YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త నిబంధనలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ, మార్చి 17, 
కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త నియమాలను అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన నేపథ్యంలో పాత బ్యాంకులకు సంబంధించిన పాస్‌బుక్కులు, చెక్‌బుక్కులు ఏప్రిల్ 1 నుండి పనిచేయవనే విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులకు చెందిన వినియోగదారులు.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తమ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్కులతో పాటు ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయని తెలుసుకోవాలి.ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీన ప్రక్రియ 2019 ఏప్రిల్ 1, 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. విలీనం చేసిన బ్యాంకుల కస్టమర్లు.. తమ మొబైల్ నంబర్, చిరునామా, నామినీ మొదలైన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. అయితే, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కస్టమర్లకు కొంత ఉపశమనం లభించింది. సిండికేట్ బ్యాంక్ ఖాతాదారుల ప్రస్తుత చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని బ్యాంకు ప్రకటించింది. కొత్త చెక్‌బుక్కు, పాస్‌బుక్కు పొందిన తర్వాత.. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆదాయపు పన్ను ఖాతా, ఎఫ్డీ / ఆర్డీ, పీఎఫ్ ఖాతా, బ్యాంక్ ఖాతాలు వంటి వాటిలో కూడా వినియోగదారులు తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇంకా అంతేకాకుండా ఆదాయపు పన్ను విషయంలో కూడా కొన్ని మార్పులు రానున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత 75 ఏండ్ల వయసు పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతన కోడ్ అమలులోకి రానున్నది. ఈ కోడ్ ద్వారా బేసిక్ పే పెంచనున్నారు. దీంతో బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ పెరిగితే ఉద్యోగస్తుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుందని గుర్తించాలి. వీటితో పాటు ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్లు కూడా పెరుగనున్నాయి.

Related Posts