YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

ఆక్సఫర్డ్ వర్శిటీ గుడ్ న్యూస్ చెప్పేసింది

ఆక్సఫర్డ్ వర్శిటీ గుడ్ న్యూస్ చెప్పేసింది

లండన్, జూలై 21, 
దాదాపు ఒకటిన్నర కోట్లమంది జీవితాలను అతలాకుతలం చేసి లక్షలాదిమంది ప్రాణాలు హరింపచేసి, ఆర్థిక వ్యవస్థలను, జన జీవితాలను విధ్వంసం చేస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరి అవుతున్న పరిస్థితుల్లో యావత్ ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా చూస్తున్న ఈ తరుణంలో.. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఫేజ్-1, 2 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు ఫలించాయని మూడో దశ ట్రయల్స్ కూడా త్వరలో పూర్తయి కరోనా వ్యాక్సిన్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని ఆక్స్ ఫర్జ్ వర్శిటీ ప్రకటించింది.
నెలల తరబడి తీవ్ర పరిశోధనల అనంతరం కరోనా వైరస్ నిరోధానికి తాము కనుగొన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమని, ఈ వ్యాక్సిన్ వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని తేలిందని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్, వైట్‌సెల్స్ పెరిగినట్లు కూడా ఆక్స్‌‌ఫర్డ్ తెలిపింది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు ఫేజ్ 1, ఫేజ్ 2 దశల క్లినికల్ ట్రయల్స్ సాగినట్లు ఆక్స్ ఫర్డ్ వర్శిటీ ప్రకటించింది. మనుషులపై జరిపిన తొలి 2 దశల ప్రయోగ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసిన అక్స్‌ఫర్డ్.. వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేసి.. యాంటీబాడీలు, టీ-సెల్స్‌ను చైతన్యవంతం చేసిందని ప్రకటించింది. ఈ మేరకు వివరాలతో ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ఓ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. . బ్రిటీష్‌ - స్వీడిష్‌ బహుళజాతి ఫార్మా కంపెనీ ఆస్త్రా జెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలు కలిసి ‘ఏజెడ్‌డీ1222’ పేరిట అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ను అందించిన 18 నుంచి 55 ఏళ్లలోపు 1,077 మంది వలంటీర్లలో సానుకూల ఫలితాలు వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అధ్యయనాన్ని ‘ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌’లో ప్రచురించింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. అతి కొద్దిమంది వలంటీర్లకు అప్పుడప్పుడు స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తినా.. పారాసెటమాల్‌ను అందించగానే తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే రెండు డోసులు సురక్షితమని, ఒక డోసుతో తలెత్తే ప్రభావాన్ని తదుపరి దశ ప్రయోగాల్లో పరీక్షిస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. వలంటీర్లకు వ్యాక్సిన్‌ను అందించిన 14 రోజుల తర్వాత టీ-సెల్స్‌ సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరగా.. యాంటీబాడీలు 28 రోజుల తర్వాత పతాకస్థాయికి పెరిగాయి. కేవలం ఒక్క వ్యాక్సిన్‌ డోసుకే దాదాపు 90 శాతం మందిలో వైర్‌సను కట్టడి చేసే యాంటీబాడీలు ఉత్పత్తి కాగా, మిగతా 10 శాతం మందిలో రెండో డోసుల వ్యాక్సినేషన్‌ తర్వాత వెలువడ్డాయి. ఈ క్రమంలో వాళ్లలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తకపోగా.. వ్యాక్సిన్‌ ప్రభావంతో యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు), టీ-సెల్స్‌ చైతన్యవంతమై వైర్‌సను తిప్పికొట్టాయి.ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తొలి రెండు దశల ప్రయోగ ఫలితాలు సానుకూలంగా రావడాన్ని గొప్ప శుభవార్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. ఈ పరిణామంపై భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా స్పందించారు. ఆగస్టు నుంచి తాము ఆ వ్యాక్సిన్‌ కేండిడేట్‌తో ప్రయోగాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందుకు అనుమతుల కోసం ఈ వారంలోనే దరఖాస్తు చేసుకుంటామన్నారు. ఈ ఫలితాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న మానవాళికి కొత్త ఆశలను రేకెత్తించేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే సెప్టెంబరుకల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌ రిసెర్చ్‌ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ డేవిడ్‌ కార్పెంటర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Related Posts