YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

*శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం - దారశురం - తమిళనాడు*

*శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం - దారశురం - తమిళనాడు*

*శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం - దారశురం - తమిళనాడు*


మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే.
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన *దారశుర ఆలయం* పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది.
శిల్పకళాశోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజచోళుడు నిర్మించాడు. ఇక్కడి శివుని పేరు *”ఐరావతేశ్వరుడు”.*
ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దిలో నిర్మించారు. చోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం ధూప-దీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారశురం లోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి.
కుంభ కోణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తంజావూర్ వెళ్ళే మార్గంలో దారాసురం ఉంది.
*ఇంద్రుని వాహనం ఐరావతం*
ఇంద్రుని వాహనం అయిన ఐరావతం అనే తెల్ల ఏనుగు, యముడు ఈ స్వామిని ఆరాధించినట్లు ఐతిహ్యం.
పురాణాల ప్రకారం ఏడు తొండాలు మరియు నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుని వాహనం ఐరావతం భక్తితో శివునికి పూజలు చేస్తూ వుంటాడు.
ఐరావతం దుర్వాసమహర్షిని పూజించలేదని తలచి కోపంతో శాపం ఇస్తాడు. వెంటనే ఆ ఏనుగు యొక్క రంగులో మార్పు వస్తుంది.  ఈ దేవాలయము యొక్క పవిత్ర జలాల్లో మునిగితే ఏనుగుకు శాపవిముక్తి కలుగుతుందని చెప్తాడు.
*యమతీర్థం*
యమధర్మ రాజు కూడా శివున్ని భక్తిగా పూజిస్తాడు. ఒక యోగి ద్వారా శాపం పొందిన యమధర్మ రాజుకు తన శరీరం అంతా మండే అనుభూతికి లోనైనప్పుడు యముడు కూడా ఈ ఆలయ పవిత్ర జలంలో మునిగి శాప విముక్తిని పొందుతాడు. అందువల్ల ఈ ఆలయంనకు యమతీర్థం అని పేరు వచ్చింది.
*ద్రవిడ నిర్మాణ శైలి*
ఆలయం ద్రావిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించబడింది. ఈ ఆలయం శిల్పాలకు చాలా ప్రసిద్ధి. యలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలు పైన చెక్కబడి ఉంటాయి.
*యలిస్ యొక్క రూపం ఈ విధంగా వుంటుంది. దీనికి ఏనుగు యొక్క తొండం, ఎద్దు యొక్క శరీరం, సింహం తల, పొట్టేలు కొమ్ములు మరియు పంది యొక్క చెవులతో వున్న రూపాన్ని కలిగివుంటుంది.*
*రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు*
అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు తమ ప్రతిభను ప్రతిబింబించేలా శిల్పాలను చెక్కారు. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో ఠీవీగా కనపడుతుంది.
*మండప స్థంభాలపైన శివకళ్యాణ దృశ్యాలు*
మండప స్థంభాల పైన చెక్కిన శివకళ్యాణ దృశ్యాలు, శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. మహేశ్వరుని పెళ్లికుమారుని చేయడం, ఆ సుందరమూర్తిని మహిళలు మైమరచిపోయి చూస్తుండటం, సకల సరంజామా, మేళతాళాలతో, రథాలు, గుర్రాలు, ఏనుగుల ఊరేగింపు గొప్పగా ఉంటాయి.
అదే విధంగా త్రిపురాంతక సంహార దృశ్యాలు, త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యం, యోగ ముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్ధించడం ఇవన్నీ బహు చక్కగా మలచారు.
సూక్ష్మ శిల్పాలలో చాలా భాగం భరతనాట్య అంశాలతో చెక్కినవి కావడం విశేషం. నాట్యకళకు చెందిన భంగిమలను మనోహరంగా చెక్కారు.
*గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి*
గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీఐరావతేశ్వర స్వామి పూజలందుకొంటుంటారు. దక్షిణదిశగా అమ్మవారు *శ్రీ పెరియ (దేవ) నాయకి* నిలువెత్తు రూపంలో కొలువై ఉంటారు. గర్భాలయ ప్రవేశ ద్వారానికి రెండుపక్కలా ద్వారపాలకులు శంఖనిధి, పద్మనిధి శిల్పాలు నల్ల రాతి మీద చెక్కబడినాయి.  వెరసి పేరుకు తగినట్లుగా శ్రీ ఐరావతేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నీ భారీగా ఉంటాయి.
*అమ్మవారి ముక్కుపుడక రంధ్రం*
ఇక్కడి ఐరావతేశ్వరుని దర్శించి, ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ కుడ్య చిత్రాలనూ ఆసాంతం తిలకించవచ్చు. అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోకతప్పదు.
*రహస్యం*
అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిగూఢ రహస్యం.
*సంతాన ప్రాప్తి*
అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్న కొలను పేరు *‘’యమతీర్ధం‘’* అంటారు. ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ సమిసిపోతాయని కూడా చెబుతారు. ముందున్న మండపం గుర్రాలతో లాగుతున్న పెద్ద రాతిరథం ఉండటం విశేషం. ఇక్కడ స్వామిని అర్చించి వేడుకొంటే సంతాన ప్రాప్తి కలిగిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు.
*పట్టుచీరలకూ ప్రసిద్ధి*
దారాశురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేరు.


*ఎలా చేరుకోవాలి:*

*రోడ్డు మార్గం*
కుంభకోణం నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సేలం మరియు తంజావూరు నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

*రైలు మార్గం*
దారాశురం వద్ద రైల్వే స్టేషన్ ఉంది. కానీ అన్ని వైపుల నుండి రైళ్లు లేవు. కానీ కుంభకోణం మరియు తంజావూరు నుండి రెగ్యులర్ రైలు సర్వీసులు ఉన్నాయి. కుంభకోణం మరియు తంజావూర్ నుండి చెన్నై, బెంగళూరు, తిరుచి మరియు మదురై వరకు రైళ్లు దరాశురం గుండా వెళతాయి. రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

*విమాన మార్గం*
దారాశురానికి సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి . ఇక్కడ నుండి దారాశురం వరకు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి దారాశురం చేరుకోవడానికి గంటన్నర సమయం పడుతుంది. చెన్నై నుండి ఇక్కడికి చేరుకోవడానికి ఐదున్నర గంటలు పడుతుంది.

*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం*
*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం*

Related Posts