YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరికి నీటి కష్టాలు

వరికి నీటి కష్టాలు

నిజామాబాద్, మార్చి 22, పొట్టదశలో ఉన్న వరికి సాగునీరు అందకపోవడంతో రైతన్న అల్లాడుతున్నాడు. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పైరు చివరి దశలో చేజారేలా ఉంది. నిజాంసాగర్‌ కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడేందుకు మదనపడుతున్నారు. నిజాంసాగర్‌ నీటి విడుదలను పెంచి తమ పంటలను కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.
నిజాంసాగర్‌ ఆయకట్టు కింద నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని బోర్గాం(కె), మాక్లూర్‌, మాదాపూర్‌, ముల్లంగి, బొంకంపల్లి గ్రామాల్లో 5,392 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈసారి నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్థిస్థాయి నీటిమట్టానికి చేరడంతో రబీ పంటలకు ఆయకట్టు పరిధిలో అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా ఎనిమిది విడతలుగా నీటిని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. కానీ కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేసినా.. చివరి ఆయకట్టు వరకు వచ్చేసరికి నీటి విడుదల నిలిపేస్తున్నారు. దీంతో పొలాలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా నిజాంసాగర్‌ కెనాల్‌ 71,72,73 తూముల ద్వారా చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదు. మోటార్‌ పంపులు ద్వారా నీరు పారిద్దామన్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో పొలాలు పగుళ్లు వస్తున్నాయి. ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, చేతికి వచ్చే సమయంలో పైర్లు ఎండుతున్నాయని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని చివరి ఆయకట్టుకు అందేలా నీటి విడుదల చేయాలని కోరుతున్నారు.

Related Posts