YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*రోజంతా నీదే!*

*రోజంతా నీదే!*

రోజంతా మనకు ఇష్టమొచ్చిన రీతిలో గడిపేకన్నా, అందరూ ఇష్టపడే తీరులో గడపడం బాగుంటుంది. అది ఆదర్శంగానూ ఉంటుంది. నిన్నకు, రేపటికి ‘నేడు’ వారధిగా ఉంటుంది. నిన్నటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, రేపటి భవితను సుగమం చేసుకునేందుకు వర్తమానాన్ని వివేకంతో అర్థవంతంగా కొనసాగించాలి.
రోజంతా నీదే!
ప్రణాళికాబద్ధంగా రోజును గడపడంలోనే విజ్ఞత ఉంది. ఆ విధంగా గడిపితే- రోజు ప్రశాంతంగా, హాయిగా ముగుస్తుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని సాధనాక్రమంలో దానికై క్రమబద్ధంగా శ్రమించడం శ్రేయోదాయకమని అనుష్ఠాన విధులు తెలుపుతున్నాయి.
కాలం విలువను మనిషి గ్రహించాలి. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. కాలం భగవత్‌ స్వరూపం. కాబట్టి ప్రతి క్షణాన్నీ ఉపయుక్తంగా మలచుకోవాలి. నిన్నటిరోజునే ఈ పని పూర్తిచేస్తే బావుండేదే... అవకాశం చేజారిపోయిందే అనుకునే సందర్భాలుంటాయి. అందుకే రోజు పట్ల జాగరూకత అవసరం. జాగరూకత అంటే కాలంపట్ల స్పష్టమైన అవగాహన.
ఉదయకాల ప్రారంభమే ప్రశాంతంగా మొదలుకావాలి. మంచి ఆలోచనలు సద్భావనలు మదిలో మెదలాలి. సాధారణంగా నిన్నటి అపజయాలు, అవమానాలు, ప్రతిబంధకాలు రాత్రి నిద్రను దూరం చేయడమేకాక నేటి రోజును వెంటాడతాయి. వాటిపై దృష్టి అల్పంగా ఉంచాలి. నేడు అమలుచేయదలచుకున్న కార్యాలపై దృష్టి కేంద్రీకృతం కావాలి.
వృథా ఆలోచనలను కట్టిపెట్టాలి. అవి అనారోగ్య హేతువులు. కొన్నిసార్లు ఊహించని ఆటంకాలు, పరిణామాలు ఏర్పడతాయి. రోజును ఎలా మలచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. బాధ్యతలు పనిభారాన్ని పెంచుతున్నా, సౌలభ్యంగా ఉండేట్లు చేసుకోవడం మన అవగాహనా సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
అనవసరమైన ఆలోచనలతో సతమతం కావడం, పరిమితం లేని కోర్కెల సాఫల్యం కోసం పరితపించడం- ఈ రెండూ అనర్థానికి మూలం. కాలం విలువ తెలిసినవాడు క్షణకాలాన్ని సైతం వృథాపోనీయడు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు జన్మకు పరమార్థమైన ముక్తి సాధనే థ్యేయంగా భావించాడు. శుక మహర్షి ద్వారా ఏడు రోజులపాటు భాగవత శ్రవణం చేసి తరించాడు.
బతికినంతకాలం యుద్ధోన్మాదం తలకెక్కించుకొన్న గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్‌ చివరి ఘడియల్లో జీవిత సత్యాన్ని గ్రహించాడు. తన వెంట ఏదీ రాదన్న సత్యాన్ని లోకానికి ఎరుకచేసేందుకు, శవ పేటికలో తన రెండు అరచేతులు ఆకాశాన్ని చూసేవిధంగా ఉంచమని కోరాడు.
రోజులో రాత్రి నిద్రా సమయం ఎంతో ప్రాధాన్యం కలిగివుంటుంది. ఆదమరచి నిద్రించాలంటారు. గాఢమైన నిద్ర పోవాలంటారు. అటువంటి నిద్రకే శరీరం, మనసు సేద తీరుతాయి. అయితే చాలామందికి నిద్ర ఏదో కలత నిద్రలా ఉంటుంది. ఏ అర్ధరాత్రికో కాస్తంత కునుకు పట్టినట్లుగా ఉండి, వెంటనే ఎవరో తట్టిలేపినట్లుగా మెలకువ వస్తుంది.
నిద్రలేమికి కారణం- అస్తవ్యస్తమైన ఆలోచనావిధానాలు, క్రమశిక్షణ లేని ఆహారపుటలవాట్లు. ఆందోళన, భయం, కలవరం, మానసిక ఒత్తిళ్లు వంటివి నిద్రను దూరం చేస్తాయి. మనసు, మాటల నియంత్రణ ఎంతైనా అవసరం. రాత్రి నిద్ర ఎంత హాయిగా గడిచిపోవాలి! నీలాల కన్నుల్లో నిద్ర ఏటి తరంగాలమాదిరి రావాలి.
ఆధ్యాత్మికంగా గాఢనిద్రను యోగస్థితిగా చెబుతారు. యోగులు రాత్రివేళల్లో ధ్యానస్థితిలో ఉంటారు. ధ్యానం అంటే ఎరుక గల నిద్రాస్థితి.
రాత్రి నిద్ర ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటే, అంత చురుకుగా, తేజోవంతంగా ఉంటుంది ఉషోదయం. మనదైన రోజుకు మనమే పాలకులం. రోజును రంగవల్లికలా తీర్చిదిద్దుకోవాలి.

Related Posts