YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓవైపు అంబులెన్స్ మోతలు..మరో వైపు ఆర్తనాదాలు

ఓవైపు అంబులెన్స్ మోతలు..మరో వైపు ఆర్తనాదాలు

వరంగల్, హైదరాబాద్, మే 4, 
అంబులెన్స్‌లకు డబ్బులు. అంత్యక్రియలకు డబ్బులు. ఆసుపత్రిలో చేరాలంటే డబ్బులు. దవాఖానాలో చేర్చుకోవాలంటే డబ్బులు. కరోనా మృతులను కాష్టం ఎక్కించాలంటే డబ్బులు. నలుగురు మోయాలంటే డబ్బులు. ఎంతటి దుర్గతి పడుతోందీ సమాజానికి! కరోనా అనే మహమ్మారి జనం మీద విరుచుకు పడుతూ, వికృతంగా నవ్వుతూ, వికటాట్టాహాసం చేస్తుంటే... కనీసం జాలి లేకుండా... దయ అనే మాటను దాచేస్తూ... కొందరు అకృత్యాలు, అఘాయిత్యాలు చేస్తున్నారు. రోగమొచ్చి ప్రజలు అల్లాడుతుంటే... రోత పుట్టించే పనులు చేస్తూ... జనాల్ని జలగల్లా పీల్చుకుతింటున్నారు. అవును నిజం. ఇది ముమ్మాటికీ నిజం.!! కరోనా బాధితులు, కరోనా రోగులను, వారి బంధువులు పడుతున్న అవస్థలు పెరుగుతున్నాయి.  లక్షల్లో చమురు వదలించుకోవాల్సి వస్తుంది. మమమ్మారి వేటు కంటే... మన ఆసుపత్రుల్లో వేస్తున్న కాటుకే జనం పిట్టల్లా రాలిపోతున్నారేమో అనిపిస్తోంది. రక్కసి పడగ నీడలో బతుకుతూ... బతుకు కోసం పోరాడుతూ... పోరాడి అలిసిపోతూ... చివరకు అసలే పోతున్నా... కనీసం దయ లేదు. ఆ మాటకొస్తే... వాటి అర్థాలే తెలియడం లేదు. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు... వర్తించదని కాదు. కానీ ఇది వాస్తవం. ఇదే వాస్తవం.భాగ్యనగరంలో అంబులెన్స్‌ల మోతలు.. ఆసుపత్రుల్లో కరోనా బాధితుల ఆర్తనాదాలు.. బెడ్లు దొరకాలంటే బేరం కుదరాల్సిందే..దవాఖానాల్లో చేరాలంటే దగుల్బాజీల చేతులు తడపాల్సిందే.. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఈ దందాలే.. ఎవరిని కదలించినా ఈ బాధలే.. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క కరోనా బాధితులు, వారి బంధువులు రోడ్ల మీదే నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు, ఆసుపత్రుల్లో కనిపిస్తున్న విజువల్స్‌కి ఏమాత్రమూ పొంతన లేదు. ఒకవైపు ఆక్సిజన్‌ కొరత. మరోవైపు బెడ్ల కొరత. కోవిడ్ బాధితులు వారి బంధువులు పాపం... బతికుండగానే నరకం చూస్తున్నారు. కాదు... కాదు... ఆసుపత్రి సిబ్బంది నరకం చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే కాదు... ధర్మాసుపత్రుల్లోనూ కాసుల కక్కుర్తే. ఒక్కమాటలో చెప్పాలంటే శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. కరోనా రోగులను బతికించుకునేందు కోసం ఎన్ని పాట్లు పడుతున్నారో... దురదృష్టవశాత్తు వాళ్లు చనిపోతే పాపం అంతే ఇక్కట్లు పడుతున్నారు. రెట్టింపు తంటాలు పడుతున్నారు. ఆసుపత్రుల నుంచి మృతదేహాలను తరలించేందుకు, చివరకు వారి అంతిమ సంస్కారాలు కూడా తలకు మించిన భారమే అవుతోంది. ఆపత్కాలంలో వచ్చి, ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆరాటంలో ఉన్న వారిపై అరాచకం చేస్తున్నారు. మానవత్వానికే మాయని మచ్చ తెస్తున్నారు. రక్కసి కొరలు విప్పి నాట్యమాడుతోంది. మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎన్నో కుటుంబాలు కరోనా కాటుకు విలవిల్లాడుతున్నాయి. ఇక్కడే అరాచక శక్తులు నిద్రలేస్తున్నాయి. ఆపద వేళ ఆదుకోవాల్సిన వాళ్లు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. పాపం కరోనా బాధితులకు, వారి బంధువులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆరోగ్యం విషమించి, ఆసుపత్రి మెట్లెక్కితే ఇక అంతే! లక్షల్లో చేతి చమురు వదిలిస్తున్నారు. కొన్ని ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలతో బయటకు వస్తామన్న గ్యారెంటీ లేదు. ఇటు- హైదరాబాద్‌ రోడ్లను అంబులెన్స్‌లు సైరన్లతో మోత మోగిస్తున్నాయి. ఆ మోతల నడుమే తమ వారిని బతికించుకునేందుకు వారి తరపు బంధువులు పెడుతున్న ఆర్తనాదాలు కంటతడిపెట్టిస్తున్నాయి. ఏ ఆసుపత్రి వద్ద చూసినా హృదయవిదాకర దృశ్యాలే. జిల్లాల నుంచి వచ్చేవారు.... