YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*సంబంధ బాంధవ్యాలు*

*సంబంధ బాంధవ్యాలు*

మానవుడిది సామాజిక జీవనం. ఒంటరితనం భరించరాని అనుభవం. ప్రతి మనిషికీ తన వారంటూ ఎవరైనా ఉండాలి. మన మంచిని కోరే స్నేహితులు, ఆత్మీయ బంధువుల మధ్య గడపడంలో ఆనందం ఆహ్లాదం ఉంటాయి. మనలోని వేదనలు వారితో చెప్పుకొని కొంత తెరిపిన పడవచ్ఛు మనలోని సంతోషాన్ని సైతం పంచుకొని, దాన్ని రెండింతలు చేసుకోవచ్ఛు సమాజంతో సాహచర్యం చాలా అవసరం. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
జీవితంలో గెలిచేందుకు గొప్ప శక్తి కావాలి. మన ఎదుగుదలను సర్వదా కోరేవారు వెన్నంటి ఉంటే- మనలోని అంతర్గత శక్తి చైతన్యం పొందుతుంది. అది క్రమంగా హృదయాన్ని సింహసదృశమైన బలంతో నింపుతుంది. మన మేలు కోరేవారు సజీవ దైవాలు. మనమంటే ఇష్టపడేవాడు అంధుడైనా, వికలాంగుడైనా, పేదవాడైనా... భగవంతుడి రూపంలో అతడు మనల్ని లక్ష్యానికి చేరువగా తీసుకెళ్తాడు.
మహాభారతంలోని ఆదిపర్వంలో కౌరవులు లక్క ఇంటి దహనం చేసి పాండవులను హతమార్చాలని పన్నాగాలు పన్నుతారు. విదురుడి సన్నిహితుడైన ఖనకుడి సహాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. తోవలో విదురుడు కనిపించి వారికి కొన్ని హితోక్తులు చెబుతాడు. ‘పాండు నందనులారా.... ధార్తరాష్ట్రుల అసూయ కారణంగా ఇప్పుడు మీరు ఒంటరి వారయ్యారు. తక్షణం మీరు మీ మేలుకోరే హితులను బంధువర్గాన్ని వృద్ధి చేసుకోవాలి. ఈ క్రమంలో మీరు జాగ్రత్త...’ అంటూ వారిని ఏకచక్రపురం వెళ్ళమని సలహా ఇస్తాడు. పాండవులు ఆ సూచనను పాటించి ఏకచక్రపురం చేరి భిక్షాటనతో కాలం గడుపుతారు. అయినా వారిలోని ధైర్యం తగ్గలేదు. ఏ మాత్రం నిరాశ చెందలేదు. అక్కడే బకాసురుడు అనే రాక్షసుడు భీమసేనుడి చేతిలో మరణిస్తాడు.
హిడింబాసురుణ్ని సంహరించి అతడి సోదరి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకుంటాడు. పాండవులకు అది తొలి బంధుత్వం. భీమ, హిడింబిల సంతానమే ఘటోత్కచుడు. అతడు పెరిగి పెద్దయి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతడి మంత్ర తంత్ర విద్యలకు తాను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు. ద్రుపదుడు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించినప్పుడు వ్యాసుడి సలహాపై పాండవులు ఆ స్వయంవరానికి వెళ్తారు. ద్రౌపదిని గెలిచి భార్యగా స్వీకరిస్తారు. దానితో వారికి బలమైన బంధువర్గం ఏర్పడుతుంది. ఇలా... వరస సంఘటనల కారణంగా పాండవులకు హితులు, బంధువర్గం వృద్ధి చెందడంతో అంతులేని ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నింటికీ మించి శ్రీకృష్ణుడి సాన్నిహిత్యం లభించింది.
ఖాండవ దహనం సందర్భంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి అగ్ని దేవుడితో దివ్యాస్త్రాలను ఇప్పించి తన ప్రాణసఖుణ్ని జిష్ణువును చేశాడు. ఈ స్నేహితులు, బంధువులు మహాభారత యుద్ధంలో పాండవుల తరఫున పోరాడి వారి విజయానికి కారకులయ్యారు. మంచి చెలికాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథ్యం వహించడమే కాక భగవద్గీతను బోధించి కర్తవ్యం వైపు నడిపాడు. పాండవులు ఒంటరిగానే ఉండి ఉంటే మహాభారత యుద్ధంలో ఫలితం వేరుగా ఉండేదేమో!
మంచి స్నేహం, ఆత్మీయ బంధుత్వాలు లభించడం మానవుడి విజయానికి చాలా అవసరం. దీనితో పరాధీనత తొలగి భగవంతుడిపై, తమపై విశ్వాసం పెరిగి సమాజంలో చక్కని స్థానం లభిస్తుంది. మంచి సంబంధ బాంధవ్యాల వల్ల కామ క్రోధ మోహాల బంధత్రయాన్ని దూరం చేసుకోవచ్ఛు ఈ పరిణామం మనిషిని పరిపూర్ణుణ్ని చేస్తుంది.

Related Posts