YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అంతకంతకు పెరుగుతున్న ఉపాధి బకాయిలు

అంతకంతకు పెరుగుతున్న ఉపాధి బకాయిలు

కర్నూలు, మార్చి 15, జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీల కూలి డబ్బులు సుమారు 5మాసాలుగా అందక లబోదిబోమంటున్నారు. జిల్లాలోని సుమారు 6 లక్షల మందికి పైగా రూ. 26 కోట్ల 95 లక్షలు కూలీ మొత్తాలు అందాల్సి వుంది. ఈ మొత్తం ఉగాది పండుగ లోపైనా వచ్చేనా అంటూ పెద్ద పండుగను సంతోషంగా చేసుకోవడానికి ఉపాధి కూలీలు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. పనులు లేని కూలీలకు ఏదో ఒక ఉపయోగకరమైన పని చేయించి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ నిర్వీర్యమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 10 లక్షల మందికి పైగా జాబ్‌కార్డులున్నప్పటికీ 6 లక్షల 60 వేల మంది ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉపాధి పనులు కేవలం వంద రోజులు మాత్రమే చేయాల్సి వుండటంతో ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి 5నుంచి 6 మాసాల లోపు వంద రోజుల పని దినాలు పూర్తి చేసి పనిలేక మిన్నకుండిపోవాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు అందని పరిస్థితి వుండటంతో ఇతర ప్రాంతాలకు జిల్లా నుంచి వలసలు తప్పడం లేదు. ఉపాధి హామీ ద్వారా జరుగుతున్న నీరు-చెట్టు, సిమెంటు రోడ్ల నిర్మాణాలు తదితరాలకైతే పనుల్లో నాణ్యత లేకపోయినా, కొన్నిచోట్ల అరకొరగా చేసిన పనులకు కూడా కాంట్రాక్టర్‌లకు ముందుగా బిల్లులు మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. కానీ భగభగ మండే ఎండలను కూడా లెక్క చేయకుండా రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసే కూలీలకు అందించాల్సిన కూలీ మొత్తాలు మాత్రం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ చేయడానికి పనులు లేక ఊరికే వుంటున్న కూలీలు వేలమంది కనిపిస్తున్నారు. అయితే వంద రోజుల పని దినాలు పూర్తయిన తర్వాత కరవు మండలాలైన పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓబుళదేవరచెరువు, అమడగూరు, రాయదుర్గం, తలుపుల, ధర్మవరం, చెనే్నకొత్తపల్లి, కంబదూరు, గోరంట్ల, గుమ్మగట్ట, పెనుకొండ, బ్రహ్మసముద్రం, కుందుర్పి మండలాల్లో మాత్రమే మరో 50 పని దినాలు అదనంగా పెంచారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే కరవు తాండవిస్తున్న మండలాలనే పక్కనపెట్టి కరవు మండలాల ఎంపికలో కూడా తీరని అన్యాయం జరిగినట్లు, కేవలం కొందరు రాజకీయ నాయకులు చెప్పిన మండలాలనే కరవు మండలాలుగా గుర్తించినట్లు జిల్లా వ్యాప్తంగా కరవుతో కొట్టుమిట్టాడుతున్న పలు మండలాల వాసులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ఓబుళదేవరచెరువు, అమడగూరు  మండలాల్లో అదనంగా 50 రోజుల పని దినాలు పెంచి ఉపాధి పనులు చేయిస్తున్నారు. ఒక్క నల్లమాడ మండలానికి మాత్రం కరవు మండలంగా గుర్తించకపోవడం ఆశ్ఛర్యానికి గురిచేస్తున్న పరిస్థితి. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకి నీళ్లతో నింపారు. దాంతో బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెంది వ్యవసాయ పనులతో ఉపాధి పొందే అవకాశం వుంది. నల్లమాడ మండలంలోని ఒక్క చెరువు కూడా పూర్తిగా నీళ్లు నిండని పరిస్థితి వుంది. ఇప్పటికే కేవలం వ్యవసాయంతోనే జీవనం కొనసాగిస్తున్న నల్లమాడ మండలంలోని కొన్ని గ్రామాల్లో బోరుబావుల్లో నీళ్లు ఇంకిపోయిన పరిస్థితి వుంది. తాగునీటికి అవస్థలు పడుతున్న గ్రామాలు కూడా మండలంలో వున్నాయి. దాంతోపాటు జీవనోపాధికి అవకాశాలు తక్కువే. అయినా ఎందుకు కరవు మండలంగా గుర్తించలేక పోయారోనని పాలకులు, అధికారులకు మండలవాసులు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి. నల్లమాడను కరవు మండలంగా గుర్తించి వుంటే 50 రోజులు పని దినాలు పెరిగి సుమారు 2 వేల కుటుంబాలకు పైగా ఉపాధి హామీ పనుల ద్వారా లబ్ది పొంది వుండే వారు. ఇలాంటి మండలాలు జిల్లాలో చాలా వున్నాయనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి యాధావిధిగా ఉపాధి హామీ పనులకు నిధులు ఎప్పటికప్పుడు వస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు వినియోగించుకుంటూ కూలీలకు ఇబ్బందిపెడుతున్నారన్న వాదన ఉంది.

Related Posts