YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

నిరుద్యోగ భృతి సంగతేంటీ.. 4వేల 800 కోట్ల ఖర్చు

నిరుద్యోగ భృతి సంగతేంటీ.. 4వేల 800 కోట్ల ఖర్చు

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి ఎన్నికల్లో గెలవడానికి కొన్ని హామీలు కూడా కారణమయ్యాయి. వాటిలో రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఓటర్లను ఎక్కువగా ఆకర్షించాయి. రైతుల రుణమాఫీ గురించి పెద్దగా ప్రభుత్వం శ్రద్ధ చూపించినట్లు కనపడలేదు కానీ..  నిరుద్యోగ భృతి విషయంలో మాయఁత్రం కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో ఈ పథకం అమలును కేసీఆర్ ప్రకటిస్తారని.. అందుకు సంబంధించిన ముహూర్తం కూడా కుదుర్చుకున్నారని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు బడ్జెట్లలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణలో నిరుద్యోగం రేటు ఎక్కువగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడినా నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం పదిహేను లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుద్యోగి అనే ప్రామాణికం ఆధారంగా నిరుద్యోగ భృతిని అందించనున్నారు. అర్హతలు నిర్ణయించే దాన్ని బట్టి లబ్దిదారుల సంఖ్యలో తేడా పక్కాగా ఉండనుంది. లక్షల మందికి ప్రతి నెలా రూ.3016 ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని.. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవని అంటూ ఉన్నారు. కానీ హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోనుంది. తెలంగాణలో దాదాపు 20 లక్షలమంది నిరుద్యోగులు ఉంటారు. ఒక్కొక్కరికి 3,016 రూపాయల చొప్పున భృతి ఇస్తే ఏటా 4వేల 800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే, నిరుద్యోగ భృతి కోసం ఏ విద్యార్హతాలను పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు 3వేల 16 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2019 బడ్జెట్‌లో 1,810 కోట్లు సైతం ప్రభుత్వం కేటాయించింది. తర్వాత ఆర్థిక ప్రతికూలతలతో ఈ పథకాన్ని అమలు చేయలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువతను తమ వైపు తిప్పుకోవడానికి నిరుద్యోగ భృతి హామీని మళ్లీ సర్కార్ తెరపైకి తెచ్చింది. త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
నిరుద్యోగుల్లో అసంతృప్తి రాకుండా నిరుద్యోగ భృతిని అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ కానుంది.  రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ నిరుద్యోగ భృతి ప్రస్తావన తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ సర్కారు నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే నిరుద్యోగుల్లో సరికొత్త ఆశను రేపుతోంది.

Related Posts