YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఒక్కసారి పడిపోయిన నిమ్మ ధర

ఒక్కసారి పడిపోయిన నిమ్మ ధర

ఒక్కసారి పడిపోయిన నిమ్మ ధర
ఏలూరు, ఫిబ్రవరి 24, 
నిమ్మసాగులో రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో ఒక్కసారిగా ధర పతనం కావడంతో లాభాలుకాదుగా కనీసం పెట్టుబడులు కూడా వచ్చే దారి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా లాభదాయకంగా మారిన నిమ్మ పంట ప్రస్తుతం గిట్టుబాటు ధర దక్కక నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత డిసెంబరు వరకూ రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకూ పలికిన నిమ్మకాయలు బస్తా కేవలం రూ.వెయ్యికి పడిపోయింది అంటేనే ధర పతనం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. చేసిన అప్పుల నుంచి గట్టెక్కేదెలాగో తెలియక రైతులు, కౌలుదారులు లబోదిబోమంటున్నారు. సరైన గిట్టుబాటు ధర కల్పించి నిమ్మరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. మండలంలో ప్రధానంగా టి.నరసాపురం, శ్రీరామవరం, కాపుగూడెం, పుట్రేపు తదితర గ్రామాల్లో రైతులు అధికంగా నిమ్మసాగు చేస్తున్నారు. 346 మంది రైతులు 1563 ఎకరాల్లో బాలాజీ, దేశవాళీ వంటి రకాల నిమ్మ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిదొందల ఎకరాల్లో కాపు వస్తుంది. మిగిలినవి మొక్కదశలో ఉన్నాయి. ఎకరానికి అధికంగా ఐదారు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మండలంలో రైతులు పండించిన నిమ్మకాయలను ఏలూరు మార్కెట్‌కు తరలిస్తుంటారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తుండటంతో కొందరు రైతులు జామాయిల్‌, జీడిమామిడి వంటి తోటలను తీసేసి పూర్తిగా సాగునే ఎంచుకున్నారు. దీంతో మండలంలో 500 ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 15 వందలకు పెరిగింది. పంటకు గిట్టుబాటు ధర కిలో రూ.50, రూ.60 పలికిన రోజుల్లో ఎకరానికి రూ.1.5 లక్షల నుండి రూ.రెండు లక్షల వరకు ఆదాయం వచ్చేదని రైతులు చెబుతున్నారు. లాభాలు ఆశించిన కొందరు సాగు మానేసి నిమ్మతోటలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గతేడాది నిమ్మ పంట ఆశాజనకంగా మారడంతో మండలంలో సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా కౌలుధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఎకరానికి రూ.లక్ష నుండి లక్షా యాభై వేల వరకు కౌలు వెచ్చించి కౌలుదారులు భారీగా నిమ్మ తోటలను కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధర పతనం కావడంతో కేవలం బస్తా రూ.ఆరొందల నుంచి రూ.వెయ్యి మాత్రమే పలుకుతుందని, కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని శ్రీరామవరానికి చెందిన రైతు సాధనాల బూసిబాబు చెబుతున్నారు. ఎకరానికి రూ.లక్షా 20 వేలు కౌలుతోపాటు రూ.50 వేల పెట్టుబడితో కలిపి ఆరు ఎకరాలకు రూ.9.20 లక్షలు అప్పులు చేశానని, ప్రస్తుతం ఉన్న ధరతో అప్పు తీరే పరిస్థితి లేదని వాపోయారు. దీనికి ప్రత్యామ్నాయంగా వేరే సాగుకూ అవకాశం లేదని తెలిపారు. ప్రభుత్వం నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని నిమ్మ రైతులు కోరుతున్నారు.  16 సంవత్సరాలుగా శ్రీరామవరంలో నాకున్న రెండెకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ సాగు చేస్తున్నాను. ఎరువుల ధరలు పెరగడంతో సాగుకు పెట్టుబడులు బాగా పెరిగాయి. ఎకరానికి రూ.50 వేలు చొప్పున కౌలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, అప్పు చేసి రూ.10 లక్షలు వరకూ ఖర్చు పెట్టా. గత డిసెంబరు నుండి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలొచ్చాయి. కూలీల ఖర్చు కూడా రావడం లేదు. అప్పు తీర్చే మార్గం కానరావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. నిమ్మసాగు లాభసాటిగా ఉండటంతో పుట్రేపులో రెండెకరాల నిమ్మ తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. గతేడాది లాభాలు బాగానే వచ్చాయి. ప్రస్తుతం నిమ్మ ధర తగ్గిపోయింది. కిలో రూ.40 నుంచి రూ.50 పలికే ధర కాస్తా ప్రస్తుతం రూ.12 నుంచి రూ.15 మాత్రమే పడుతుంది. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి.

Related Posts