YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆరువేలు దాటేసిన తెల్లబంగారం

ఆరువేలు దాటేసిన తెల్లబంగారం

వరంగల్, ఫిబ్రవరి 23,
పత్తిని తెల్లబంగారమని చెప్పుకుని మురిసిపోతుంటాం...కానీ, అది రైతుకు కాదు.. వ్యాపారులకే అని ప్రస్తుత మార్కెటింగ్‌, ప్రభుత్వాల తీరునుబట్టి అర్థమవుతుంది. గతేడాది నవంబర్‌ 4న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. తేమ, నాణ్యత ఆధారంగా రూ.5,825 గరిష్ఠ ధరగా నిర్ణయించింది. 13 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు మొదలు పెట్టింది. 26,727 మంది రైతుల పేరుతో 7,69,759 క్వింటాళ్ల పత్తిని సీసీఐ ఒక్క ఖమ్మం జిల్లా పరిధిలోని కేంద్రాల్లోనే కొనుగోలు చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు క్వింటాల్‌ పత్తి మార్కెట్లో రూ.6,200 వరకు ధర పలుకుతోంది. ఈ నెల ఆరంభంలో పత్తి ధరలు మద్దతు ధరను మించి నమోదయ్యాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తొలిసారి ఫిబ్రవరి 3వ తేదీన సీసీఐకి మించి క్వింటాల్‌ పత్తి రూ.5,875 ధర పలికింది. నాటి నుంచి మొదలైన పెరుగుదల ఫిబ్రవరి 8న రూ.6,000 మార్క్‌ చేరింది. క్రమేణా పెరుగుతూ 18న రూ. 6,200కు చేరింది. పెరిగిన రేట్లు అందిపుచ్చు కోవాలని ఆశించిన రైతుకు ఆశనిపాతమే మిగిలింది. పంట ఇప్పటికే చేయిదాటి పోవడంతో నైరాశ్యం అలుముకుంది.సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పుడు రైతులను మభ్యపెట్టి.. అధికారులతో కుమ్మక్కై అత్తెసరు ధరలు క్వింటాల్‌ రూ.3,000 నుంచి రూ.4,000 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు పెరిగిన ధరలతో ఇప్పుడు లాభపడుతున్నారు. నాడు రైతుల వద్ద తక్కువ ధరకు కొన్న సరుకును జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులతో చేతులు కలిపి గరిష్ట ధర రూ.5,825కు అమ్ముకున్నారు. విదేశీ, దేశీయ మార్కెట్‌ తీరును అవగతం చేసుకున్న వ్యాపారులు అధికమొత్తం సరుకును నిల్వ చేసుకున్నారు. సీజన్‌ ఆరంభంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పోను రోజుకు సగటున 2,000 బస్తాల సరుకును రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తరలించారు. ఇప్పుడు ధర పెరిగినా రైతుల చేతిలో సరుకు లేదు. కాబట్టి రోజుకు సగటున 500 బస్తాల పత్తి మాత్రమే మార్కెట్‌కు వస్తుంది. ఈ కొద్దిపాటి సరుకు కూడా వ్యాపారులదే కావడం గమనార్హం.ఖరీఫ్‌లో 1,01,675 హెక్టార్లలో జిల్లాలో రైతులు పత్తి సాగు చేశారు. 2,26,130 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం మేరకు 13 కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. జిన్నింగ్‌ మిల్లుల దగ్గర 7,17,518 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. ఖమ్మంలో సీసీఐ అధికారులు మరో 1,53,540 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. ఇవిగాక ప్రయివేటు వ్యాపారులు వివిధ మార్కెట్లలో 1,63,118 క్వింటాళ్లు, ఖమ్మంలో 1,12,878 క్వింటాళ్లను కొన్నారు. ఒక్కో ఎకరానికి రూ.30వేల వరకు రైతు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే.. అధికవర్షాల కారణంగా వారికి వచ్చిన దిగుబడి ఎకరానికి 4నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే. సీసీఐ నిర్దేశించిన ధర రూ.5,825 చొప్పున రైతు క్వింటాల్‌ పత్తి అమ్ముకున్నా... పెట్టిన పెట్టుబడులు సైతం రావు. అలాంటిది దళారులు రైతులను మభ్యపెట్టి సగటున క్వింటాల్‌ రూ.4,000కు మించి ధర పెట్టని పరిస్థితి ఈ ఏడాది మనం మార్కెట్లో చూశాం. దీన్నిబట్టి రైతు ఒక్కో ఎకరానికి రూ.10వేలకు పైగా నష్టపోయాడు.పంట ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 80శాతం మంది రైతులు పత్తి చెట్లను తొలగించి రబీ పంటలు సైతం వేసుకున్నారు. ఈ ఏడాది పంట ఉత్పత్తి సరిగా లేకపోవడంతో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్‌ ఏర్పడింది. క్యాండిల్స్‌, గింజలు గతం కంటే ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. గతంలో 40వేలున్న క్యాండిల్‌ ధర రూ.47,000, గతంలో క్వింటాల్‌ రూ.2,000 ఉన్న గింజలు ఇప్పుడు రూ.3,000 వరకు అమ్ముడుబోతున్నాయి.పత్తి దిగుబడి బాగా తక్కువ వచ్చింది. పంట చేయిదాటాక ఇప్పుడు అధిక రేట్లకు అమ్ముడవుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 15 లక్షల బేళ్ల పత్తి ఎగుమతులకు అనుమతి చ్చింది. తద్వారా పంట రేట్లు పెరిగాయి. ఈ ఎగుమతి అనుమతులేవో పంట రైతుల చేతిలో ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే వారు లబ్ది పొందేవారు. కానీ ఇప్పుడివ్వడం వల్ల వ్యాపారులు లాభపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐకి పంట విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలని కోరుతున్నారు.

Related Posts