YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

జ్ఞానార్జనకు మార్గం ఏమిటి?

జ్ఞానార్జనకు మార్గం ఏమిటి?

జ్ఞానార్జనకు మార్గం ఏమిటి?
ఎంతటి గొప్ప కర్మలైనా - సత్కర్మలైనా - శ్రమతో - ఖర్చుతో కూడుకున్నవైనా పూజలు - యజ్ఞాలు - దానాలుగాని శాస్త్ర పాండిత్యంగాని - ఇవేవీ అమృతత్వాన్ని - శాశ్వత శాంతిని - ఆనందాన్ని ప్రసాదించలేవని వేదాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయని ప్రమాణం చూపగానే సహజంగా మనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటాయి. మార్గం తెలియక తికమక కలుగుతుంది. అందుకే వెంటనే గురువు మోక్షానికి తగిన మార్గం ఉందని ఓదార్పు చెబుతున్నారు. మోక్షాన్ని చేరే మార్గంలో స్థిరంగా నిలవటానికి సూచనలిస్తున్నారు.
ఏమిటా మార్గం? ఏమిటా సూచనలు?
ముక్తి కోసం ప్రయత్నించే ముముక్షువు ఒక సద్గురువును అన్వేషించి ఆయన దరి చేరాలి. ఆయనను ఆశ్రయించి ఆయన ఉపదేశాలను తు. చ. తప్పక ఆచరణ చేయాలి. అయితే ఇలా గురువును సమీపించే లోపలే నీవు అర్హతలను సంపాదించాలి. గురువు జ్ఞానబీజాలను నాటటానికి అనువుగా నీ బుద్ధిని శుద్ధం చేయాలి. అందుకే (1) 'విద్వాన్' కావాలి అంటున్నారు.
మనం ఏవేవో కావాలనే కోరికలతోనో, కష్టాలు తీరాలనో, కలిసి రావాలనో, మనశ్శాంతి కోసమో, పుణ్యం కోసమో, గొప్పకోసమో, పేరు కోసమో దేవాలయాలకు వెళతాం, తీర్థయాత్రలు సేవిస్తాం, పూజలు యజ్ఞాలు చేస్తాం, మహాత్ములను దర్శిస్తుంటాం, అప్పుడప్పుడు వారి ఉపదేశాలను వింటాం. దానధర్మాలు చేస్తాం, గుళ్ళు గోపురాలు కట్టిస్తాం. అయితే ఇవన్నీ వేదాంతం దృష్టిలో విలువలేనివే. ఆధ్యాత్మిక జీవితంలో అ.ఆ లు నేర్చుకోవటం లాంటివే ఇవి. - వీటితో ఎట్టి ప్రయోజనమూ లేదు. మరి ఏంచేయాలి? ఎలా అర్హత సంపాదించాలి? ఎలా 'విద్వాన్' కావాలి? స్వయంగా గాని, మహాత్ముల బోధవల్ల గాని - శాస్త్ర విషయాలు గ్రహించాలి. శాస్త్ర శ్రవణంతో ఈ ప్రపంచం గాని - ఇందులోని వస్తువులు, విషయాలు గాని, అవి ఇచ్చే భోగాలు, సుఖాలు గానీ అన్నీ మిథ్యయని, అనిత్యమని - శాశ్వత శాంతిని అవి ప్రసాదించలేవని పరిశీలనాత్మకమైన బుద్ధితో గ్రహించి, వివేకంతో తెలుసుకొని
(1) ఈ అనిత్యమైన వస్తుమయ ప్రపంచపు పిడికిలి నుండి బయటపడాలి. ప్రాపంచికమైన కోరికలు, భోగాసక్తి తగ్గాలి, వైరాగ్య భావన కలగాలి. భోగాల పట్ల నిర్లిప్తత, అనాసక్తి ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక మార్గాన పురోగమించగలుగుతాడు. విద్వాన్ అవుతాడు. అర్హతను సంపాదించినట్లవుతుంది. లౌకిక సుఖభోగాలను త్యజించ గలిగిన ఇట్టి వైరాగ్యవంతుడైన సాధకుడే గురువును అన్వేషిస్తాడు. గురువు దరిచేరాలనుకుంటాడు. - అట్టివానికే సద్గురు దర్శనం.
(వివేక చూడామణి: ఆచార్య శంకరులు)

 

Related Posts