YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో గుంపగుత్త అమ్మకాలు

విశాఖలో గుంపగుత్త అమ్మకాలు

విశాఖపట్టణం, ఏప్రిల్ 10, 
వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)కు కేటాయించిన స్థలమిప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రయివేటుపరం కాబోతోంది. పరిపాలన రాజధానిగా చెబుతున్న విశాఖలో విలువైన ప్రజల ఆస్తులను కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు వేగవంతమయ్యాయి. ఈ అమ్మకంలో తమ చేతికి మట్టి అంటకుండా బిల్డ్‌ ఎపి మిషన్‌ కింద గుర్తించిన భూముల అమ్మకం పని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బిసిసి)కు ప్రభుత్వం అప్పగించింది. విశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ శాఖల స్థలాల విక్రయానికి ధర నిర్ణయించే అధికారం స్టేట్‌ లెవల్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి)కి అప్పగిస్తూ 2020 జూన్‌ 12న జిఒ 172ని విడుదల చేసింది. నగర పరిధిలో ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు కేటాయించిన నిరుపయోగ స్థలాలు, ఖాళీ స్థలాల్లో 150 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నట్లు అప్పట్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన 18 స్థలాల్లో వాల్తేరు వార్డు సర్వే నంబర్‌ 1101లోని 13.59 ఎకరాల భూమికి ఎన్‌బిసిసి రూ.1,452 కోట్ల ధర నిర్ణయించింది. వుడా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఈ భూమి కమర్షియల్‌, రెసిడెన్సీ అవసరాల కింద ఉపయోగించుకొనే అవకాశం ఉన్నందున విలువ పెంచింది. అయితే... అసలు కథ ఇక్కడే ఉంది. బీచ్‌ రోడ్డు ఫేసింగ్‌లో రిజిస్ట్రేషన్‌ విలువ వాణిజ్యపరమైన అవసరాలకు చదరపు గజం రూ.86 వేలు, నివాస స్థలం చదరపు గజం రూ.73 వేలు ఉంది. చదరపు గజం ధర సుమారు 2,20,750 కింద (ఎకరా రూ.106,84,32,000) నిర్ణయించారు. 13.59 ఎకరాల స్థలం విలువ రూ.1,452 కోట్లుగా నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్‌, ప్రయివేటు మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నట్లు కన్పిస్తుంది. వాస్తవానికి ఇంత పెద్ద విస్తీర్ణంలో స్థలం విక్రయించినప్పుడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగలిగిన మదుపురులు తక్కువ మంది ఉండడమే కాకుండా, ఉన్నవారు కూడా అంత స్థలం కొనేందుకు పెద్దగా ముందుకురారు. దీనివల్ల పోటీ నామమాత్రం కావడంతో నిర్ణీత ధరకు టెండరుదారు స్థలాన్ని దక్కించుకొని వందల కోట్లు రూపాయలు లాభం పొందుతాడని పరిశీలకులు అంటున్నారు. కమర్షియల్‌, రెసిడెన్సి అవసరం కింద ఎకరా, ఎకరన్నర చొప్పున భాగాలుగా విభజించి టెండర్లు ఆహ్వానిస్తే పోటీలో ఎక్కువ మంది భాగస్వాములై అధిక ధర లభించి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఓ బిల్డర్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు. కొనుక్కోగలిగిన వారి సంఖ్య ఏ మేరకు పెరిగితే ఆ స్థాయిలో ఆదాయం సమకూరుతుందన్నారు. 13.59 ఎకరాల స్థలాన్ని భాగాలుగా విక్రయిస్తే రూ.1,600 కోట్లకు పైబడి ఆదాయం వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తమకు కావాల్సిన వారికి అప్పగించడానికే గుండగుత్తుగా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్న విమర్శలస్తున్నాయి. భారీ షాపింగ్‌ మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు టిడిపి ప్రభుత్వం లూలూ గ్రూపునకు గతంలో ఈ స్థలాన్ని కేటాయించింది. వైసిపి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఏకంగా స్థలం మొత్తాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. ఎపిఐఐసికి చెందిన ఈ స్థలంలో హైదరాబాద్‌ తరహాలో ఐటి టవర్‌ నిర్మించాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాద్‌కు దీటుగా విశాఖలో ఐటి అభివృద్ధి చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా చేసి ఆ స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts