YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

లాభాలు పండిస్తున్న పుచ్చకాయలు

లాభాలు పండిస్తున్న పుచ్చకాయలు

నిజామాబాద్, మార్చి 20, 
జిల్లాలో పుచ్చకాయ(వాటర్‌ మిలన్‌) సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. తెలుగు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 450 ఎకరాల్లో సాగవుతుండగా, ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. దశాబ్దకాలంగా సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పంట అమ్ముకునేందుకు వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పిందని, దళారుల బెడద కూడా లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. పుచ్చకాయ సాగు లాభదాయకంగా మారడంతో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. జిల్లాలో అధికంగా  పత్తి, సోయా, కంది సాగవుతుంది. యేటా వానకాలంలో ఈ పంటలు ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయి. దీంతో పంటలు అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. దళారుల బెడదతో నష్టపోతున్నారు. దళారులకు చెక్‌ పెట్టేందుకు కొందరు రైతులు పంట మార్పిడి విధానాన్ని ఎంచుకుని మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు మాత్రమే వేస్తున్నారు. ఎండాకాలంలో అధికంగా వినియోగించే పుచ్చకాయ సాగు చేస్తున్నారు. ఎనిమిదేండ్ల కిందట ప్రయోగాత్మకంగా ప్రారంభమైన సాగు అధిక లాభాలు తెచ్చిపెడుతుండడంతో చాలా మంది ముందుకొస్తున్నారు.యేటా పుచ్చకాయ సాగు 450 ఎకరాల్లో సాగవుతున్నది. జైనథ్‌, తలమడుగు, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌ మండలాల్లో రైతులు అధికంగా వేశారు. పంట కాలవ్యవధి 65 రోజులు మాత్రమే ఉండడంతో కొందరు మూడో, మరికొందరు రెండో పంటగా వేస్తున్నారు. యేటా జనవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు పంట సాగవుతుంది. సాగులో నూతన సాంకేతిక పద్ధతులు మల్చింగ్‌, డ్రిప్‌లను ఉపయోగిస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.55 వేలు ఖర్చవుతాయని.. సాగు మెలకువలు పాటిస్తే ఎకరాకు 200 క్వింటాళ్ల నుంచి 300 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. కిలోకు రూ.7 నుంచి రూ.8 వరకు అమ్మినా పెట్టుబడి పోనూ ఎకరాకు రూ.60 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వాటర్‌ మిలన్‌కు అధికంగా డిమాండ్‌ ఉండడంతో తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు చేల వద్దకే వచ్చి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాగా.. ఈ విషయంపై హార్టికల్చర్‌ అధికారి సుకం మహేశ్‌ను అడుగగా.. సబ్సిడీపై మల్చింగ్‌లను పంపిణీ చేస్తున్నామని, పంట కాలం స్వల్పంగా ఉండడం, లాభాలు అధికంగా వస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

Related Posts