YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

బాలూ...మళ్ళీ ఈ గడ్డ మీద జన్మించద్దు

బాలూ...మళ్ళీ ఈ గడ్డ మీద జన్మించద్దు

బాలూ...మళ్ళీ ఈ గడ్డ మీద జన్మించద్దు

ఆరోజు నేను నా మిత్రులతో కలిసి ఒక పుస్తకావిష్కరణ సభను నగర కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించాను.  దర్శకుడు వి మధుసూదన రావు, నిర్మాత, సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి గార్లను ఆహ్వానించాను.  నామీద ఉన్న అభిమానంతో వారు వారి సొంత వాహనాల్లో సభకు వచ్చారు.  కాంతారావు గారిని కూడా పిలిచాను కానీ, ఆయన ఏదో ఒక టీవీ సీరియల్ షూటింగులో ఉన్నాను కాబట్టి రాలేను అని ఫోన్ చేసి చెప్పారు. 

మల్లెమాల తన ప్రసంగంలో ఘంటసాల ప్రసక్తిని తెచ్చారు.  "ఘంటసాల తన గొంతు చించుకుని రామారావు, నాగేశ్వరరావులకోసం కష్టపడ్డారు.  దేవదాసు సినిమా పాటకోసం దగ్గడం ప్రాక్టీస్ చేసారు.  పాండురంగమహాత్మ్యం సినిమాకోసం గొంతును దాదాపు చించేసుకున్నారు.  అలాంటి ఘంటసాల చిన్న వయసులో చనిపోతే ఎన్టీఆర్ ఒక షూటింగులో, నాగేశ్వరరావు ఒక షూటింగులో బిజీగా ఉండి, కనీసం అంత్యక్రియలకు వెళ్ళలేదు.  నేనూ, కాంతారావు దగ్గరుండి ఘంటసాల అంత్యక్రియలను నిర్వహించాము.  సినిమారంగంలో విశ్వాసం అనేది ఉండదు"  అన్నారు ఆవేదనగా.

అప్పటికి ఎన్టీఆర్, అక్కినేని ఇద్దరూ జీవించే ఉన్నారు.  అయినప్పటికీ మల్లెమాల ఆ విధంగా తన బాధను వెళ్లగక్కారు.  

తెలుగు సినిమారంగంలో బాలు గొంతుకను వాడుకోని హీరో లేడు.  ఆయన ఆలపించిన వందల పాటలకు డాన్సులు వేశారు.  అభినయించారు.  ఇక అగ్రదర్శకులు, నిర్మాతలు అందరూ ఆయన తో పాడించుకున్నవారే.  అఫ్ కోర్స్ పారితోషికాలు ఇచ్చారు అది వేరే విషయం.  జాతీయ గాయకుడూ...పద్మభూషణ్ గ్రహీత...పదహారు భాషల్లో నలభై వేల పాటలు పాడిన మహాగాయకుడు...ఆయన ఆసుపత్రిలో ఉంటే ఒక్కడంటే ఒక్క హీరో వెళ్లి చూసిన పాపాన పోలేదు.  ఆయన భౌతిక కాయాన్ని కడసారి దర్శించుకోడానికి ఒక్కడికి కూడా మనసు రాలేదు.  

షూటింగులకు అనుమతులు ఇవ్వండి అంటూ కేసీఆర్ చుట్టూ, జగన్ చుట్టూ తిరిగారు.  అనుమతులు తెచ్చుకున్నారు.  కొన్ని షూటింగులు అవుతున్నాయి.  లాక్ డౌన్ నిబంధనలు సడలించారు.  విమానాలు ఎగురుతున్నాయి.  కానీ, మన తెలుగు సినిమారంగానికి మాత్రం అడుగు ముందుకు వెళ్ళలేదు!  మళ్ళీ వలవల ఏడుస్తూ టీవీల్లో ఆస్కార్ అవార్డు  నటనలు!  ఒక్క హీరో, ఒక్క నిర్మాత, ఒక్క దర్శకుడు, ఒక్క సంగీత దర్శకుడు...చెన్నై వెళ్ళడానికి సాహసించలేదు.  దేవిశ్రీ ప్రసాద్ వెళ్లాడంటే ఆయన చెన్నై నివాసి కాబట్టే.  

బాలుకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన తమిళనాడులోనే, కర్ణాటకలోనో జన్మించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.  కళాకారులు ఎవ్వరూ తెలుగు నేలలో పుట్టద్దు.  మాకు కులమతాలు ముఖ్యం.  ఎవరు ఒక విజయం సాధించినా, ఎవరు మరణించినా, ఎవరు జన్మించినా  ముందు వాళ్ళ కులం మూలాలు వెతుకుతాము మేము.  మా కులం వాడు కాకపొతే వాడు ఎంత గొప్పవాడైనా మాకు గడ్డిపోచతో సమానం.  

ఇవాళ మనం త్యాగయ్య కీర్తనలు వినగలుతున్నామంటే ఆ పుణ్యం తమిళులదే.  ఆయనకు గుడి కట్టి పూజిస్తున్నారు వాళ్ళు.  బాలమురళి, బాలసుబ్రమణ్యం, జానకి, సుశీల లాంటి తెలుగు గాయకులు అందుకే కాబోలు తమిళనాడులోనే స్థిరపడ్డారు.

Related Posts