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల ఆసుపత్రుల్లో బెడ్ల కోసం అంబులెన్స్‌లో తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బెడ్స్ ఉండవు. బెడ్స్‌ ఉన్న చోట ఆక్సిజన్ అందదు. ఇక ప్రభుత్వ పెద్దల మాటలకు, వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతనే ఉండటం లేదు. తెలంగాణలోని కోవిడ్ చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులైతే మరీ అధ్వాన్నంగా ఉన్నాయంటున్నారు బాధితులు. గాంధీలో మొత్తం 1850 వివిధ రకాల పడకలుండగా.. అందులో 650 వెంటిలేటర్ బెడ్లు, మరో 650 ఆక్సిజన్ బెడ్లు, మిగిలిన 600 నార్మల్ బెడ్లు ఉన్నాయి. వీటిని కూడా ఆక్సిజన్ బెడ్లుగా మారుస్తున్నారు. వీటితో పాటు మరో 300ల బెడ్లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే 650 వెంటిలేటర్ల బెడ్లు ఇప్పటికే ఫుల్లయ్యాయి. ఆక్సిజన్ బెడ్స్ పరిస్థితీ అంతే. ఎక్కువగా ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్స్ గాంధీకీ క్యూ కడుతున్నారు. గాంధీ ఆసుపత్రులకు వస్తున్న చాలా మంది పేషెంట్లను తిప్పి పంపిస్తున్న విషయాన్ని హెచ్ఎంటీవి నిఘా టీమ్‌ గ్రౌండ్‌లెవ్‌లో పరిశీలించింది. ఎక్కడ చూసినా గుండెలు పిండేసే దృశ్యాలే. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. అయిన వారిని బతికించుకోవాలన్న ఆరాటం... ఆప్తులను గౌరవంగా సాగనంపాలన్న పోరాటం. కాసులుంటేనే కైలాసానికి పంపిస్తామంటూ చెప్పడాలు... డబ్బులిస్తేనే చావుడప్పు మోగిస్తామంటూ బేరాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే లెక్కలు. మోత మోగిస్తున్న అంబులెన్స్‌ల్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితులు... వారిని చూసి పొంగుకొస్తున్న దుఖాన్ని అణచుకుంటున్న బంధువులు. అసలు ఏమైందీ సమాజానికి కృత్రిమ కొరత సృష్టిస్తూ కొందరు. కావాలని వేధిస్తూ మరికొందరు. కాసులుంటేనే అడుగుపెట్టాలంటూ ఇంకొందరు. ఆసుపత్రి డిస్‌ప్లే బోర్డులో ఒకలా... చెప్పడం మరోలా. గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది అయితే చెలరేగిపోతున్నారు. బాధితుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా అంటే... ముందు సిబ్బందిని కన్సల్ట్‌ అయ్యారంటే బెడ్స్ లేవని చెబుతారు. తర్వాత వెయిట్‌ చేయమని సలహా ఇస్తారు. ఆపై మూడు వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తారు. ఇదే విషయాన్ని బాధితులు హెచ్ఎంటీవీ నిఘా టీమ్‌ ముందు గోడు వెల్లబోసుకున్నారు. కరోనా పేషెంట్‌ను ఆసుపత్రిలో చేర్పించిన నాటి నుంచి వారి బంధువులు పడే నరకయాతన మాటల్లో చెప్పలేం. లోపల వారి యోగక్షేమాలు తెలియక ఆసుపత్రి బయట వారు పడే బాధ అంతా ఇంతా కాదు. చికిత్స ఎలా అందిస్తున్నారో చెప్పరు... చనిపోయినా సమాచారం ఇవ్వరు. ఆసుపత్రిలో తమ వారిని బతికించుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో... చనిపోయాక ఆ మృతదేహాలను తరలించేందుకు కూడా అంతకు రెట్టింపు కష్టాలు పడాల్సిందే. మృతదేహాలను తీసుకెళ్లేందుకు సవాలక్ష రూల్స్. మృతుడు నివసించే ప్రాంతం, పోలీస్‌ స్టేషన్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతారు. ఈ వివరాలు నమోదు చేయటానికే ఒకరోజు టైమ్‌ పడుతుంది. మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకోవాలంటే సిబ్బంది చేయి తడపాల్సిందే. అది ఏ వందో రెండొందలో కాదు.. మూడు నుంచి ఐదు వేల వరకు సమర్పించాల్సిందే. అంతా అయ్యి అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నా గగనమే. స్మశానవాటికల వద్ద మరీ దారుణమైన పరిస్థితి. కనీస మానవత్వాన్ని చూపకుండా మూడువేలల్లో పూర్తి కావాల్సిన అంత్యక్రియలకు 25 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతో ఇంతో స్థోమత ఉన్న వారి సంగతి సరే. లేని పేదలకు చచ్చే చావు కావాల్సిందే. కొందరైతే ఇవన్నీ తట్టుకోలేక మృతదేహాలను మార్చురీలోనే వదిలేసి భారమైన గుండెతో వెళ్లాల్సి వస్తోంది. అలా ఎన్నో.. ఎన్నో శవాలు మార్చురీలనే మగ్గుతున్నాయి. ఇంత జరుగుతున్నా... చుట్టూ జరుగుతున్నది చూస్తున్నా... ఏమైనా మార్పు ఉందా ఈ మనుషుల్లో!! మార్పు వస్తుందా ఈ మనుషులకి!! నెవ్వర్‌. రాదు గాక రాదు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు... కనిపిస్తున్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేవు. కరోనా రోగులు, వారి బంధువులు పడుతున్న నరక యాతన తెలుసుకోరు. తెలుసుకున్నా పట్టించుకోరు. పట్టించుకున్నా సరిదిద్దరు. సరిదిద్దినా సమస్యకు పరిష్కారం చూపరు. ఇదంతా చూస్తుంటే... వీళ్లందరితో పోలిస్తే, కరోనాకు కాఠిన్యం తక్కువేమో అనిపిస్తోంది. అది చంపేస్తుందంతే!

Related Posts