YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సినిమా హాళ్లకే... సినిమా కష్టాలు

సినిమా హాళ్లకే... సినిమా కష్టాలు

హైద్రాబాద్, జూన్ 29, 
ఎవరికైనా వరసగా కష్టాలు వచ్చినప్పుడు ...‘అయ్యో...సినిమా కష్టాలురా నాయనా’...అని సానుభూతి చూపిస్తారు. అలాంటిది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకే వరస కష్టాలు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్తో దేశంలోని సినిమా ఇండస్ట్రీపై పెద్ద దెబ్బే పడింది. ఒకవైపు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలు లేక ఆ రంగాలలోని వారు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు దేశంలోని థియేటర్లు కూడా  నెలల తరబడి మూసివేతతో సతమతమవుతున్నాయి. కరోనా సెకండ్వేవ్ పూర్తయ్యే నాటికి మన దేశంలోని 2000 స్క్రీన్లు (థియేటర్లు) పెర్మనెంట్‌‌గా మూతపడతాయనే అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బాక్సాఫీస్ కలెక్షన్స్‌‌పై మరీ ముఖ్యంగా రీజినల్ సినిమాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..తెలంగాణలో 450 వరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్, 260 మల్టీప్లెక్సులు ఉన్నాయి.  ఆంధ్రలో 1300కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. అక్కడ మల్టీప్లెక్సులు తక్కువ. ఫస్ట్ వేవ్ తర్వాత 60 నుండి 70 థియేటర్స్ తెరిచేందుకు ఓనర్స్ ఆసక్తి చూపించలేదని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ  విజయేందర్ రెడ్డి  అన్నారు.  కానీ ఎక్కువ సినిమాలు రిలీజవ్వడంతో, ఆయా చిత్రాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి వలన థియేటర్స్ తెరుచుకోక తప్పలేదని చెప్పారు. తెలంగాణలో సుమారుగా పదిహేను థియేటర్స్, ఆంధ్రలో ఇరవై ఐదు థియేటర్స్ మాత్రమే తెరుచుకోలేదని పేర్కొన్నారు. ‘ఈలోపు సెకెండ్ వేవ్ వచ్చింది. తెలంగాణలో ఇటీవల లాక్ డౌన్ ఎత్తేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా తీసేస్తేనే ఇక్కడ థియేటర్స్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆంధ్రలో థియేటర్స్ ఎక్కువ. అరవై శాతం బిజినెస్ అక్కడే జరుగుతుంది. అందుకే అక్కడ థియేటర్స్ తెరుచుకునే రోజు కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు’ అని విజయేందర్‌‌‌‌ పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది, కానీ ఇవ్వలేదని  చెప్పారు. ఆంధ్రలో రాయితీలు ఇచ్చారు కానీ టికెట్ రేట్స్ తగ్గించారని,  దాంతో టికెట్ రేట్స్ పెంచితేనే అక్కడి థియేటర్స్‌‌ తెరుస్తామని థియేటర్ల ఓనర్లు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘మల్టీప్లెక్సులకి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆల్ ఇండియా స్థాయిలో తీసుకుంటారు. వరల్డ్ సినిమాలు, దేశవ్యాప్తంగా రిలీజయ్యే సినిమాలనే ఎక్కువగా వాళ్లు రిలీజ్ చేస్తారు. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌‌లో తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజవుతాయి. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయితేనే సినిమాల రిలీజ్ సాధ్యమవుతుంది’ అని విజయేందర్‌‌‌‌ పేర్కొన్నారు. బ్లాక్బస్టర్ అయ్యే సినిమాలను రిలీజ్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవైపు తహతహలాడుతోంది. కానీ, ఆ సినిమాలను ప్రదర్శించేందుకు థియేటర్లు ఎన్ని మిగిలుంటాయనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. దేశంలోని 2 వేల థియేటర్లు మూతపడతాయని ఇండస్ట్రీ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, బీహార్‌‌‌‌లోని కతిహార్ వద్ద  చాలా ఏళ్ల నుండి నడుస్తున్న వసంత్ సినిమా శాశ్వతంగా క్లోజవనుంది. ఈ సినిమా టాకీస్‌‌ను మూసేయాలని మేనేజ్‌‌మెంట్ నిర్ణయించింది. అదేవిధంగా, ఫోర్బ్స్గంజ్ వద్ద ఉన్న ప్రేమ్ టాకీస్‌‌ను కూడా  తిరిగి తెరవకూడదని నిర్ణయించుకుంది మేనేజ్‌‌మెంట్. సౌత్ ఇండియాలో చూస్తే, మైసూరులోని 70 ఏళ్ల నాటి లక్ష్మీ థియేటర్, శ్రీ నాగరాజ థియేటర్లు బంద్ కాబోతున్నాయి. ఎర్న్స్ట్ అండ్ యంగ్ 2020 రిపోర్టు ప్రకారం  కొవిడ్–19 కి ముందు మన దేశంలో మొత్తం 9,527 స్క్రీన్లు ఉండేవి. వాటిలో 6,327 సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే, 3,200 మల్టీ ప్లెక్స్‌‌లలో థియేటర్లు. కిందటేడాది సుమారు 1000 స్క్రీన్‌‌లను మూసేశారు.  