YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కోల్డ్ స్టోరేజీలకు మిర్చి

కోల్డ్ స్టోరేజీలకు మిర్చి

ఖమ్మం, మార్చి 8, 
మిర్చిరైతులు మార్కెట్‌కు రాకుండా బస్తాలను కోల్డ్‌స్టోరేజీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మంచి ధర లేకపోవడంతో భవిష్యత్తులో ధర పెరుగొచ్చని మిర్చిని నిల్వ చేసుకుంటున్నారు. మిర్చి చేతికందే సమయానికి ప్రతి ఏడాది భారీగా మార్కెట్‌కు మిర్చి బస్తాలు వచ్చేవి. కానీ ఈసారి రేట్లు మందగించడంతో గడిచిన పది రోజుల నుంచి మార్కెట్‌కు నామమాత్రంగానే మిర్చి పంట వస్తున్నది.జిల్లాలో మిర్చి క్రయ,విక్రయాలు జరిగే ఏకైక మార్కెట్‌ కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. గడిచిన పది రోజుల నుంచి మిర్చి యార్డుకు పంట నామమాత్రంగానే వస్తున్నది. తోటల నుంచి మిర్చి ఏరిన రైతులు ఇండ్ల వద్ద కొందరు నిల్వ చేసుకోగా.. మరికొందరు శీతల గిడ్డంగుల వద్దకు  తీసుకొస్తున్నారు. జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల రైతులు పంటను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. గతేడాది కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కొనసాగించడంతో మార్కెట్లలో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో అప్పట్లో పెద్దఎత్తున రైతులు ఉన్న పంటను మొత్తం తీసుకొచ్చి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేశారు. పంట సీజన్‌ ముగిసే సమయానికి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాల్‌ రూ.21వేల వరకు పలికింది.   అయితే, ఈ సారి భారీగా రైతులు పంటను తీసుకరావడంతో అప్పట్లో కోల్డ్‌స్టోరేజీల యజమానులు  డిమాండ్‌ను బట్టి బస్తాకు రూ.20-30 పెంచి రూ.160-180 వరకు వసూలు చేశారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు అడిగినంత ఇచ్చారు. ప్రస్తుతం సీజన్‌ మళ్లీ రావడం, ధర ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో రైతులు పంట నిల్వ చేసుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మరోమారు యజమానులు ఏకపక్షంగా ధరలు నిర్ణయించుకొని పంటను నిల్వ చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వ్యాప్తంగా ఆయా మార్కెట్ల పరిధిలో మొత్తం 38 కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం ఏఎంసీ పరిధిలో 14 ఉన్నాయి. నేలకొండపల్లి మార్కెట్‌ పరిధిలో 2, మద్దులపల్లి మార్కెట్‌ పరిధిలో 6, మధిర వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో 10, వైరా మార్కెట్‌ పరిధిలో మరో 6 కోల్డ్‌ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 35 వేల బస్తాల నిల్వ సామర్థ్యం ఉంది. గతంలో ఈ కోల్డ్‌స్టోరేజీలు ఖరీదుదారులు కాకుండా ఇతర ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో మాత్రమే ఉండేవి, ప్రస్తుతం నగరంలోని ప్రధాన గిడ్డంగులు, మధిర ఏఎంసీ పరిధిలోని కొన్ని గిడ్డంగులతోపాటు రూరల్‌ మండలంలో ఉన్న కోల్డ్‌స్టోరేజీల్లో మిర్చి ఖరీదుదారుల భాగస్యామ్యం ఉంది. ముగ్గురు, నలుగురు ఖరీదుదారులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర రాని పక్షంలో ఎగుమతి చేయకుండా కొనుగోలు చేసి పంటను నిల్వచేసుకుంటున్న పరిస్థితి. మంచి ధర వచ్చిన సమయంలో తిరిగి పంటను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా సందర్భాల్లో పంట ఎక్కువ మొత్తంలో వచ్చిన ప్రతిసారి వ్యాపారులు రైతుల పంటకు ప్రాముఖ్యత ఇవ్వకుండా తమ పంటనే నిల్వ చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. వ్యాపారి చెప్పినట్లు బస్తాకు 200 కిరాయి అవుతుంది. రాబోయే రోజుల్లో మరింత ధర పెరుగుతుందని నమ్మిపంటను తీసుకొచ్చాను. 2 ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగు చేశాను. ధర పెరగకపోతే 25 బస్తాలకు రూ.5 వేలు అధికంగా పెట్టుబడి పెట్టినైట్లెతది. బస్తాకు రూ.170 లేదా రూ.180 తీసుకుంటే బాగుండేది. అసలే ఈ ఏడాది తోటలకు వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గింది.

Related Posts