YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

2569 కేంద్రాల్లో సివిల్స్ పరీక్ష

2569 కేంద్రాల్లో  సివిల్స్ పరీక్ష

న్యూఢిల్లీ, అక్టోబరు 4,
యూపీఎస్‌సీ అక్టోబర్ 4వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తున్నది. పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి యూపీఎస్‌సీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఈ ఏడాది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకు 10.58 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి రిజిస్టర్డ్ అభ్యర్థులలో 65 శాతం మంది అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. దేశంలోని 72 నగరాల్లోని 2,569 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనున్నది. తొలుత ఈ పరీక్షలు మే 31 న జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా.. అక్టోబర్ 4 వ తేదీకి పరీక్షలను వాయిదా వేశారు. అక్టోబర్ 4 తేదీ ఆదివారం నాడు సివిల్స్ ప్రిలిమ్స్‌ రాసే అభ్యర్థులకు సరైన రవాణా సౌకర్యం కల్పించాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు క్యాబినెట్ కార్యదర్శి, యూపీఎస్సీ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) లకు అధికారులను ఎన్నుకోవటానికి యూపీఎస్‌సీ మూడు దశల్లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది.
* అభ్యర్థులు మాస్క్‌ లేదా ఫేస్ కవర్ ధరించడం తప్పనిసరి.
* అభ్యర్థులు పరీక్షా హాలులో పారదర్శక సీసాలలో శానిటైజర్లను తీసుకెళ్లవచ్చు.
* మాస్క్‌ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు ప్రవేశం ఉండదు.
* పరీక్షా హాల్ / గదులతోపాటు క్యాంపస్‌లో సురక్షిత దూరాన్ని అనుసరించాలి.
* పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ప్రవేశించాలి.
* అభ్యర్థులు విధిగా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను తీసుకెళ్లాలి.
* అభ్యర్థులు ఫొటో ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
* పరీక్ష రాయడానికి స్క్రైబ్ యొక్క ఈ-అడ్మిట్ కార్డును విడిగా ఇస్తారు.
* పరీక్షా గదికి కమ్యూనికేషన్ పరికరాలను, మొబైళ్లను అనుమతించరు.
* అభ్యర్థులు సాధారణ మణికట్టు గడియారాన్ని ధరించవచ్చు.

Related Posts