YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పంచాయతనం

పంచాయతనం

హైందవ ఆధ్యాత్మిక జీవన విధానంలో పూజలకు ప్రత్యేకస్థానం ఉంది. విగ్రహాలకు పూజ చేయడంతో మొదలుపెట్టి, తనను తాను తెలుసుకోవడంతో ఆధ్యాత్మిక తత్త్వం పరిపూర్ణమవుతుంది.
స్కాంద పురాణంలో శివుడు, కుమారస్వామికి- సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, పరమశివుడనే దేవతలకు భేదం లేదని చెప్పాడు. ఈ అయిదుగురు దేవతలకు ప్రత్యేకంగా జరిగే పూజా విధానాన్ని, శ్రీ శంకరాచార్యులవారు పంచాయతన పూజగా భక్తులకు విశదం చేశారు. పంచాయతనం అంటే అయిదుగురు దేవతామూర్తులున్న పీఠం. ఒకప్పుడు జైన, బౌద్ధ మతాలు విశేష ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, వైదిక సంప్రదాయాలైన శైవ, వైష్ణవ, శాక్తేయ (అంబిక), సౌర (సూర్యుడు), గాణాపత్య (గణపతి ఆరాధన), అగ్ని (స్కందుడు) అన్న షణ్మతాలు ప్రబలమై, మనుషులు ఉన్మత్తచిత్తులై ఒకరికొకరు అపకారం చేసుకొంటున్న తరుణంలో- శంకరులవారు మతాలన్నింటినీ సమన్వయం గావించి, పూజలో అగ్నిని తప్పనిసరి చేసి పంచాయతన పూజా విధానాన్ని రూపొందించారు.
భగవద్గీతలో గీతాచార్యుడు- ఆకాశాన్నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి ఆహారం, ఆహారం నుంచి ప్రాణికోటి ఉత్పన్నమవుతున్నాయని ఉద్బోధించాడు. శివుడు ఆకాశ తత్త్వాన్ని, అమ్మవారు వాయుతత్త్వాన్ని, సూర్యుడు అగ్నితత్త్వాన్ని, విష్ణుమూర్తీ జల తత్త్వాన్ని, గణపతి పృథ్వీ తత్త్వాన్ని కలిగి ఉంటారని పండితుల వాక్కు. పంచాయతన అర్చన చేసే ముందు ప్రాతఃకాల సంధ్యావందనం విధిగా ఆచరించాలన్నది శాస్త్రవచనం.
యమునా నదిలో, ముఖ్య పర్వత ప్రాంతంలో లభించే స్ఫటికశిలను సూర్యుడని భావించి అరాధిస్తారు. అంబికకు ప్రతిరూపం నాపరాయిలా ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగారు, వెండిరంగు గీతలుంటాయి. దీన్ని స్వర్ణముఖి అంటారు. స్వర్ణముఖి అగ్నితత్వ శిల, అమ్మవారికి సంకేతం. ఇది శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో లభిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. అందులో జీవశక్తి ఉంటుంది. సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో (నేపాల్‌) దొరుకుతాయి. గణపతి జేగురు రంగులో ఉండే శిలలో కొలువై ఉంటాడు. ఇవి శోణానది(బిహార్‌)లో ఉంటాయి. శోణం అంటే ఎరుపు (అగ్ని వర్ణం). శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు. మహేశ్వరుడు బాణలింగ చిహ్నరూపంలో పూజలందుకుంటాడు. బాణలింగాలు శివలింగాకృతిలో ఉండి నర్మదా నది(మధ్యప్రదేశ్‌)లో లభిస్తాయి.
పంచాయతనంలో దేవతలు ఏ దిక్కుల్లో ఉండాలనేది ముఖ్యం. ఈశాన్యంలో- విష్ణుమూర్తి, ఆగ్నేయంలో- సూర్యుడు (అగ్ని), నైరుతిలో- గణపతి, వాయవ్యంలో- అంబికను (అమ్మవారిని) ఉంచి, మధ్యలో శివుణ్ని ఉంచి చేసే పూజకు ‘శివ పంచాయతనం’ అని పేరు. ఏ దేవతను మధ్యలో, ప్రధానంగా ఉంచి పూజ చేస్తారో, దానికి ఆ దేవత పంచాయతనంగా వ్యవహరిస్తారు.
పంచభూతాత్మక శరీరంతో పంచాయతన పూజ చేయడమంటే- భగవంతుడు ఒక్కడే అన్న జ్ఞాన సముపార్జన సాధించి, పరమాత్ముడిలో ఆత్మను లయంచేసి, ముముక్షత్వం వైపు సాగిపోవటం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts