YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

మూలన పడిన జంబ్లింగ్ విధానం

మూలన పడిన జంబ్లింగ్ విధానం

వరంగల్, ఫిబ్రవరి 4, 
ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌ విధానాన్ని అమల్లోకి తేకుండా మూలనపడేసింది. విద్యార్థుల నుంచి కాసులను పిండుకునేందుకు ద్వారాలు తెరిచింది. తద్వారా అవినీతిని అధికారికంగానే ప్రోత్సహిస్తున్నది.'ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను ఈ ఏడాదీ జంబ్లింగ్‌లో నిర్వహించడం లేదు. ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహి స్తామన్న సర్కారు హామీ అమలుకు నోచుకోలేదు. ఈ సారైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహిస్తుందని ఆశించడం తీరా ఆ సమయం వచ్చే నాటికి సాధారణంగానే నిర్వహించడం షరామామూలుగా మారింది. ప్రాక్టికల్స్‌ నిర్వహణలో ఇంటర్‌ బోర్డు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల ముందు ఇంటర్‌ బోర్డు మోకరిల్లింది. కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించడం లేదు. ల్యాబ్‌ల్లేకపోయినా, ప్రాక్టికల్స్‌ తూతూమంత్రంగా నిర్వహించినా, రసాయనాలు, ఇతర పరికరాలు కాలేజీల్లో ఉండకపోయినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంటర్‌ బోర్డు నిబంధనలకు కాలేజీ యాజమాన్యాలు తిలోదకాలు ఇస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్లకు ఆశపడి ఆయా కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ల్యాబ్‌ల్లేక, ప్రాక్టికల్స్‌ నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రాక్టికల్స్‌ చేయడం వల్ల విద్యార్థులకు సబ్జెక్టుపై అవగాహన పెరగడంతోపాటు జ్ఞానం వస్తుందని విద్యావేత్తలు చెప్తున్నారు. ప్రాక్టికల్స్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాఠ్యాంశాలను బట్టీ పట్టడం తప్ప సబ్జెక్టులపై సరైన పట్టు పెంచుకోవడం లేదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంటర్‌ స్థాయిలో ప్రాక్టికల్స్‌పై అవగాహన లేకపోవడంతో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లో చేరిన తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.ఇంటర్మీడియెట్‌ విద్యలో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ అంతర్భాగం. రాష్ట్రంలో 404 ప్రభుత్వ, 1500 వరకు ప్రయివేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. వాటిలో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాక్టికల్స్‌కు 3.27 లక్షల మంది హాజరవుతున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు థియరీ ఎంత ముఖ్యమో ప్రాక్టికల్స్‌ అంతే ముఖ్యం. థియరీ మార్కులతోపాటు ప్రాక్టికల్స్‌ మార్కులకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇంకా అమలవుతున్నది. థియరీ మార్కులతోపాటు ప్రాక్టికల్స్‌ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్‌కు ఎంతో విలువ ఉన్నది. ఇంటర్‌లో మొత్తం వెయ్యి మార్కులకు థియరీ సబ్జెక్టులకు ఎంపీసీ వారికి 940 మార్కులు, బైపీసీ వారికి 880 మార్కులుంటాయి. ప్రాక్టికల్స్‌లో ఎంపీసీ విద్యార్థులకు 60  మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కుల చొప్పున ఉంటాయి. ప్రాక్టికల్స్‌ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందే. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఉన్నా కార్పొరేట్‌ కాలేజీలు నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అత్యధిక ప్రభుత్వ కాలేజీల్లోనూ ల్యాబ్‌ల్లేవనీ, ఉన్నా రసాయనాలు, ఇతర పరికరాలు ఉండబోవని అధికారులే చెప్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోనే సరైన వసతులు లేకపోవడంతో జంబ్లింగ్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. దీంతో ప్రాక్టికల్స్‌ నిర్వహణ కాలేజీల్లో ఓ మాయాజాలంగా మారింది. ల్యాబ్‌ల్లేకుండానే నిర్వహించడం మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మందికి ప్రాక్టికల్స్‌లో వాడే పిప్పెట్‌, బ్యూరెట్‌, ఇతర పరికరాల పేర్లు సైతం తెలియవంటే అతిశయోక్తి కాదు. అన్ని జూనియర్‌ కాలేజీల్లోనూ ల్యాబ్‌లు, కెమికల్స్‌, పరికరాలు ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జంబ్లింగ్‌లో నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందనీ, అవకతవకలకు, తాయిలాలకు ఆస్కారం ఉండబోదని అభిప్రాయపడుతున్నారు

Related Posts