
హైద్రాబాద్, జూలై 21,
ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం కారణంగా తెలంగాణలో వ్యాపారాలు ఆగిపోయాయి. కరోనా భయంతో జనాలు ఇంటిలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఒకవేళ వైరస్ సోకితే కనీసం టెస్టులు చేసే పరిస్థితి లేకపోవడం.. టెస్టులు చేసినా సర్కారీ దవాఖానాల్లో సరైనా ట్రీట్‌మెంట్ అందకపోవడం వంటి కారణాలతో గడప దాటడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టట్లేదని, ఊపిరి అందడం లేదని పేషెంట్లు సెల్ఫీ వీడియోలు పోస్టుల చేయడం, తర్వాత కొన్ని గంటల్లోనే వాళ్లు చనిపోయారంటూ వార్తలు రావడంతో జనంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా పరీక్షలకు వెళ్లాలంటేనే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పని సరి. కానీ డాక్టర్లు ఎవరూ ప్రిస్కిప్షన్ రాసి ఇవ్వడం లేదు. ప్రైవేటు హాస్పిటళ్లకు పోతే మోయలేనంత బిల్లులు.. కరోనాతో చనిపోతే శవాన్ని తాకడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వంటివి ప్రజల్లో నెలకొనడంతో భయం పెరిగిపోతోంది. వాసన, రంగు కోల్పోయినా ఏవో రెండుమూడు టాబ్లెట్లు వాడేసి ఊరకుండిపోతున్నారు.ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా ఎవరూ గడప దాటడం లేదు. ఏదైనా పెద్ద అవసరం పడితేనే బయటకు వెళ్తున్నారు. జనంలో పెరిగిన భయంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన షాపింగ్ మాల్స్, హోల్‌సేల్ షాపులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కరోనా భయం లక్షలాది మంది ప్రజల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్లు బోసిపోతున్నాయి. కరోనా వైరస్ రాకముందు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కరీంనగర్ లతోపాటు నేషనల్, స్టేట్ హైవేలపై ఎప్పుడూ హోటళ్లు తెరిచే ఉండేవి. రద్దీతో కళకళలాడేవి. హైదరాబాద్లో గంట కూడా గ్యాప్ లేకుండా రోజంతా నడిచే బిర్యానీ హౌస్ లు వందలాది నడిచేవి. కానీ ఇప్పుడు హోటళ్ళలో టేక్ అవేల దగ్గర సందడి లేదు. కరోనాతో సీన్ మారిపోయింది. పెద్ద బ్రాండ్ హోటళ్లు, ఫుడ్ సెంటర్లకు అసలు వ్యాపారమే లేదు. హైదరాబాద్లో బిర్యానీకి బ్రాండ్ ఉండే ప్యారడైజ్ హోటల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ సడలింపులు ఉన్నా జనం ఎవరూ బయటి తిండికి ఆసక్తి చూపడంలేదు. గతంలో ఏదైనా పని కోసం నగరాలు, పట్టణాలకు వెళ్లినప్పుడు అక్కడే తినేటోళ్లు. కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇంటి దగ్గరి నంచి బాక్సు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారు. మాములు సందర్భాల్లో బాగా నడిచే బట్టల షాపులు, రెస్టారెంట్లపైనే ఇప్పుడు ఎక్కువ ప్రభావం పడింది. రవాణా రంగాన్ని కరోనా కుదిపేస్తోంది. క్యాబ్ లు, ఆటోలు సరిగా తిరగడం లేదు. గతంలో 10 నుంచి 15 ట్రిప్పులు వేసే నగరంలోని ఆటోవాలాలు. ఇప్పుడు సగానికి సగం కూడా తిప్పడంలేదు.మార్చి నెల వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లో 1.20 లక్షల క్యాబ్‌లు, మూడు లక్షల ఆటోలు తిరిగేవి. రోజుకు 10 లక్షల మందికి పైగానే వీటిలో ప్రయాణించే వారు. లాక్ డౌన్ అనంతరం ఆటోలు, క్యాబ్‌లకు ఆంక్షలతో కూడిన పర్మిషన్లు ఇవ్వడంతో మొదట్లో దాదాపు అన్ని క్యాబ్‌లు, ఆటోలు రోడ్లపైకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 60 వేల వరకు క్యాబ్‌లు, 50 వేల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. జనం తిండి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది బట్టలకే. గత నాలుగునెలలుగా ఎక్కువ మంది జనం కొత్త బట్టలు కొనడంలేదు. మందుల షాపులు మాత్రమే బిజీగా వుంటున్నాయి. కేవలం మాస్కులు కొనుక్కోవడానికే జనం బయటకు వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉంటే తప్ప ఎవరూ బట్టల దుకాణాలకు వెళ్లడంలేదు.
చాలామంది ఎక్కువ ఖర్చు నిత్యావసరాలకే పెడుతున్నారు. చాలా ఐటీ కంపెనీలు వివిధ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు. మొదట్లో ఐటీ కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేయగా, ఇప్పుడు చాలా ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తాము ఇంటి నుంచే పని చేస్తామని తేల్చిచెప్తున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల క్యాబ్ లకు గిరాకీ తగ్గిపోయింది. హైదరాబాద్‌లో చిన్నాచితకా పనులు చేసుకునే 20 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్లిపోవడంతో హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెరిగిపోయాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో 2 లక్షల మందికిపైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఊళ్లకు వెళ్లారు. ఇతర ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు సైతం తమ ఊరి నుంచే పనులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో జూన్ మొదటి వారంలోనే ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశమున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో మరో 10 లక్షల మంది వరకు హైదరాబాద్ విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.బేగంపేట, సికింద్రాబాద్, సీటీసీ, రసూల్‌పుర, నల్గొండ క్రాస్‌రోడ్స్, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను అనలైజ్ చేయగా లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే సగానికి సగం వెహికల్స్ తగ్గిపోయాయని, కాలుష్యం బాగా తగ్గిందని ట్రాఫిక్ పోలీసులే చెబుతున్నారు. అంతేకాదు టైలరింగ్ షాపులు, టూవీలర్ మెకానిక్ లు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు ఉంటుందోనని హైరానా పడుతున్నారు.