబయాటిక్స్‌తో త్వరగా చికిత్స చేస్తే మరణాన్ని నివారించగలవు. ఇది ఇప్పటికీ మానవులకు, జంతువులకు పెద్ద ముప్పుగా పరిణమించింది.ఈ వ్యాధి సోకితే గజ్జలు, చంకలు లేదా మెడపై కోడి గుడ్ల మాదిరిగా శోషరస కణుపులు పెరుగుతాయి.. ఇవి మృదువుగా, వెచ్చగా ఉంటాయి.. మరికొందరిలో జ్వరం, చలి, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు తదితర లక్షణాలు బయటపడతాయి. ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి నిర్ధారణ కాగా.. వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు చైనా జులై 7న ప్రకటించింది. వీరితో కాంటాక్ట్ అయిన 146 మందిని క్వారంటైన్ చేశామని తెలిపింది.మరోసారి ప్లేగు వ్యాధి వ్యాపిస్తోందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అధికారంగా ఏటా 1000 నుంచి 2,000 కేసులు నమోదవుతున్నాయని, లెక్కల్లోకి రాని కేసులు కూడా చాలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అమెరికాలో ఏటా కొద్ది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. 2015లో కొలరాడోలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Related Posts