YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సోలార్ పవర్ పై దృష్టి

సోలార్ పవర్ పై దృష్టి

కరీంనగర్, మార్చి 26, 
రానున్న రోజుల్లో సోలార్‌, పవర్‌ విండ్‌ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నగరాల్లో కరీంనగర్‌ ముందు వరుసలో నిలిచింది. పునరుత్పాదక ఇంధనాన్ని (రెన్యువబుల్‌ఎనర్జీ) ప్రోత్సహించే దిశగా భారత్‌లో 13 నగరాలు మాత్రమే విధానాలను రూపకల్పన చేయగా వాటిలో కరీంనగర్‌ ఉన్నట్లు గ్రీన్‌ ఎనర్జీ పాలసీ నెట్‌వర్క్‌ అనే అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు గ్రీన్‌ ఎనర్జీ పాలసీ నెట్‌వర్క్‌ ఆర్‌ఈఎన్‌21ను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలో 1300 నగరాలు ఎంపికవగా, కరీంనగర్‌ నగరపాలక సంస్థకు కూడా స్థానం దక్కింది. ఇప్పటికే కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ డీపీఆర్‌లోనే సోలార్‌ పవర్‌ విషయాన్ని పేర్కొన్నది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై సోలార్‌ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు వేసింది. సుమారు నగరంలో 200లకు పైగా మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా ఏర్పాట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే నగరంలో 2700 చదరపు అడుగులు దాటిన అన్ని భవనాలపై తప్పనిసరిగా సోలార్‌ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేయాలని గతంలోనే పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.స్మార్ట్‌సిటీ రెండో దశలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనిలో సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు కూడా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రణాళికలో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోపాటు జాబితా సేకరించి ఏమేరకు నిధులు అవసరం అవుతాయన్న విషయంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రైవేటు భవనాలపైనా ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించడంతో పాటు భారీ విస్తీర్ణంలో ఉన్న భవనాలపై తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా నగరపాలక అధికారులు చర్యలు ప్రారంభిస్తున్నారు. స్మార్ట్‌ ప్రాజెక్టులో భాగంగానే 2019లోనే 19 ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్‌ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌రెడ్‌కో)తో అప్పటి మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీంతోపాటు నగరపాలక సంస్థ కార్యాలయంపైనా సోలార్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Related Posts