YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

14 రాష్ర్టాల్లో ట్రంప్‌, బిడెన్‌ మధ్య పోటీ ‘నువ్వా-నేనా

14 రాష్ర్టాల్లో ట్రంప్‌, బిడెన్‌ మధ్య పోటీ ‘నువ్వా-నేనా

న్యూయార్క్ అక్టోబ‌రు 27, 
మరో వారం రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధికార రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అయితే, ఇప్పటికే 5.87 కోట్ల కంటే ఎక్కువ మంది అమెరికన్లు ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఎక్కువగా వినియోగించుకున్నారు. 2016లో 5.83 కోట్ల మంది బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది, సైన్యంలో పనిచేసే అధికారులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే సిబ్బంది, వృద్ధులు, ప్రముఖులు తదితరులు ఎన్నికల రోజు కాకుండా అంతకు ముందే తమ ఓటు హక్కును ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్నది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎక్కువ మంది అమెరికన్లు ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ఓటింగ్‌కే మొగ్గు చూపారని ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఓ నివేదికలో వెల్లడించింది. బ్యాలెట్‌ ఓటింగ్‌ శాతం పెరుగడంతో ఓట్ల లెక్కింపుకు మరింత ఎక్కువ సమయం పట్టనున్నదని, దీంతో ఫలితాల విడుదల కూడా ఆలస్యం కావచ్చని వెల్లడించింది.అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉండే రాష్ర్టాలను ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్‌' అంటారు. అమెరికాలో మొత్తం 50 రాష్ర్టాలు ఉండగా ప్రస్తుతం 14 రాష్ర్టాల్లో ట్రంప్‌, బిడెన్‌ మధ్య పోటీ ‘నువ్వా-నేనా’ అనే విధంగా ఉన్నది. అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాలను నిర్ణయించేవి కూడా ఈ రాష్ర్టాలే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో మిగతా రాష్ర్టాల్లో మంచి ప్రదర్శన కనబరిచిన అప్పటి డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌.. ఈ 14 రాష్ర్టాల్లో ఎలక్టార్లను (స్థానాల్ని) గెలుచుకోవడంలో తడబడ్డారు. దీంతో ఆమె అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. అయితే, ఈ కీలక రాష్ర్టాల్లో ఇప్పటికే బ్యాలెట్‌ ద్వారా ఓట్లేసిన చాలా మంది ఓటర్లు తమ మద్దతు జో బిడెన్‌కే అని చెప్పినట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్లోరిడా, నార్త్‌ కరోలినా తదితర రాష్ర్టాలు ఉన్నాయి.  
స్పేస్ స్టేషన్ ఓటింగ్ బూత్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి కేట్ రూబిన్స్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. తాను తన ఓటు హక్కును శుక్రవారం (అక్టోబర్ 23) వినియోగించుకున్నానని ఆమె తెలిపారు. అక్టోబర్ 14 న ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి కేట్‌ రూబిన్స్‌ అక్టోబర్ 14నే అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ఓటింగ్ బూత్ లోపల కేట్ రూబిన్స్ నిల్చొని ఉన్న ఫొటోను నాసా వ్యోమగాముల ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను’ అనే క్యాప్షన్‌తో ఆ ట్వీట్ చేశారు.కేట్‌ రూబిన్స్ స్పేస్ స్టేషన్ నుంచి ఓటు వేయడం ఇదే తొలిసారి కాదు. ఆమె 2016లోనూ అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు సైతం ఓటు హక్కు వినియోగించుకునేలా.. 1997లో అమెరికా కాంగ్రెస్ ఓ చట్టాన్ని ఆమోదించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధాన విషయంగా నేను భావిస్తున్నాను. మనం అంతరిక్షం నుంచి ఓటు చేయగలిగితే, భూమి మీద నుంచి ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రజలు మరింత ఉత్సాహం చూపుతారని నా విశ్వాసం. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం చాలా ముఖ్యమైనది. అంతరిక్షం నుంచి ఓటు వేయడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను’ అని కేట్ రూబిన్స్ అంతరిక్షం నుంచి ఓ వీడియోను విడుదల చేశారు.హ్యూస్టన్‌లో నివసించే చాలా మంది యూఎస్ వ్యోమగాములు ‘లో ఎర్త్ ఆర్బిట్’ చిరునామాతో బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. ఇందుకోసం తక్కువ మందికే అనుమతి లభించింది. హరిస్ కౌంటీలోని ఒక కార్యాలయం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇ-మెయిల్ ద్వారా బ్యాలెట్ పంపుతారు. ఆ ఇ-మెయిల్ బ్యాలెట్‌ను పూర్తి చేసి తిరిగి అదే చిరునామాకు ఇ-మెయిల్ చేస్తారు. ఎన్నికల అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఉందో, లేదో పరిశీలించి ఆ ఓటును లెక్కలోకి పరిగణిస్తారు.

Related Posts