ఈ ఏడాది మళ్లీ కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్‌‌తో చాలా మంది ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను మూసేయాలని చూస్తున్నారు. అంటే, ఇండియాలోని థియేటర్ల సంఖ్య 7 వేలకి తగ్గిపోతుంది. దీని ప్రభావం తప్పనిసరిగా బాక్సాఫీస్ కలెక్షన్లపై పడనుంది.రీజినల్ సినిమాపై, ముఖ్యంగా తెలుగు, తమిళ్‌‌, కన్నడ, మలయాళం సినిమాలపై థియేటర్ల మూసివేత ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తౌరాని చెప్పారు.  ఎందుకంటే, రీజినల్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లలో 60–65 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచే వస్తోంది. బాలీవుడ్‌‌గా పిలుచుకునే హిందీ సినిమా ఇండస్ట్రీపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని ఒర్మాక్స్ మీడియా (మీడియా కన్సల్టింగ్ కంపెనీ) సీఈఓ శైలేష్ కపూర్ చెప్పారు. హిందీ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లలో 70 శాతం మల్టీప్లెక్స్‌‌ల నుంచే వస్తోందని, సింగిల్ స్క్రీన్ల కంట్రిబ్యూషన్ తక్కువని పేర్కొన్నారు. ఫలితంగా కలెక్షన్లపై థియేటర్ల మూసివేత ప్రభావం అంతగా ఉండదని అన్నారు. అంతమాత్రాన సింగిల్‌‌ స్క్రీన్‌‌లను తక్కువగా చూడలేము. వాటికి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది.   సింగిల్ స్క్రీన్‌‌లకు చాలా ఏళ్ల నుంచి బాలీవుడ్ అలవాటు పడింది. సింగిల్‌‌ స్క్రీన్ థియేటర్ల మూసివేత వల్ల ఒక్కో బాలీవుడ్ సినిమాకు రూ. 40–50 కోట్ల కలెక్షన్ పోతుందని అంచనా.ఒక ప్రాంతంలోని థియేటర్ మూతపడితే, అక్కడి ఆడియెన్స్‌‌ను పోగొట్టుకున్నట్లే. ఆ ఏరియాలోని ఆడియెన్స్ అప్పుడు పైరేటెడ్ వెర్షన్స్ వైపు మళ్లుతారు. అంటే, తన మార్కెట్‌‌ను తానే సినిమా ఇండస్ట్రీ చంపేసుకున్నట్లని చౌహాన్ అన్నారు. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలపై సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2018లో రిలీజయిన రణ్‌‌బీర్ కపూర్ సినిమా ‘సంజు’, రాజ్కుమార్ రావు సినిమా ‘స్త్రీ’ కలెక్షన్లలో 40–45 శాతం నాన్–మల్టీప్లెక్స్ జోన్‌‌ల నుంచే వచ్చాయి. అదే ఏడాదిలో జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏకంగా 70 శాతం సింగిల్ స్క్రీన్స్ నుంచే వచ్చాయి.  సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు కొంత తక్కువ కావడంతో ఎక్కువ మంది చూడటానికి వచ్చేవారని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ఈ ఏడాది మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనుండటంతో థియేటర్లకు వచ్చేవారు తగ్గుతారు.ఓవైపు థియేటర్ల మూసివేతతో వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంటే, మరోవైపు కొత్త స్క్రీన్లు రావడం లేదు. స్క్రీన్‌‌ల సంఖ్య ఇప్పట్లో పెరిగే సూచనలు లేవు. కొవిడ్–19 కి ముందు 350–400 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే, 200–250 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఓపెనయ్యేవి. ఇప్పుడలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు.  మల్టీప్లెక్స్‌‌లు కొత్త స్క్రీన్లను ఇప్పుడే తేవడం లేదని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కువగా స్క్రీన్లున్న మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చాలా తక్కువ కొత్త స్క్రీన్లను యాడ్ చేస్తోంది. గత అయిదారేళ్లలో చూస్తే ఇంత తక్కువ స్క్రీన్లను యాడ్ చేయడం ఇదే మొదటిసారని పీవీఆర్ సీఎఫ్‌‌ఓ నితిన్ సూద్ గతంలో చెప్పారు. 16 స్క్రీన్లను మూసేసిన పీవీఆర్‌‌‌‌కు ప్రస్తుతం 842 స్క్రీన్లు ఉన్నాయి. సిచ్యుయేషన్ నార్మల్ అయ్యేదాకా వేచి ఉండాలని పీవీఆర్ భావిస్తోంది. ఇందుకోసమే క్యాపెక్స్‌‌ను సస్పెండ్ చేసింది కూడా. దేశంలోని ఇతర మల్టీప్లెక్స్ ఆపరేటర్లూ ఇదే దారిలో నడుస్తున్నారు. లాక్డౌన్లతో రెవెన్యూ పడిపోవడం వల్ల విస్తరణ ప్లాన్స్ను వాయిదా వేస్తున్నట్లు ఐనాక్స్ లీజర్ సీఈఓ అలోక్ టాండన్ చెప్పారు. బాలీవుడ్‌‌తోపాటు, చాలా రీజినల్ సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్‌‌కు రెడీగా ఉన్నాయి. కాకపోతే, ఇదే టైములో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు బందవుతున్నయ్‌‌.

Related Posts