YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

15 మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలు

15 మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలు

అదిలాబాద్, జూలై 20, 
ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. పంట నాలుగేండ్లలో చేతికి రానున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ అందజేయాలని నిశ్చయించింది. ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26 వేలు, ఆ తర్వాత రెండు, మూడు సంవత్సరాల్లో రూ.5 వేల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మున్ముందు మంచిర్యాల జిల్లాలో సాగు భారీగా పెరగనుండగా, ఆ పంట వేసే రైతన్నలకు మంచి లాభాలు వచ్చే అవకాశమున్నది.ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. సాగులో పలు ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పంట సాగు విధానం గురించి తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోస్టారికా, మలేషియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలో పర్యటించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు భారీగా పెరిగే అవకాశం ఉంది. సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, మూడేండ్లలో రూ.36 వేల ప్రోత్సాహకాన్ని అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ పంట ఒకసారి పెట్టుబడితో 30 ఏండ్ల పాటు ఆదాయం రానుండడంతో అన్నదాతలు ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ సాగువైపు ఆకర్షితులవుతున్నారు. ఆయిల్‌ పామ్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. దీనికి అనుబంధంగా ఆయా జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. మొక్కల పెంపకానికి అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీని పెంచాలని తెలిపింది.  అంతరపంటగా కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.జిల్లాలో ఆయిల్‌ పామ్‌ తోటలకు 15 మండలాల్లో అనువైన వాతావరణం ఉందని కేంద్ర సంస్థల సర్వే అధికారులు స్పష్టంచేశారు. 2020-21 సంవత్సరానికి గాను పైలెట్‌ ప్రాజెక్టు కింద చెన్నూర్‌ నియోజకవర్గం క్షేత్రానికి 400 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు గాను 407.32 ఎకరాలకు 152 మంది ఆయిల్‌ పామ్‌ రైతులను గుర్తించి కలెక్టర్‌తో పరిపాలన అనుమతి తీసుకున్నారు. భీమారం మండలంలోని అంకూసాపూర్‌, కొత్తపల్లి, మద్దికల్‌, చెన్నూర్‌ మండలకేంద్రంతో పాటు మండలంలోని అక్కెపల్లి, బీరవెల్లి, చాకెపల్లి, ఎల్లక్కపేట, కత్తెరశాల, కొమ్మెర, కోనంపేట, పొక్కూర్‌, సుందరశాలలో ఆయిల్‌ పామ్‌ తోటలను పెంచుతున్నారు. వీటితో పాటు జైపూర్‌ మండలంలోని ఎల్కంటి, ఇందారం, కిష్టాపూర్‌, కుందారం, పౌనూర్‌, రామారావుపేట, రొమ్మిపూర్‌, టేకుమట్ల, కోటపల్లి మండలకేంద్రంతోపాటు మండలంలోని అర్జునగుట్ట, కొండంపేట, లింగంపేట్‌, రాంపూర్‌, సర్వాయిపేట్‌, శంకరాపూర్‌, సిర్సా, మందమర్రి మండలంలోని అందుగుల పేట, చిర్రకుంట, లేమూర్‌, పొన్నారం, సారంగపల్లి, తిమ్మాపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో రైతులు తోటలను పెంచుతున్నారు. దిగుమతులను తగ్గించేందుకు, దేశంలోనే పంటను అధికంగా సాగుచేసేందుకు ఆయిల్‌ పామ్‌ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు ఎకరంలో సాగుకు రూ.62,340 ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వమే రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడంతో రైతు కేవలం రూ.32,340 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా బ్యాంకుల ద్వారా రుణాలు అందించనుంది. ఈ రుణాలను కూడా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేండ్ల పాటు మారిటోరియం విధించేలా బ్యాంకులను ఒప్పించింది. ఈ పంట ఒకసారి వేస్తే 30 ఏండ్లు ఆదాయం వస్తుంది. నాలుగేండ్లలోనూ అంతరపంటలు వేసుకోవడంతో లాభం చేకూరుతుంది. డ్రిప్‌ సిస్టంతో నీరు ఆదా అవుతుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.ఆయిల్‌ పామ్‌ తోటలను జిల్లాలో మ్యాట్రిక్స్‌ కంపెనీ పర్యవేక్షిస్తున్నది. ప్రభుత్వ సబ్సిడీ, ప్రోత్సాహకాలు, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు యథావిధిగా అందుతున్నాయి. మ్యాట్రిక్స్‌ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్‌ పామ్‌ మొక్కలు సరఫరా చేసేందుకు భీమారం మండలంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు, సదరు నర్సరీలో పెంచుతున్నట్లు ఆ సంస్థ జిల్లా ప్రతినిధి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. కోస్టారికాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆయిల్‌ పామ్‌ మొలకలు తెప్పించి, త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. రైతులకు మేలు చేకూర్చేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, వారికి లాభం చేకూర్చేందుకే వివిధ దేశాల నుంచి మొలకలు దిగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.

Related Posts